Telugu Global
Sports

మహిళా ఫుట్ బాల్ కు మరింత దన్ను!

అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య మహిళల కోసం నిర్వహించే ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ లో విజేత జట్లకు గతంలో కంటే మూడురెట్లు అధికంగా ప్రైజ్ మనీ, ఇతర ప్రోత్సాహక నగదు బహుమతులు ఇవ్వాలని నిర్ణయించారు.

మహిళా ఫుట్ బాల్ కు మరింత దన్ను!
X

ప్రపంచ ఫుట్ బాల్ లో మహిళలను మరింతగా ప్రోత్సహించాలని అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య నిర్ణయించింది. 2023 ఫిఫా మహిళా ప్రపంచకప్ కోసం గతంలో కంటే మూడురెట్లు ఎక్కువగా నిధులు కేటాయించనుంది...

అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య మహిళల కోసం నిర్వహించే ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ లో విజేత జట్లకు గతంలో కంటే మూడురెట్లు అధికంగా ప్రైజ్ మనీ, ఇతర ప్రోత్సాహక నగదు బహుమతులు ఇవ్వాలని నిర్ణయించారు.

కిగాలీలో జరిగిన ఫిఫా సర్వసభ్యసమావేశంలో అధ్యక్షుడు గియాన్నీ ఇన్ ఫాంటినో అధికారికంగా ప్రకటించారు.

2023 ప్రపంచకప్ కు కౌంట్ డౌన్...

ఫుట్ బాల్ క్రీడలో పురుషులకు, మహిళలకు నిబంధనలు ఒకేతీరుగా ఉంటాయి. ఫుట్ బాల్ మైదానం పొడవు, వెడల్పుల వైశాల్యంలో ఏవిధమైన తేడా ఉండదు.

అదే క్రికెట్లో మాత్రం..పురుషులకు 65 నుంచి 75 మీటర్ల బౌండ్రీ లైన్లు ఉంటే..మహిళలకు మాత్రం కుదించిన( 50 మీటర్ల ) బౌండ్రీలైన్లతో మాత్రమే మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు.

పురుషులతో సమానంగా కష్టపడుతున్న మహిళలకు దన్నుగా నిలవాలని ఫిఫా నిర్ణయించింది. మహిళా ఫుట్ బాల్ కోసం నిధుల కేటాయింపులో మరింత ఉదారంగా వ్యవహరించాలని భావిస్తోంది.

కెనడా వేదికగా ముగిసిన 2015 మహిళా ప్రపంచకప్ లో కోటీ 50 లక్షల డాలర్లు, 2019 ప్రపంచకప్ లో 5 కోట్ల డాలర్లు కేటాయిస్తే..2023 ఫిఫా ప్రపంచకప్ లో మాత్రం ఆ మొత్తాన్ని మూడురెట్లుకు పెంచనున్నట్లు తెలిపింది.

ఆస్ట్ర్రేలియా-న్యూజిలాండ్ దేశాల సంయుక్త ఆతిథ్యంలో జరుగనున్న 2023 ప్రపంచకప్ ఫుట్ బాల్ నిర్వహణ కోసం ప్రైజ్ మనీతో కలుపుకొని 152 మిలియన్ డాలర్లు కేటాయించారు.

ఈ మొత్తంలో వివిధ క్లబ్ జట్లకు ఇచ్చే నష్టపరిహారంతో పాటు.. ప్రపంచకప్ బరిలో నిలిచే జట్లకు గ్యారెంటీమనీతో పాటు..ప్రైజ్ మనీ సైతం ఇమిడి ఉంది.

24 నుంచి 32 కు పెరిగిన జట్లు..

ప్రపంచకప్ ఫైనల్ రౌండ్లో తలపడే మహిళల జట్ల సంఖ్యను సైతం పెంచడానికి ఫిఫా రంగం సిద్ధం చేసింది. ఫ్రాన్స్ వేదికగా ముగిసిన 2019 ప్రపంచకప్ లో 24 దేశాలజట్లు మాత్రమే పోటీపడ్డాయి. అయితే..2023 ప్రపంచకప్ లో మాత్రం జట్ల సంఖ్యను 24 నుంచి 32కు పెంచారు.

ఖతర్ రాజధాని దోహా వేదికగా జరిగిన 2022 ఫిఫా పురుషుల ప్రపంచకప్ లో విజేతలకు 440 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ అందచేశారు.

పురుషుల ప్రపంచకప్ కు వచ్చిన ఆదాయంతో పోల్చిచూస్తే..మహిళా ప్రపంచకప్ కు 20 శాతం తక్కువగా వస్తోందని, స్పాన్సర్లు, బ్రాండ్ కాస్టర్లు సైతం మహిళా ప్రపంచకప్ కు భారీమొత్తాలు చెల్లించడానికి ఆసక్తి చూపడం లేదని వివరించారు. అయినా ..మహిళా ఫుట్ బాల్ కోసం అధికమొత్తం లో నిధులు కేటాయిస్త్తూ దన్నుగా నిలవాలని నిర్ణయించినట్లు ఫిఫా ప్రకటించింది.

పురుషులతో సమానంగా మహిళలకూ ప్రైజ్ మనీ చెల్లించాలన్నదే తమ లక్ష్యమని..అయితే..మహిళల ఫుట్ బాల్ కు లభిస్తున్న ఆదాయం, ఆదరణ అంతంత మాత్రంగానే ఉన్నాయని వివరించింది.

First Published:  20 March 2023 4:18 AM GMT
Next Story