Telugu Global
Science and Technology

కొత్త రకం ఏఐ మోసాలు.. జాగ్రత్త పడండిలా..

ఆర్టిఫీషియల్‌తో చాలా రంగాలకు ఉపయోగమున్నన్నప్పటికీ.. వాటితో కొన్ని ప్రమాదాలూ లేకపోలేదు. ముఖ్యంగా ఏఐతో కొత్తరకం సైబర్ మోసాలకు అవకాశం పెరుగుతుంది.

ఆర్టిఫీషియల్‌తో చాలా రంగాలకు ఉపయోగమున్నన్నప్పటికీ.. వాటితో కొన్ని ప్రమాదాలూ లేకపోలేదు. ముఖ్యంగా ఏఐతో కొత్తరకం సైబర్ మోసాలకు అవకాశం పెరుగుతుంది. రీసెంట్‌గా ఏఐ బేస్డ్ డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి సైబర్ నేరగాళ్లు కొత్త రకం మోసానికి తెరలేపారు. అసలేం జరిగిందంటే..

కేరళలోని కోజికోడ్‌కు చెందిన రాధాకృష్ణన్‌ అనే వ్యక్తికి గుర్తుతెలియని ఒక నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేసి చూస్తే.. అవతలివైపు మాట్లాడుతున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లోఉండే తన మాజీ కొలీగ్. తెలిసిన వ్యక్తే కదా అని కాసేపు అవీ ఇవీ మాట్లాడాడు. అయితే కాసేపటి తర్వాత అవతలి వ్యక్తి.. తాను ఆసుపత్రిలో ఉన్న బంధువుకు సాయం చేయాలని, అర్జెంట్‌గా నలభై వేలు కావాలని అడిగాడు. తన కొలీగ్ కష్టాల్లో ఉన్నాడనుకుని రాధాకృష్ణన్‌ వెంటనే అతనికి రూ. 40,000 పంపించాడు. ఆ తర్వాత కొంతసేపటికి మళ్లీ రూ. 35000 కావాలని అడిగాడు. దీంతో రాధాకృష్ణన్‌కు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. రంగంలోకి దిగిన పోలీసులు అసలు నిజాన్ని తెలుసుకున్నారు.

నిజానికి జరిగిందేంటంటే వీడియో కాల్‌లో మాట్లాడిన వ్యక్తి రాధాకృష్ణన్ కొలీగ్ కాదు. అతనొక సైబర్ నేరగాడు. ‘ఏఐ డీప్ ఫేక్’ టెక్నాలజీని ఉపయోగించి వీడియోకాల్ చేసి మారు వేషంలో మోసం చేశాడు. డీప్ ఫేక్ టెక్నాలజీతో అచ్చం మనిషిన పోలిన ఇమేజ్‌ను క్రియేట్ చేయొచ్చు. ఆ టూల్ సాయంతో ముఖాన్ని పూర్తిగా మార్చి వేరే వాళ్ల ముఖాన్ని సెట్ చెయొచ్చు. అది చూసి నిజమైన వ్యక్తే వీడియో కాల్ మాట్లాడుతున్నాడు అనుకుంటే పొరబడినట్టే. రాధాకృష్ణన్ విషయంలో జరిగింది ఇదే.

పోలీసులు ఈ సైబర్ మోసాన్ని కనిపెట్టి బాధితుడికి డబ్బు తిరిగి అప్పగించారు. సైబర్ నేరాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. డబ్బు పంపే ముందు ఒకటికి రెండు సార్లు కన్ఫర్మ్ చేసుకుంటే ఇలాంటి మోసాలకు తావు ఉండదని సూచించారు.

First Published:  19 July 2023 10:45 PM GMT
Next Story