Telugu Global
Science and Technology

వాట్సప్ మెసేజ్ తప్పుగా టైప్ చేశారా? ఇకపై పంపించిన తర్వాత కూడా ఎడిట్ చేసుకోవచ్చు

వాట్సప్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొని రావడానికి మెటా ప్రయత్నిస్తోంది. ఇటీవల వాట్సప్‌లో ఎడిట్ ఫీచర్ వస్తుందని జోరుగా చర్చ జరుగుతోంది.

వాట్సప్ మెసేజ్ తప్పుగా టైప్ చేశారా? ఇకపై పంపించిన తర్వాత కూడా ఎడిట్ చేసుకోవచ్చు
X

ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ 'వాట్సప్'. ఈ యాప్‌కు ఎన్నో కోట్ల మంది యూజర్లు ఉండటంతో దాని మాతృసంస్థ మెటా.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. అత్యంత సులభంగా మెసేజెస్ చేయడమే కాకుండా ఫైల్స్, ఫొటోలు, వీడియోలు ట్రాన్స్‌ఫర్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అందుకే సోషల్ మీడియా యాప్‌లపై పెద్దగా అవగాహన లేని వ్యక్తులు కూడా వాట్సప్‌ను వాడుతుంటారు.

వాట్సప్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొని రావడానికి మెటా ప్రయత్నిస్తోంది. ఇటీవల వాట్సప్‌లో ఎడిట్ ఫీచర్ వస్తుందని జోరుగా చర్చ జరుగుతోంది. మనం ఏదైనా మెసేజ్ తప్పుగా టైప్ చేసి పంపడం వల్ల ఆందోళనకు గురవుతాము. కొన్ని సార్లు ఆటో కరెక్ట్ ఫీచర్ వల్ల అర్థాలు మారిపోతుంటాయి. అప్పుడు వెంటనే డిలీట్ ఎవ్రీవన్ అనే ఫీచర్ వాడి మెసేజ్ తొలగిస్తాము. అయితే ఇకపై ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఎడిట్ ఫీచర్‌ను తీసుకొని రావాలని మెటా నిర్ణయించింది. ఇప్పటికే బీటా వెర్షన్‌లో టెస్ట్ రన్ కూడా నడుస్తున్నట్లు సమాచారం.

టెస్ట్ రన్‌లో ఎడిట్ ఫీచర్ చాలా అద్బుతంగా పని చేస్తున్నట్లు తెలుస్తున్నది. హడావిడిగా మెసేజ్ సెండ్ చేసిన తర్వాత దాన్ని డిలీట్ చేయకుండా ఎడిట్ చేయడం ఇకపై సులువు అవుతుది. చాలా రోజులుగా దీనిపై పరిశోధనలు చేస్తున్నా.. అది ఇటీవలే విజయవంతం అయ్యింది. దీంతో వాట్సప్ వెర్షన్ 2.22.20.12లో ఈ ఫీచర్ టెస్ట్ చేస్తున్నారు. అయితే మనం మెసేజ్ డిలీట్ చేయాలంటే దాన్ని పంపిన నిర్దిష్ట సమయంలోగా వాడాలి. ప్రస్తుతం రెండు రోజుల 12 గంటల లోపు మెసేజ్ డిలీట్ చేయవచ్చు. గతంలో ఒక గంట 8 నిమిషాల 16 సెకెన్లుగా ఉన్న సమయాన్ని.. ఇటీవలే 60 గంటలకు పెంచారు. మరి ఇప్పుడు డిలీట్ మెసేజ్ ఆప్షన్ ఎంత సమయం లోపు ఉపయోగించాలనే విషయం మాత్రం వెల్లడి కాలేదు.

ప్రస్తుతం పరీక్ష దశలో ఉన్న ఈ ఆప్షన్ వినియోగదారులకు ఎప్పుడు పూర్తిగా అందుబాటులోకి వస్తుందో కూడా కంపెనీ చెప్పలేదు. త్వరలోనే ఇండియాలో ఉన్న 50 కోట్ల మందికి పైగా యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది.

First Published:  18 Oct 2022 1:53 PM GMT
Next Story