Telugu Global
Sports

గంటకు 155 కిలోమీటర్లు...ఐపీఎల్ లో మరో 'అగ్గిపిడుగు'!

ఐపీఎల్ 2024 సీజన్ ద్వారా మరో మెరుపు ఫాస్ట్ బౌలర్ తెరమీదకు వచ్చాడు. గంటకు 155.8 కిలోమీటర్ల వేగంతో బంతి విసిరి తనజట్టుకు తొలి విజయం అందించాడు.

గంటకు 155 కిలోమీటర్లు...ఐపీఎల్ లో మరో అగ్గిపిడుగు!
X

ఐపీఎల్ 2024 సీజన్ ద్వారా మరో మెరుపు ఫాస్ట్ బౌలర్ తెరమీదకు వచ్చాడు. గంటకు 155.8 కిలోమీటర్ల వేగంతో బంతి విసిరి తనజట్టుకు తొలి విజయం అందించాడు.

గత 17 సీజన్లుగా జరుగుతున్న ఐపీఎల్ లో అత్యంత వేగంతో బంతులు విసిరిన భారత బౌలర్ గా జమ్మూ-కాశ్మీర్ కు చెందిన ఉమ్రాన్ మాలిక్ పేరుతో రికార్డు ఉంది.

అయితే..ఆ రికార్డును ఢిల్లీ కమ్ లక్నో సూపర్ జెయింట్స్ యువఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ అధిగమించాడు.

లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియం వేదికగా జరిగిన పోరులో పంజాబ్ కింగ్స్ పై ఆతిథ్య లక్నో సూపర్ జెయింట్స్ 21 పరుగుల విజయం సాధించడంలో మయాంక్ ప్రధానపాత్ర వహించాడు.

హోరాహోరీ పోరులో..నిప్పులు చెరిగే బౌలింగ్ తో....

పంజాబ్ కింగ్స్- లక్నో సూపర్ జెయింట్స్ జట్ల నడుమ జరిగిన ఈ పోరు నువ్వానేనా అన్నట్లుగా సాగింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన లక్నోజట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 199 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది.

సమాధానంగా 200 పరుగుల భారీటార్గెట్ తో చేజింగ్ కు దిగిన పంజాబ్ కు ఓపెనింగ్ జోడీ శిఖర్ ధావన్ ( 70 ), జానీ బెయిర్ స్టో ( 42 ) అద్దిరిపోయే ఆరంభాన్ని ఇచ్చినా..మిడిల్ ఓవర్లలో మయాంక్ మెరుపువేగంతో బంతులు విసురుతూ ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాడు.

గంటకు 150 కిలోమీటర్ల సగటు వేగంతో బౌలింగ్ చేసిన మయాంక్ 155.8 కిలోమీటర్లతో అత్యంత వేగంతో కూడిన బంతిని విసిరాడు. తన కోటా 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టడం ద్వారా ప్రస్తుత సీజన్లో లక్నోకు తొలి విజయం అందించాడు. ఇన్నింగ్స్ 10 వ ఓవర్లో బౌలింగ్ కు దిగిన మయాంక్ 145కిలోమీటర్లు మించిన వేగంతో 18 బంతులు సంధించాడు. కేవలం 2 ఫోర్లు మాత్రమే ఇచ్చాడు.

అరంగేట్రం మ్యాచ్ లోనే అదరొగొట్టడం ద్వారా మయాంక్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోగలిగాడు.

ఢిల్లీకి చెందిన 21 సంవత్సరాల మయాంక్ యాదవ్ ను 20 లక్షల రూపాయల కనీస ధరకు లక్నో ఫ్రాంచైజీ సొంతం చేసుకొంది. గత సీజన్లో గాయాలతో అవకాశాలు దక్కించుకోలేకపోయిన మయాంక్ ప్రస్తుత సీజన్లో మాత్రం అంది వచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోడం ద్వారా సత్తా చాటుకోగలిగాడు.

ఐపీఎల్ చరిత్రలో మెరుపు ఫాస్ట్ బౌలర్లు...

ఐపీఎల్ 17 సీజన్ల చరిత్రలో అత్యంత వేగంగా బంతి విసిరిన ఫాస్ట్ బౌలర్ రికార్డు ఆస్ట్ర్రేలియాకు చెందిన షేన్ టెయిట్ పేరుతో ఉంది. టెయిట్ 157.7 కిలోమీటర్ల వేగంతో వేసిన బంతే ఇప్పటి వరకూ ఐపీఎల్ రికార్డుగా ఉంది. ఆ తర్వాతి స్థానాలలో భారత్ కు చెందిన ఉమ్రాన్ మాలిక్, మయాంక్ యాదవ్ నిలిచారు.

ఐపీఎల్ చరిత్రలో మయాంక్ విసిరిన బంతి ఐదో అత్యంతవేగవంతమైన బంతిగా రికార్డుల్లో చేరింది. తన ఆఖరి ఓవర్లో మయాంక్ గంటకు 152, 153, 154 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరడం విశేషం.

21 సంవత్సరాల వయసులోనే నిప్పులు చెరిగే బౌలింగ్ తో చెలరేగిపోతున్న మయాంక్ కు కంగారూ మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ హ్యాట్సాఫ్ చెప్పాడు. భారత అమ్ములపొదిలో మరో మెరుపు ఫాస్ట్ బౌలర్ వచ్చి చేరాడంటూ ప్రశంసించాడు.

First Published:  31 March 2024 5:45 AM GMT
Next Story