Telugu Global
Science and Technology

ట్విట్టర్ కి ప్రత్యామ్నాయం ఏంటి..? ఆ మూడింటికి పెరిగిన క్రేజ్

Twitter's Alternative: మూకుమ్మడిగా అందరూ ట్విట్టర్ కి దూరమైతే అప్పటికప్పుడు ప్రత్యామ్నాయం వెదుక్కునే కంటే ముందుగానే కొత్త ప్లాట్ ఫామ్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోవ‌డానికి చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు.

ట్విట్టర్ కి ప్రత్యామ్నాయం ఏంటి..? ఆ మూడింటికి పెరిగిన క్రేజ్
X

సామాజిక మాధ్యమం ట్విట్టర్ కి ఇప్పుడప్పుడే ప్రత్యామ్నాయం వస్తుందని ఎవరూ అనుకోలేదు. ఆమధ్య ఒకటీ అరా తెరపైకి వచ్చినా ట్విట్టర్ కి ఉన్నంత క్రేజ్ దేనికీ లేదు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వంటి ఇతర ప్లాట్ ఫామ్స్ ఉన్నా కూడా ట్విట్టర్ కి ఉండే వెసులుబాట్లు వేరు. అయితే కొత్త యజమాని 'ఎలన్ మస్క్' ట్విట్టర్ ని డీల్ చేస్తున్న విధానంతో చాలామంది దీనికి గుడ్ బై చెప్పేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బ్లూటిక్ కి రేటు కట్టిన మస్క్, మరిన్ని సంస్కరణలు తీసుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. ఈలోగా కొంతమంది ప్రత్యామ్నాయ ప్లాట్ ఫామ్ లలో కూడా అకౌంట్లు ఓపెన్ చేసి పెట్టుకుంటున్నారు. ఒకవేళ మస్క్ వ్యవహారంతో విసిగిపోయి మూకుమ్మడిగా అందరూ ట్విట్టర్ కి దూరమైతే అప్పటికప్పుడు ప్రత్యామ్నాయం వెదుక్కునే కంటే ముందుగానే కొత్త ప్లాట్ ఫామ్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోవ‌డానికి చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు.

ప్రత్యామ్నాయాలు ఏంటంటే..?

'మాస్టోడాన్'. ఇది కూడా దాదాపు ట్విట్టర్ లాగే పనిచేసే మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ ఫామ్. 2016లో యూజెన్ దీన్ని మొదలు పెట్టారు. తాజాగా ట్విట్టర్ వివాదం మొదలైన తర్వాత జర్నలిస్ట్ లు, కొంతమంది సెలబ్రిటీలు మాస్టోడాన్ కి మారిపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు మాస్టోడాన్ కు 6.55 లక్షలమంది వినియోగదారులున్నారని, గత వారం రోజుల్లోనే 2.3 లక్షల మంది కొత్త సబ్ స్క్రైబర్స్ వచ్చారని చెబుతున్నారు మాస్టోడాన్ నిర్వాహకులు.

ట్విట్టర్‌ ఫౌండర్‌, మాజీ సీఈవో జాక్ డోర్సే కొత్తగా 'బ్లూస్కీ సోషల్' అనే యాప్ లాంచ్ చేశారు. రెండు రోజుల్లోనే 30,000 మంది దీంట్లో జాయిన్ అయ్యారు. ట్విట్టర్ ఫౌండర్ పెట్టిన ఈ యాప్ తొందర్లోనే ఫేమస్ అవుతుందనే అంచనాలున్నాయి.

ఇక భారత్ కి చెందిన 'కూ' యాప్ కూడా చాలా కాలంగా ట్విట్టర్ కి పోటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. భారత్ లోని అన్ని భాషల్లో అందుబాటులో ఉండటం దీని ప్రత్యేకత. ఇటీవల 'కూ' యాప్ 5కోట్ల డౌన్లోడ్లు దాటేసింది. ట్విట్టర్ గందరగోళం తర్వాత 'కూ' యాప్ కి భారీగా ట్రాఫిక్ పెరిగిందని అంటున్నారు. ముఖ్యంగా భారత్ లో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థలకు చెందినవారు 'కూ' యాప్ లో ఎక్కువమంది ఉన్నారు. ట్విట్టర్ గందరగోళంలో ఈ మూడు యాప్ లకు అనుకోకుండా క్రేజ్ పెరగడం విశేషం.

First Published:  7 Nov 2022 11:35 AM GMT
Next Story