Telugu Global
Science and Technology

వడగండ్లు ఎలా ఏర్పడతాయంటే..

వడగండ్ల వాన ఎలా కురుస్తుంది? మంచు గడ్డలు ఆకాశం నుంచి ఎలా పడుతున్నాయి? అనే విషయాలు చాలామందికి తెలియదు.

How Hailstones are formed: వడగండ్లు ఎలా ఏర్పడతాయంటే
X

వడగండ్లు ఎలా ఏర్పడతాయంటే

తెలుగు రాష్ట్రాల్లో నిన్న వడగళ్ల వర్షం కురిసింది. మరో రెండు మూడు రోజులు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తోంది. అయితే అసలు వడగండ్ల వాన ఎలా కురుస్తుంది? మంచు గడ్డలు ఆకాశం నుంచి ఎలా పడుతున్నాయి? అనే విషయాలు చాలామందికి తెలియదు. వడగండ్ల వాన గురించి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం..

మేఘాల్లో ఉండే నీరు వాతావరణ మార్పుల వల్ల కరిగి భూమిపై పడడాన్నే వర్షం అంటాం. అయితే సాధారణంగా మేఘాల్లోని నీరు సున్నా డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద సూపర్ కూల్డ్ స్టేట్‌లో ఉంటుంది. ఇది చిన్న చిన్న మంచు ముక్కలుగా మారి వర్షంగా కురుస్తుంది. అయితే ఆ మంచు ముక్కలు నేలను చేరుకునే సరికి గాలి తాకిడికి నీరుగా మారిపోతాయి. కానీ, కొన్ని సందర్భాల్లో మాత్రం మంచు ముక్కలు మరింత బలంగా, ధృఢంగా తయారయ్యి వడగండ్లుగా కురుస్తుంటాయి.

ఎక్కువ ఎత్తులో ఉండే తీవ్రమైన ఉరుములతో కూడిన మేఘాలు.. వర్షించినప్పుడు మేఘంలోని సూపర్‌కూల్డ్ నీటితో ముందుగా చిన్న మంచు ముక్కలు తయారవుతాయి. వాతావరణంలోని మార్పుల కారణంగా కింది నుంచి గాలి పైకి తన్నినప్పుడు కొన్నిసార్లు ఆ ముక్కలు కింద పడకుండా తిరిగి మేఘం పైకి వెళ్తాయి.

ఈ క్రమంలో ఆ ఐస్‌ ముక్కలకు మరింత సూపర్‌ కూల్డ్ వాటర్‌ తోడయ్యి మరికొన్ని మంచు ముక్కలు అతుక్కుంటాయి. దాంతో అవి మరింత బలంగా, దృఢంగా మారతాయి. ఈ చర్య రిపీట్ అయ్యే కొద్దీ ఐస్‌ ముక్కలు ఇంకా పెద్దవిగా రూపాంతరం చెందుతుంటాయి. వీటినే మనం వడగండ్లు అంటాం.

మేఘం నుంచి వర్షం కురిసేటప్పుడు కొన్ని వడగండ్లు మధ్యలోనే కరిగిపోతాయి. మరికొన్ని పెద్ద మంచు ముక్కలు మాత్రం కరగకముందే నేలను చేరుతుంటాయి. ఇదే వడగండ్ల వాన. ఇలాంటి వాన చాలా అరుదుగా కురుస్తుంది. వాతావరణ పరిస్థితుల్లో నిలకడ లేనప్పుడు ఇలాంటి వానలకు అవకాశం ఉంటుంది.

First Published:  21 March 2023 12:38 PM GMT
Next Story