Telugu Global
Science and Technology

ఇస్రో మరో ఘనత .. లగ్రాంజ్ పాయింట్ లోకి ప్రవేశించిన 'ఆదిత్య ఎల్ 1'

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో చరిత్ర సృష్టించింది. భారతదేశ తొలి సోలార్‌ మిషన్‌ విజయవంతమైంది.

ఇస్రో మరో ఘనత .. లగ్రాంజ్ పాయింట్ లోకి ప్రవేశించిన ఆదిత్య ఎల్ 1
X

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో చరిత్ర సృష్టించింది. భారతదేశ తొలి సోలార్‌ మిషన్‌ విజయవంతమైంది. సూర్యున్ని అధ్యయనం చేసేందుకు నింగిలోకి పంపించిన ఆదిత్య ఎల్1 స్పేస్ క్రాఫ్ట్ విజయవంతంగా తన గమ్యస్థానాన్ని చేరుకుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ ను తుది కక్ష్యలోకి ప్రవేశ పెట్టేందుకు శనివారం చేపట్టిన కీలక ప్రక్రియ విజయవంతమైంది.

భూమి నుంచి సూర్యుని దిశగా 15 లక్షల కి.మీ దూరంలోని లగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్ష్యలోకి ఈ వ్యోమనౌకను సాయంత్రం 4 గంటలకు ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం ఐదేళ్ల పాటు సేవలందించనుంది. ఈ ఆదిత్య ఎల్ 1.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పంపిన తొలి అంతరిక్ష ఆధారిత అబ్జర్వేటరీ ప్రయోగం కావడం గమనార్హం. అలాగే ఈ ప్రయోగంతో తొలి ప్రయతంలోనే సోలార్‌ మిషన్‌ విజయవంతంగా నిర్వహించిన రెండో దేశంగా భారదేశం నిలిచింది..సెప్టెంబరు 18 వ తేదీ నుంచే సూర్యుడి శాస్త్రీయ సమాచారం సేకరించడం మొదలు పెట్టిన ఆదిత్య ఎల్ 1.. సెప్టెంబరు 19 వ తేదీ నుంచి సూర్యుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది.

సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడమే లక్ష్యంగా 'ఆదిత్య L1' ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. సూర్యుడిపై ఏర్పడే సన్ స్పాట్స్, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వంటి విషయాలపై అధ్యయనం చేస్తుంది. మూన్ మిషన్ లాగ సూర్యునిపై అడిగి పెట్టే అవకాశం ఉండదు కాబట్టి . ఈ ఆదిత్య ఎల్ 1 సూర్యుడికి దూరంగానే ఉంటూ అక్కడ ఏర్పడే సౌర విద్యుదయస్కాంత ప్రభావాల గురించి ముందుగానే హెచ్చరిస్తుంది. దీని వల్ల అంతరిక్షంలో ఉన్న భారత శాటిలైట్లు, కమ్యూనికేషన్ వ్యవస్థకు ఎలాంటి నష్టం కలగకుండా చూసుకోవచ్చు.

ఇది సౌర తుఫానులు దాటిపోయేంత వరకు మన శాటిలైట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సేఫ్టీ మోడ్‌లో ఉంచేందుకు సాయపడుతుందని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపారు. ఈ వ్యోమనౌక మొత్తం 7 పేలోడ్స్ మోసుకెళ్లింది. ఇవి సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు కీలకమైన సమాచారాన్నిపరిశీలిస్తాయి.

First Published:  6 Jan 2024 2:25 PM GMT
Next Story