Telugu Global
Science and Technology

టిక్ టాక్ సరే.. బెట్టింగ్ వెబ్ సైట్ ల సంగతేంటి..?

బెట్టింగ్‌ సైట్లకు సంబంధించిన ప్రకటనలను ప్రసారం చేయొద్దని ప్రైవేట్‌ శాటిలైట్‌ చానెళ్లు, ఓటీటీ ప్లాట్‌ ఫాంలు, న్యూస్‌ వెబ్‌ సైట్లకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది.

టిక్ టాక్ సరే.. బెట్టింగ్ వెబ్ సైట్ ల సంగతేంటి..?
X

టిక్ టాక్ ని బ్యాన్ చేసి జబ్బలు చరుచుకుంది కేంద్రం. ఏదో సాధించేశామని చెప్పుకుంది, చైనా యాప్ లను నిషేధించామని, ఇక అంతా మేకిన్ ఇండియా అని కాలరెగరేసింది. అయితే టిక్ టాక్ తో కేవలం సమయమే వృథా అయ్యేదేమో...? ఇప్పుడు అంతకు మించిన రేంజ్ లో యాప్ లు ప్రజల జీవితాలను దెబ్బతీస్తున్నాయి. బెట్టింగ్ యాప్ లు, బెట్టింగ్ వెబ్ సైట్లతో చాలామంది జీవితాలు ఆర్థికంగా చితికిపోయాయి. ఇలాంటివాటిపై నిషేధం విధించడంలో మాత్రం కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోంది. అటు తమిళనాడు వంటి రాష్ట్రం సొంతంగా ఆన్ లైన్ గేమింగ్ పై నిషేధం విధిస్తే, మద్రాస్ హైకోర్టు మోకాలడ్డింది. దీంతో స్టాలిన్ సర్కారు ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొస్తోంది.

ఇక కేంద్రం విషయానికొద్దాం. కేంద్రం తాజాగా బెట్టింగ్ వెబ్ సైట్లకు సంబంధించి ఓ ప్రకటన విడుదల చేసింది. బెట్టింగ్‌ సైట్లకు సంబంధించిన ప్రకటనలను ప్రసారం చేయొద్దని ప్రైవేట్‌ శాటిలైట్‌ చానెళ్లు, ఓటీటీ ప్లాట్‌ ఫాంలు, న్యూస్‌ వెబ్‌ సైట్లకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. దీనికి సంబధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. బెట్టింగ్‌ ప్లాట్‌ ఫాంలు, వాటి అనుబంధ వెబ్‌ సైట్లకు సంబంధించిన ప్రకటనలను ఏ రూపంలోనూ ప్రసారం చేయొద్దని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ మార్గదర్శకాలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని చెప్పింది.

ప్రకటనలే ఎందుకు, వెబ్ సైట్ల భరతం పట్టొచ్చు కదా..?

కేంద్రం కేవలం ప్రకటనలను మాత్రమే నిషేధిస్తోంది, కానీ వెబ్ సైట్లను కాదు. అంటే ప్రకటనలతో సంబంధం లేకుండా ఆయా వెబ్ సైట్లు బెట్టింగ్ నిర్వహించుకోవచ్చనమాట. దానివల్ల ఎంతమంది జీవితాలు ఇబ్బందుల్లో పడినా కేంద్రానికి చీమకుట్టినట్టయినా ఉండదనమాట. ఇటీవల ఈ వెబ్ సైట్లకు సంబంధించి కేంద్రం మరో ప్లాన్ వేసింది. బెట్టింగ్ వెబ్ సైట్లు, గేమింగ్ యాప్ ల నుంచి పన్నులు వసూలు చేయాలనే ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. ప్రజల సొమ్ము ఏమైపోయినా పర్లేదు, తన పన్నులు మాత్రం తనకు వస్తే చాలు అనుకుంటున్న కేంద్రం ఆలోచన మరీ దుర్మార్గం అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

First Published:  4 Oct 2022 4:07 AM GMT
Next Story