Telugu Global
Sports

యూఎస్ మహిళా క్రికెట్ జట్టులో.. ఆరుగురు తెలుగు ప్లేయర్లు

అమెరికా అండర్-19 మహిళా క్రికెట్ జట్టులో ప్రకటించిన వారిలో ఆరుగురు తెలుగు అమ్మాయిలు ఉన్నారు.

యూఎస్ మహిళా క్రికెట్ జట్టులో.. ఆరుగురు తెలుగు ప్లేయర్లు
X

ఐసీసీ తొలి సారిగా మహిళల టీ20 అండర్-19 వరల్డ్ కప్‌ను వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించనున్నది. పురుషుల తొలి టీ20 వరల్డ్ కప్ ఎక్కడైతే మొదలైందో.. అదే సౌతాఫ్రికా వేదికగా మహిళల అండర్-19 తొలి టీ20 వరల్డ్ కప్ జరుగనున్నది. కాగా, ఈ వరల్డ్ కప్‌లో యూఎస్ఏ నుంచి మహిళల జట్టు కూడా పాల్గొనబోతోంది. అండర్-19 వరల్డ్ కప్‌లో పాల్గొననున్న యూఎస్ఏ జట్టును బుధవారం ప్రకటించారు. మొత్తం 15 మందితో కూడిన జట్టును అనౌన్స్ చేయగా అందులో ఆరుగురు తెలుగు అమ్మాయిలు ఉండటం ఆశ్చర్యపరుస్తోంది.

అమెరికాలో బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్ తర్వాత బేస్‌బాల్‌కే ఎక్కువ ఆదరణ ఉంటుంది. అయితే గత కొన్నేళ్లుగా భారతీయులు అక్కడ క్రికెట్‌ను పరిచయం చేసి.. చాలా అభివృద్ధి చేశారు. అమెరికాలోని ఫ్లోరిడాలో అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా జరుగుతున్నాయి. యూఎస్ క్రికెట్ అసోసియేషన్.. ఐసీసీ అనుబంధ సభ్యత్వం కలిగి ఉన్నది. అదే సమయంలో మహిళల జట్టు విశేషంగా రాణిస్తోంది. దీంతో ఈ సారి ఏకంగా అండర్-19 టీ20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించిది. దీంతో యూఎస్ క్రికెట్ బోర్డు 15 సభ్యులు గల జట్టును ప్రకటించింది.

అమెరికా అండర్-19 మహిళా క్రికెట్ జట్టులో ప్రకటించిన వారిలో ఆరుగురు తెలుగు అమ్మాయిలు ఉన్నారు. జట్టు కెప్టెన్‌గా ప్రకటించిన కొడాలి గీతతో పాటు వైస్ కెప్టెన్ అంకితా రెడ్డి కూడా తెలుగు అమ్మాయే. వీరిద్దరితో పాటు జట్టులో భూమికా భద్రిరాజు, లాస్య ప్రియ, సాయి తన్మయి జట్టులో స్థానం సంపాదించారు. ఇక రిజర్వ్ బెంచ్‌లో కస్తూరి వేదాంతంకు చోటు లభించింది. అమెరికాలో తెలుగు వాళ్లంటే సాఫ్ట్‌వేర్, మ్యాథ్స్, స్పెల్‌బీలో రాణిస్తారనే పేరుంది. కానీ తొలి సారి క్రికెట్ జట్టులో సగానికి పైగా సభ్యులు తెలుగు వారు ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

అప్పుడే ట్రోలింగ్...

యూఎస్ఏ అండర్-19 మహిళా జట్టును ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వచ్చింది. జట్టులో ఆరుగురు తెలుగు అమ్మాయిలు (భారతీయులు) ఉండటం చూసి స్థానిక అమెరికన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఇంతకు ఇది అమెరికా జట్టా? లేదంటే 'ఇండియా బీ' టీమా అంటూ విమర్శలు గుప్పించారు. యూఎస్ఏ క్రికెట్ బోర్డు భారత ఉప ఖండం అంటే చాలా ప్రేమ కనపరుస్తోందని ఎద్దేవా చేస్తున్నారు. కాగా, యూఎస్ క్రికెట్ బోర్డు ప్రకటించిన జట్టులోని తెలుగు అమ్మాయిలు అందరూ అమెరికాలోనే పుట్టారు. వారి తల్లిదండ్రులు ఎన్నో ఏళ్ల క్రితమే యూఎస్ఏకి వలస వచ్చారు. ఎన్ఆర్ఐ పేరెంట్స్‌కి పుట్టిన వాళ్లు.. జన్మతః అమెరికన్లే కావడం గమనార్హం.

జట్టు కెప్టెన్‌గా ఎంపికైన గీతిక (18) తన స్నేహితులతో కలిసి 11 ఏళ్ల నుంచే క్రికెట్ ఆడటం మొదలు పెట్టింది. తన 15వ ఏట కాలిఫోర్నియాలోని క్రికెట్ జీల్ అకాడమీలో శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. అనేక క్రికెట్ లీగ్స్‌లో ఆడిన గీతికను.. స్థానిక క్రికెట్ అభిమానులు గీతు, గీత్స్ అనే ముద్దు పేరుతో పిలుస్తుంటారు. వైస్ కెప్టెన్ అంకిత (16) తన తొమ్మిదో ఏట నుంచే క్రికెట్ ఆడుతోంది. వికెట్ కీపర్/బ్యాటర్‌గా రాణిస్తున్న అంకిత కుటుంబంలో అనేక మందికి క్రికెట్‌తో సంబంధం ఉంది. అంకిత తండ్రి, సోదరులు క్రికెట్ పిచ్‌ల క్యూరేటర్లు, కోచ్‌లుగా పని చేస్తున్నారు.అంతే కాకుండా క్రికెట్ సంబంధిత సామాగ్రి సప్లయర్లుగా ఉన్నారు.ఓ సారి ఇండియా పర్యటనలో బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో అంకిత అర్థ సెంచరీ చేసింది.

ఇక ఇదే జట్టులో ఉన్న లాస్య (17) ఐదేళ్ల క్రితం నుంచి ప్రొఫెషనల్‌ క్రికెట్ ఆడుతోంది. టీమ్ యూఎస్ఏకు ఆడటం తన డ్రీమ్ అని ఎన్నోసార్లు చెప్పిన లాస్య.. చివరకు తన కల నెరవేర్చుకున్నది.

First Published:  16 Dec 2022 1:29 PM GMT
Next Story