Telugu Global
Science and Technology

గూగుల్‌ను తలదన్నే ఛాట్‌బోట్ జీపీటీ! ఇదెలా పనిచేస్తుందంటే..

chatbot GPT: ఈ లేటెస్ట్ ‘ఛాట్‌బోట్ జీపీటీ’ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తేగానీ.. అది నిజంగా గూగుల్‌ను తలదన్నేలా ఉంటుందా? లేదా? అనేది తెలుస్తుంది.

గూగుల్‌ను తలదన్నే ఛాట్‌బోట్ జీపీటీ! ఇదెలా పనిచేస్తుందంటే..
X

కంటెంట్‌కు సంబంధించిన సమస్యలకు చెక్ పెట్టేలా కొత్తరకం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రాబోతోంది. ఇది ప్రపంచంలోని ఇన్ఫర్మేషన్‌ను తనలో దాచుకుని రకరకాల ప్రశ్నలకు సమాధానం, అడిగినప్పుడు వ్యాసాలు, చివరికి పాటల లిరిక్స్ కూడా రాసి ఇవ్వగలదని డెవలపర్లు చెప్తున్నారు. ‘జనరేటివ్‌ ప్రీ ట్రైన్డ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌’గా పిలుస్తున్న ఈ కొత్త టెక్నాలజీ గూగుల్‌కు పోటీగా నిలవగలదని చెప్తున్నారు. ఇదెలా పనిచేస్తుందంటే..

ఏఐ ఆధారిత ఛాట్‌బోట్‌ల గురించి చాలామందికి తెలుసు. షాపింగ్, ఫుడ్ డెలివరీ యాప్స్‌లో కస్టమర్లతో మాట్లాడేందుకు ఏఐ ఛాట్‌బోట్‌లు బాగా పనికొస్తాయి. అయితే ఇవి లిమిటెడ్ డేటా ఆధారంగా కొన్ని సమస్యలను మాత్రమే పరిష్కరించగలవు. అందుకే రకరకాల కంపెనీలు రకరకాల ఛాట్‌బోట్‌లను డెవలప్ చేస్తుంటాయి. అయితే ప్రపంచంలోని కంటెంట్ మొత్తాన్ని ఒకచోట చేర్చి, దాని మాడరేట్ చేయగల కొత్త టెక్నాలజీ త్వరలో రాబోతోంది. ‘ఛాట్‌బోట్ జీపీటీ’ దానిపేరు ఇది సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం ‘గూగుల్‌’ను సవాలు చేయగలదని కొందరు, అధిగమించగలదని మరికొందరు అంచనా వేస్తున్నారు.

ఛాట్‌బోట్ జీపీటీ ఎలాంటి కంటెంట్‌నైనా క్రియేట్ చేయగలదు. ఉదాహరణకు ఏదైనా ఆర్టికల్‌ రఫ్‌గా రాస్తే దానికి మంచి మంచి పదాలు జోడించి మరింత క్రియేటివ్‌గా మార్చగలదు. ఒక అంశానికి సంబంధించి అస్తవ్యస్తంగా ఉన్నా డేటాను ఒక ఆర్డర్‌‌లోకి తీసుకురాగలదు. టాస్క్ ఇస్తే కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ రాయగలదు. మనుషుల మాటలను సహజంగా అనుకరించగలదు. పదాలు ఇచ్చి సందర్భం చెప్తే పాట కూడా రాయగలదు. ఛాట్‌బోట్ జీపీటీ.. ఏఐ ఆధారంగా లోతైన పరిశోధనలు చేస్తోంది. వ్యక్తిగత సంభాషణలు, సోషల్‌మీడియాలో అభిప్రాయాలను సేకరించి రిపోర్ట్‌లు రెడీ చేస్తుంది. న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ‘ది బెస్ట్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఛాట్‌బోట్‌’ గా ‘ఛాట్‌బోట్ జీపీటీ’ని ప్రశంసించింది.

శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ‘ఓపెన్‌ ఏఐ’ ఈ ‘ఛాట్‌జీపీటీ’ సాఫ్ట్‌వేర్‌ను సృష్టించింది. ఈ ప్రాజెక్ట్ కోసం శామ్‌ఆల్ట్‌మన్, ఇల్యా సట్స్‌కెర్వర్ తో పాటు ఎలాన్‌ మస్క్‌ లాంటి వాళ్లు కూడా ఇన్వెస్ట్ చేశారు. అయితే రీసెంట్‌గా మస్క్‌ దీని నుంచి తప్పుకున్నారు. అలాగే మైక్రోసాఫ్ట్‌ కూడా ఇందులో పెట్టుబడి పెట్టింది.

అయితే ఛాట్‌బోట్ జీపీటీకి కూడా కొన్ని పరిమితులు, లోపాలు ఉన్నాయి. ఈ ఏఐ కూడా కొన్నిసార్లు తప్పు పదాలు, రిపీటెడ్ పదాలు, తప్పు సమాధానాలు ఇచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ లేటెస్ట్ ‘ఛాట్‌బోట్ జీపీటీ’ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తేగానీ.. అది నిజంగా గూగుల్‌ను తలదన్నేలా ఉంటుందా? లేదా? అనేది తెలుస్తుంది.

First Published:  8 Jan 2023 4:11 AM GMT
Next Story