Telugu Global
Science and Technology

ఇక‌పై వాట్సాప్‌లోనూ ట్రూకాల‌ర్ సేవ‌లు..! - వెల్ల‌డించిన ట్రూకాల‌ర్ సీఈవో అల‌న్ మ‌మేదీ

భార‌త్ వంటి దేశాల్లో స‌గ‌టున ఒక యూజర్‌కు రోజుకు 17 టెలి మార్కెటింగ్‌, స్కామింగ్ కాల్స్ వ‌స్తున్న‌ట్టు 2021 ఏడాదికి సంబంధించి ట్రూకాల‌ర్ రూపొందించిన నివేదిక‌లో వెల్ల‌డించింది.

ఇక‌పై వాట్సాప్‌లోనూ ట్రూకాల‌ర్ సేవ‌లు..! - వెల్ల‌డించిన ట్రూకాల‌ర్ సీఈవో అల‌న్ మ‌మేదీ
X

కాల‌ర్ ఐడెంటిఫికేష‌న్ యాప్ ట్రూకాల‌ర్ సేవ‌లు ఇక‌పై వాట్సాప్‌లోనూ అందుబాటులోకి రానున్నాయి. ఈ విష‌యాన్ని ట్రూకాల‌ర్ సీఈవో అల‌న్ మ‌మేదీ మంగ‌ళ‌వారం వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఇది ప‌రీక్ష‌ల ద‌శ‌లో ఉంద‌ని, దీనిని మే త‌ర్వాత ప్ర‌పంచ‌వ్యాప్తంగా యూజ‌ర్ల‌కు అందుబాటులోకి తెస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. వాట్సాప్‌లోనూ వ‌చ్చే స్పామ్ / స్కామ్ కాల్స్‌ను గుర్తించేందుకు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆయ‌న వివ‌రించారు.

భార‌త్ వంటి దేశాల్లో స‌గ‌టున ఒక యూజర్‌కు రోజుకు 17 టెలి మార్కెటింగ్‌, స్కామింగ్ కాల్స్ వ‌స్తున్న‌ట్టు 2021 ఏడాదికి సంబంధించి ట్రూకాల‌ర్ రూపొందించిన నివేదిక‌లో వెల్ల‌డించింది. వాటిని అడ్డుకునేందుకు మే ఒక‌టో తేదీ నుంచి ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత స్పామ్ ఫిల్ట‌ర్ల‌ను ఫోన్ కాల్స్‌, ఎస్సెమ్మెస్ సేవ‌ల్లో ఉప‌యోగించాల‌ని ట్రాయ్ టెలికాం నెట్‌వ‌ర్క్ ఆప‌రేట‌ర్ల‌కు సూచించింది. దీని వ‌ల్ల వేర్వేరు సంస్థ‌లు, వ్య‌క్తుల నుంచి వ‌చ్చే న‌కిలీ, మార్కెటింగ్ కాల్స్‌తో పాటు మెసేజ్‌లను గుర్తించి అడ్డుకుంటాయి.

దీంతో టెలి మార్కెటింగ్ సంస్థ‌లు యూజ‌ర్ల‌కు వాట్సాప్ ద్వారా కాల్ చేస్తున్నాయి. వీటిపై గ‌త రెండు వారాలుగా ఫిర్యాదులు వ‌స్తుండ‌టంతో వీటి క‌ట్ట‌డి కోసం ట్రూకాల‌ర్ సేవ‌ల‌ను వాట్సాప్‌లో అందుబాటులోకి తేనున్న‌ట్టు అల‌న్ మ‌మేదీ తెలిపారు. దీనికి సంబంధించి టెలికాం ఆప‌రేట‌ర్ల (ఎయిర్ టెల్‌, జియో, వొడాఫోన్‌, ఐడీయా, బీఎస్ఎన్ఎల్‌) చ‌ర్చ‌లు జ‌రుపుతున్నామ‌ని వెల్ల‌డించారు.

ట్రూ కాల‌ర్‌కు ప్ర‌పంచంలోనే అతి పెద్ద మార్కెట్ భార‌త్ కావ‌డం విశేషం. ఈ యాప్‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 350 మిలియ‌న్ యూజ‌ర్లు ఉంటే.. ఒక్క భార‌త్‌లోనే 250 మిలియ‌న్ యూజ‌ర్లు ఉండ‌టం గ‌మ‌నార్హం.

First Published:  9 May 2023 2:29 AM GMT
Next Story