Telugu Global
Science and Technology

ఐ ఫోన్ 15 వచ్చేసింది.. ఇవే కొత్త ఫీచర్లు, ధరలు

2030 కల్లా యాపిల్ ఉత్పత్తులన్నీ పర్యావరణ హితంగానే ఉండబోతున్నట్లు కంపెనీ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు.

ఐ ఫోన్ 15 వచ్చేసింది.. ఇవే కొత్త ఫీచర్లు, ధరలు
X

టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్లను లాంఛ్ చేసింది. వండర్‌లస్ట్ పేరుతో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ ఫోన్లను గ్రాండ్‌గా లాంఛ్ చేసింది. ఐఫోన్ 15 మోడల్స్‌తో పాటు యాపిల్ వాచ్ సిరీస్9, వాచ్ అల్ట్రా 2ను కూడా విడుదల చేసింది. ఈ సారి ఐఫోన్ సిరీస్ ఉత్పత్తులతో పాటు వాచ్ సిరీస్‌ల తయారీలో పర్యావరణ హితానికి కంపెనీ అధిక ప్రాధాన్యత ఇచ్చిందని, 2030 కల్లా యాపిల్ ఉత్పత్తులన్నీ పర్యావరణ హితంగానే ఉండబోతున్నట్లు కంపెనీ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు.

ఐఫోన్ 15, 15 ప్లస్ :

ఐ ఫోన్ 15 మోడల్ 6.1 అంగులాల స్క్రీన్, ఐఫోన్ 15 ప్లస్‌లో 6.7 అంగులాల స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఈ రెండింటిలో ఏ16 బయోనిక్ చిప్, ఓఎల్ఈడీ సూపర్ రెటీనా డిస్‌ప్లే, డైనమింగ్ ఐలాండ్‌ కలిగి ఉంటుంది. ఈ ఫోన్లు గులాబీ, పసుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు రంగుల్లో లభ్యమవుతాయి. 48 మెగా పిక్సెల్ ప్రధాన కెమేరా ఇందులో ఉన్నది. ఈ ఫోన్లలను మొదటి సారిగా టైప్-సి చార్జర్‌తో వీటిని తీసుకొని వచ్చారు. కాగా, ఐఫోన్ 15, 15 ప్లస్ 128 జీబీ ధర రూ.79,900, 512 జీబీ ధర రూ.89,900గా నిర్ణయించారు.

ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్:

ఐఫోన్ ప్రో 6.1 అంగులాలు, 15 ప్రో మ్యాక్స్ 6.7 అంగులాల స్క్రీన్‌తో వస్తుంది. టైటానియమ్ డిజైన్, సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే, సరికొత్త ఏ17 ప్రో చిప్‌తో వీటిని తీసుకొని వచ్చారు. ఈ రెండు ఫోన్లు కూడా 100 శాతం రీసైకిల్డ్ మెటీరియల్‌తో తయారు చేసినట్ల కంపెనీ చెబుతోంది. పల్చటి బోర్డర్లు, తేలికపాటి బరువు ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకత. ఐఫోన్ 15 ప్రో ధర రూ.1,34,900 నుంచి ప్రారంభం కానున్నది. ఇక ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర రూ.1,59,900 నుంచి ప్రారంభం కానున్నది. 1 టీబీ స్టోరేజ్ కెపాసిటీ ఉన్న ఫోన్ ధర రూ.1,99,990గా నిర్ణయించారు. ఇదే తాజాగా రిలీజ్ చేసిన సిరీస్‌లలో అత్యధికం కావడం గమనార్హం. ప్రో మోడల్ సిరీస్ ఫోన్లు నాచురల్ టైటానియం, బ్లాక్ టైటానియం, వైట్ టైటానియం వేరియంట్లలో లభించనున్నది.

ఐఫోన్ మోడల్స్ అన్నీ ఈ నెల 22 నుంచి మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయని యాపిల్ పేర్కొన్నది.

యాపిల్ వాచ్ సిరీస్ 9:

ఎస్9 చిప్‌తో పని చేసే యాపిల్ వాచ్ సిరీస్9ని తాజాగా లాంఛ్ చేసింది. ఇంతకు ముందు సిరీస్‌లతో పోలిస్తే ఈ ఎస్9 చిప్ వాచ్ చాలా వేగంగా పని చేస్తుందని యాపిల్ పేర్కొన్నది. మెషీన్ కంప్యూటేషన్లను కూడా రెండు రెట్ల వేగంతో ఇది పని చేస్తుంది. ఈ వాచ్‌లను ఉపయోగించి ఐ ఫోన్‌లను కూడా ట్రేస్ చేసుకునే అవకాశం ఉన్నది.

డబుల్ ట్యాప్‌తో ఫోన్ కాల్స్‌ను తీసుకోవడం, బంద్ చేయడం చేయవచ్చు. ఈ వాచీ తొలి సారిగా కర్బన తటస్థ ఉత్పత్తిగా కంపెనీ పేర్కొన్నది. జీపీఎస్ సౌకర్యం ఉన్న వాచీ ధర రూ.32,990గా, జీపీఎస్+సెల్యులార్ కలిగి ఉన్న వాచీ ధర రూ.40,990గా నిర్ణయించారు.

అల్ట్రా వాచ్ 2:

అల్ట్రా వాచ్‌లో ఎస్9 చిప్ సెట్ ఉపయోగించారు. ఇందులో కూడా డబుల్ ట్యాప్ సౌకర్యం ఉన్నది. 95 శాతం రీసైకిల్డ్ మెటీరియల్‌తో తయారు చేశారు. లో-పవర్ మోడ్‌లో 72 గంటల పాటు బ్యాటరీ చార్జింగ్ ఉంటుందని పేర్కొన్నారు. దీని ప్రారంభ ధర రూ.64,990 నుంచి ప్రారంభం కానున్నట్లు కంపెనీ ప్రకటించింది.

First Published:  13 Sep 2023 3:14 AM GMT
Next Story