Telugu Global
Sports

టీ-20 తొలి ఓవర్లోనే 4 వికెట్లు, షాహీన్ ఆఫ్రిదీ ప్రపంచ రికార్డు!

పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ ఆఫ్రిదీ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

టీ-20 తొలి ఓవర్లోనే 4 వికెట్లు, షాహీన్ ఆఫ్రిదీ ప్రపంచ రికార్డు!
X

పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ ఆఫ్రిదీ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఓ టీ-20 మ్యాచ్ తొలి ఓవర్లోనే 4 వికెట్లు పడగొట్టడం ద్వారా ఈ ఘనత సాధించాడు...

పాకిస్థాన్ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ షాహీన్ ఆఫ్రిదీ టీ-20 క్రికెట్లో ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లీష్ టీ-20 బ్లాస్ట్ మ్యాచ్ లో నాటింగ్ హామ్ షైర్ కు ఆడుతున్న షాహీన్ ప్రత్యర్థి వార్విక్ షైర్ పైన విశ్వరూపం ప్రదర్శించాడు.

ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో షాహీన్ ఆఫ్రిదీ తన తొలిఓవర్ ఆరుబంతుల్లోనే 4 వికెట్లు పడగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. 23 సంవత్సరాల షాహీన్ మెరుపువేగానికి స్వింగ్ ను జోడించి చెలరేగిపోయాడు.

6 బంతుల్లో 4 వికెట్లు....

తమజట్టు తరపున తొలి ఓవర్ బౌలింగ్ కు దిగిన షాహీన్ ప్రత్యర్థి వార్విక్ షైర్ కెప్టెన్ అలెక్స్ డేవిస్ ను డకౌట్ గా ఎల్బీడబ్లు చేశాడు. రెండోబంతికే క్రిస్ బెంజామిన్ ను పెవీలియన్ దారి పట్టించాడు.

ఆ తర్వాతి రెండుబంతుల్లో వికెట్ పడగొట్టడంలో విఫలమైన షాహీన్ ఓవర్ ఆఖరి రెండుబంతుల్లో రెండు వికెట్లు పడగొట్టడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 5వ బంతికి ఓలీ స్టోన్ ను, ఆఖరి బంతికి ఎడ్వర్డ్ బెర్నార్డ్ ను అవుట్ చేశాడు. షాహీన్ దెబ్బకు ముగ్గురు బ్యాటర్లు గోల్డెన్ డక్ గా వెనుదిరిగాల్సి వచ్చింది.

రెండుదశాబ్దాల టీ-20 చరిత్రలో మ్యాచ్ తొలి ఓవర్ ఆరు బంతుల్లోనే 4 వికెట్లు పడగొట్టిన తొలి, ఏకైక బౌలర్ గా షాహీన్ ఆఫ్రిదీ నిలిచాడు.

ఈ మ్యాచ్ లో షాహీన్ చెలరేగినా నాటింగ్ హామ్ షైర్ కు పరాజయం తప్పలేదు. 169 పరుగుల విజయలక్ష్యాన్ని వార్విక్ షైర్ 19.1 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికే సాధించగలిగింది.

షాహీన్ ఆఫ్రిదీ తన కోటా 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.



First Published:  6 July 2023 1:15 AM GMT
Next Story