Telugu Global
Sports

19 ఏళ్లకే నంబర్ వన్.. స్పానిష్ కుర్రోడి సరికొత్త రికార్డు!

ప్రపంచ పురుషుల టెన్నిస్‌లో స్పానిష్ చిన్నోడు కార్లోస్ అల్ కరాజ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 2022 యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గడం ద్వారా 19 సంవత్సరాల చిరుప్రాయంలోనే ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించిన మొనగాడిగా నిలిచాడు...

19 ఏళ్లకే నంబర్ వన్.. స్పానిష్ కుర్రోడి సరికొత్త రికార్డు!
X

2022 గ్రాండ్ స్లామ్ సీజన్ ఆఖరి టోర్నీ యూఎస్‌ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్పానిష్ చిరుత, 19 సంవత్సరాల కార్లోస్ అల్ కరాజ్ గెలుచుకోడం ద్వారా అరుదైన ఘనతను సాధించాడు. న్యూయార్క్ లోని ఆర్థర్ యాష్ స్టేడియంలో జరిగిన టైటిల్ సమరంలో 3వ సీడ్ అల్ కరాజ్ నాలుగు సెట్ల పోరులో నార్వే ఆటగాడు కాస్పర్ రూడ్‌ను అధిగమించడం ద్వారా అత్యంత పిన్నవయసులో గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గిన మొనగాడిగా నిలిచాడు.

నాడు సంప్రాస్..నేడు అల్ కరాజ్...

యూఎస్‌ ఓపెన్ పురుషుల సింగిల్స్ చరిత్రలో అత్యంత పిన్నవయసులో టైటిల్ నెగ్గిన ఆటగాడిగా అమెరికాకే చెందిన పీట్ సంప్రాస్ 1990లో నెలకొల్పిన రికార్డును 2022 టోర్నీలో 19 సంవత్సరాల కార్లోస్ అల్ కరాజ్ అధిగమించాడు. టైటిల్ సమరంలో అల్ కరాజ్ 6-4, 2-6, 7-6, 6-3తో 5వ సీడ్ కాస్పర్ రూడ్ పై సంచలన విజయం సాధించాడు. అల్ కరాజ్ మొత్తం 14 ఏస్‌లతో పాటు 55 విన్నర్లతో ప్రత్యర్థి పై ఆధిపత్యం ప్రదర్శించాడు.

25 గంటలపాటు కోర్టులోనే...

గ్రాండ్ స్లామ్ ఓ టోర్నీలో అత్యధిక సమయం కోర్టులో గడిపిన ఆటగాడిగా అల్ కరాజ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 2018 వింబుల్డన్ టోర్నీ ఆడుతూ కెవిన్ యాండర్సన్ 23 గంటల 21 నిముషాల పాటు కోర్టులో గడిపాడు. అయితే..ప్రస్తుత యూఎస్ ఓపెన్ టోర్నీలో పాల్గొనడం ద్వారా ఆ రికార్డును అల్ కరాజ్ తెరమరుగు చేయగలిగాడు. ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ నుంచి అల్ కరాజ్ ఆడిన ప్రతి మ్యాచ్ నాలుగున్నర గంటల పాటు జరగడం విశేషం. స్పానిష్ దిగ్గజం రాఫెల్ నడాల్ తన ఆరాధ్యదైవమని, నడాల్ ప్రేరణతోనే తాను టెన్నిస్ రాకెట్ చేతపట్టానని చెబుతున్న అల్ కరాజ్..19 సంవత్సరాల చిరుప్రాయంలోనే ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించిన తొలి ప్లేయర్‌గా రికార్డుల్లో చేరాడు.

రూడ్‌కు మళ్లీ నిరాశే..

ప్రస్తుత సీజన్లో రెండు గ్రాండ్ స్లామ్ టోర్నీల ఫైనల్స్ చేరిన తొలి నార్వే ఆటగాడి ఘనతను దక్కించుకొన్న 23 సంవత్సరాల కాస్పర్ రూడ్ చివరకు...అమెరికన్ ఓపెన్లో సైతం రన్నరప్ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2022 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో రాఫెల్ నడాల్ చేతిలో ఓటమి పొందిన రూడ్...యూఎస్‌ ఓపెన్‌లో సైతం మరో స్పానిష్ ఆటగాడు కార్లోస్ అల్ కరాజ్ చేతిలో పరాజయం పొందడం విశేషం.

ప్రస్తుత సీజన్ ఆఖరి గ్రాండ్ స్లామ్ టోర్నీ యూఎస్‌ ఓపెన్ పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాలలో దిగ్గజ క్రీడాకారులంతా విఫలమైతే...యువ క్రీడాకారులు అల్ కరాజ్, ఇగా స్వియాటెక్ విజేతలుగా నిలవడం మరో అరుదైన రికార్డుగా నిలిచిపోతుంది.

First Published:  12 Sep 2022 7:10 AM GMT
Next Story