Telugu Global
Science and Technology

18 ఓటీటీలపై నిషేధం

ఆన్‌లైన్‌లో అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న 18 ఓటీటీలపై నిషేధం విధిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది.

18 ఓటీటీలపై నిషేధం
X

ఆన్‌లైన్‌లో అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న 18 ఓటీటీలపై నిషేధం విధిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే కారణంతో వీటితో పాటు పలు వెబ్‌సైట్‌లు, యాప్‌లు, సోషల్‌ మీడియా ఖాతాలను కూడా తొలగిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వాటి ప్రసారాల్లో మార్పు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. కేంద్రం తాజాగా తొలగించినవాటిలో 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్‌లు, 57 సోషల్‌ మీడియా ఖాతాలు ఉన్నాయి.

తొలగించిన యాప్‌లలో 7 గూగుల్‌ ప్లే స్టోర్‌వి కాగా, 3 యాపిల్‌ యాప్‌ స్టోర్‌ లోనివిగా గుర్తించారు. ఇక సోషల్‌ మీడియా ఖాతాల్లో ఫేస్‌బుక్‌లో 12, ఇన్‌స్టాగ్రామ్‌లో 17, ఎక్స్‌లో 16, యూట్యూబ్‌లో 12 ఉన్నట్టు కేంద్ర సమాచార శాఖ ఈ సందర్భంగా తెలిపింది. దేశీయంగా ఉన్న 18 ఓటీటీ వేదికలు అసభ్యకర కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నాయంటూ కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ రెండు రోజుల క్రితం వెల్లడించారు. వాటిపై చర్యలు తీసుకుంటాయని కూడా స్పష్టం చేశారు.

తొలగించిన ఓటీటీలకు కోటికి పైగా డౌన్‌లోడ్‌లు ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఇవి సోషల్‌ మీడియా ద్వారా అశ్లీల కంటెంట్‌కు సంబంధించిన ట్రైలర్, దృశ్యాలు, వెబ్‌లింక్‌లను ప్రచారం చేస్తున్నాయని వెల్లడించారు. ప్రతి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు 32 లక్షల వీక్షణలు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. భారత్‌లో ఓటీటీ పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేవాటిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

తొలగించిన ఓటీటీల వివరాలివీ...

Dreams Films

Voovi

Yessma

Uncut Adda

Tri Flicks

X Prime

Neon X VIP

Besharams

Hunters

Rabbit

Xtramood

Nuefliks

MoodX

Mojfix

Hot Shots VIP

Fugi

Chikooflix

Prime Play

First Published:  14 March 2024 1:53 PM GMT
Next Story