Telugu Global
Science and Technology

చింతల్లేని చెట్టిల్లు

చింత చెట్టు చుట్టూ రూపొందిన ఈ ఇంటి నిర్మాణంలో వాడి పారేసిన నాలుగు వేల ప్లాస్టిక్‌ బాటిళ్లు చోటు చేసుకున్నాయి.

తమిళనాడుకు చెందిన విను డేనియల్‌ ‘చుజి’ పేరుతో పర్యావరణహితమైన ఇంటిని నిర్మించింది
X

తమిళనాడుకు చెందిన విను డేనియల్‌ ‘చుజి’ పేరుతో పర్యావరణహితమైన ఇంటిని నిర్మించింది

‘చెట్టు కొట్టి గోడ కట్టరాదు’ తరతరాలుగా మనకు వాడుకలో ఉన్న నానుడి ఇది. ఇంటి నిర్మాణం కోసం చెట్టును నరికివేసే అలవాటును నివారించడానికి చేసిన సూచన ఇది. పర్యావరణ పరిరక్షణ అనే పెద్ద పదం తెలియని రోజుల్లో మన పూర్వికులు పాటించిన నియమం ఇది. ఈ నానుడిని నిజం చేసిందో ఆధునిక ఆర్కిటెక్ట్‌.



తమిళనాడుకు చెందిన విను డేనియల్‌ ‘చుజి’ పేరుతో పర్యావరణహితమైన ఇంటిని నిర్మించింది. చింత చెట్టు చుట్టూ రూపొందిన ఈ ఇంటి నిర్మాణంలో వాడి పారేసిన నాలుగు వేల ప్లాస్టిక్‌ బాటిళ్లు చోటు చేసుకున్నాయి. బురద మట్టితో నిర్మితమైన ఈ ఇల్లు ఎండాకాలంలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది.



ఈ నిర్మాణంలో సిమెంట్‌ పదిశాతం మాత్రమే వాడారు. ఈ ఇంటిని డిజైన్‌ చేయడంలో తన సృజనాత్మకతను జోడించింది విను డేనియల్‌. పై కప్పు అంతా ఖాళీగా ఇనుప కమ్ములు, మెష్‌తో డిజైన్‌ చేసింది. చెట్ల కొమ్మలు ఇంటి లోపలికి చొచ్చుకుని వచ్చి పచ్చగా పలకరిస్తాయి. డ్రాయింగ్‌ రూమ్‌లో కూర్చుని పైకి చూస్తే ఇంటికి ఆకాశానికి మధ్యలో చెట్లు ‘నువ్వున్నది నా కిందనే’ అన్నట్లు తొంగి చూస్తుంటాయి.



జీవితానికి సార్ధకత చేకూరాలంటే ఒక సాహసం, ఒక ప్రయోగం చేసి తీరాల్సిందే. సాహసం, ప్రయోగం చేయడానికి కొంత సమయం, మరికొంత డబ్బు ఉంటే చాలు... నేటి యువత మేధకు పదును పెడుతోంది. తమ మార్కు ప్రదర్శించడానికి సరికొత్త మార్గాలను ఎంచుకుంటోంది. అందులో భాగమే ఈ ఆర్కిటెక్ట్‌ చేసిన ప్రయోగం. ఇది తమిళనాడులో స్థానికులకు పెద్దగా అర్థమైనట్లు కనిపించడం లేదు. కానీ ఆర్కిటెక్చర్‌ స్టూడెంట్స్‌ని ఆకట్టుకుంటోంది.


సిలబస్‌లో చదువుకున్న సబ్జెక్ట్‌తోపాటు మరికొంత నేర్చుకోవడానికి ఈ చెట్టిల్లు మంచి అవకాశం కల్పిస్తోంది. ఈ ఇంట్లో గాలి కోసం ఫ్యాన్‌లు, ఏసీలు అక్కర్లేదు. నిజమే... మనకు ప్రకృతి అన్నీ ఇస్తుంది. ప్రకృతి చెప్పినట్లు మనం వింటే చాలు. చెట్టు కింద జీవించినంత హాయిగా ఈ చెట్టింట్లో సౌకర్యవంతంగా జీవించవచ్చు.

First Published:  10 July 2023 4:05 PM GMT
Next Story