Telugu Global
Science and Technology

మట్టి లేకుండా వ్యవసాయం.. అదెలాగంటే..?

హెడ్రోపోనిక్ విధానం అంటే మట్టితో ప‌ని లేకుండా వ్య‌వ‌సాయం చేయ‌డం. అంటే మ‌ట్టి నుంచి మొక్కకు చాలా రకాలైన పోషకాలు అందుతాయి కదా.. వాటిని హైడ్రోపోనిక్ విధానంలో నీటి ద్వారా అందిస్తారు.

మట్టి లేకుండా వ్యవసాయం.. అదెలాగంటే..?
X

ఒకప్పుడు వ్యవసాయం అంటే పొలం ఉండాలి.. ఆ పొలంలో సాగుకు అవసరమైన నీటి సౌలభ్యం ఉండాలి. ఇలా ఎన్నో ర‌కాల వ‌స‌తులు ఉండాలి. కానీ, నేడు పరిస్థితులు మారిపోయాయి. సాగు కోసం పొలం బాట పట్టాల్సిన అవసరం లేదు. మరీ ఆసక్తికర విషయం ఏంటంటే.. కనీసం భూమి కూడా అవసరం లేదు. భూమి లేకుండా వ్యవసాయమా..? తెలియని వారైతే ముక్కున వేలేసుకుంటారు. గతంలో మాదిరిగా లేదు పరిస్థితి. మనం తినే ఆహారమంతా కలుషితమే. జనాలకు ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. దీంతో మన ఆహారానికి అవసరమైన కూరగాయలను మన ఇంట్లోనే పండించుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది.


ఆ ఆలోచనకు ప్రతిరూపమే హైడ్రోపోనిక్ ఫార్మింగ్. గజం స్థలం దొరకడమే గగనమవుతున్న ఈ రోజుల్లో హైడ్రోపోనిక్ వ్యవసాయం అందరినీ ఆకట్టుకుంటోంది. దీనికోసం భూమి అవసరం లేదు. ఎక్కడికో వెళ్లాల్సిన పని అంతకన్నా లేదు. మన ఇంట్లో లేదా బాల్కనిలోనే వ్యవసాయం చేసుకోవచ్చు. తొలుత తమ అవసరాల కోసం ప్రారంభించిన ఈ వ్యవసాయం ఇప్పుడు జీవనాధారంగా కూడా మారుతోంది. అసలు ఈ హైడ్రో పోనిక్ విధానంలో వ్య‌వ‌సాయం ఎలా చేయాలి..? దీనికి ఎంత స్థ‌లం ఉండాలి..? ఎలాంటి పంట‌ను పండిస్తే ఎక్కువ లాభాలు వ‌స్తాయి..? వంటి అంశాలపై ఒకసారి చర్చిద్దాం.


హెడ్రోపోనిక్ విధానం అంటే మట్టితో ప‌ని లేకుండా వ్య‌వ‌సాయం చేయ‌డం. అంటే మ‌ట్టి నుంచి మొక్కకు చాలా రకాలైన పోషకాలు అందుతాయి కదా.. వాటిని హైడ్రోపోనిక్ విధానంలో నీటి ద్వారా అందిస్తారు. ఈ విధానంలో మొక్క పెర‌గ‌డానికి మ‌ట్టిని బ‌దులు కొబ్బరి పీచును ఉపయోగిస్తారు. తక్కువ స్థలంలో ఎక్కువ పంటను పండించవచ్చు. పాలిహౌస్‌ల గురించి పట్టణాలు, నగరాల్లో నివసించే వారికి బాగానే అవగాహన ఉంటుంది. దాని కన్నా ఇది అధునాత విధానం. ఈ విధానంలో కొన్ని రకాల పూలు, పండ్లు, కూరగాయలు పండిస్తున్నారు.


పంటల ఉత్పత్తికి ఇది ప్రత్యామ్నాయ మార్గం. చౌడు నేలలు, వ్యవసాయానికి అనుకూలంగా లేని ప్రదేశాలలో ఈ విధానం అవలంబించవచ్చు. మొక్క స్థిరత్వానికి మట్టికి బదులు జడపదార్థాన్ని వినియోగిస్తారు. మరి ఈ జడ పదార్థంగా దేనిని ఉపయోగిస్తారనే కదా మీ డౌట్..? పంట రకాన్ని బట్టి రాక్ పూల్, పెర్లైట్, వెర్మికులైట్, ఇసుకలను వినియోగిస్తారు. గాలితో పాటు వెలుతురు, పంట రకాన్ని పరిగణలోకి తీసుకుని అవసరమైన మోతాదు మేరకు కృత్రిమంగా అందించడం జరుగుతుంది.

హైడ్రోపోనిక్ విధానం వల్ల లాభాలేంటంటే..

నీటి వినియోగం చాలా తక్కువ..

♦ అధిక దిగుబడి అధికం.

♦ ఎడారి ప్రాంతాల్లోనూ పంటలు పండించవచ్చు.

♦ కలుపు బాధ ఉండనే ఉండదు. చీడ పీడలు దరిచేరవు.

♦ ఆకుకూరలు ఈ విధానంలో త్వరగా పెంచవచ్చు.


నష్టాలు..

♦ పరికరాలు చాలా ఖరీదు ఉంటాయి.

♦ సాంకేతిక నిపుణుల అవసరం ఉంటుంది.

♦ అన్ని రకాల పంటలకూ ఇది అనుకూలం కాదు.

♦ విద్యుత్ వినియోగం ఎక్కువ.

♦ నీటిలో ఉండే సూక్ష్మజీవులు మొక్కల పైకి పాకే అవకాశం.

First Published:  12 Nov 2022 1:22 AM GMT
Next Story