ఏ వైపు తిరిగి నిద్రిస్తే మంచిదో తెలుసా?

ఒక్కోవైపు ఒక్కో లాభం
నిద్రించేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొ భంగిమలో పడుకుంటుంటారు. అయితే వీటిలో ఏ భంగిమతో ఎలాంటి లాభాలు, నష్టాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లకిలా పడుకుంటే..
వెన్నెముకను సమాంతరంగా ఉంచి వెల్లకిలా పడుకుని నిద్రించడం చాలామందికి అలవాటు. ఇలా పడుకోవడం వల్ల శ్వాస లోతుగా ఆడుతుంది. గాఢమైన నిద్ర పడుతుంది.
ఎడమవైపు
ఎడమవైపు తిరిగి నిద్రించడం ద్వారా త్వరగా నిద్రపడుతుందని స్టడీల్లో తేలింది. అంతేకాదు ఎడమవైపు తిరిగి పడుకుంటే గుండెపై ఒత్తిడి తగ్గి, రక్త సరఫరా మంచిగా జరుగుతుంది. తద్వారా శరీరం మరింత ఎక్కువ విశ్రాంతి పొందుతుంది.
కుడి వైపు
కుడి వైపు తిరిగి పడుకుంటే నిద్రకు ఆటకం కలిగే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పోశ్చర్ వల్ల అజీర్తి, గుండె నొప్పి వంటి సమస్యలు రావొచ్చు.
తిన్న తర్వాత ఇలా..
తిన్న తర్వాత విశ్రాంతి తీసుకోవాలనుకుంటే ఎడమవైపు తిరిగి పడుకోవడమే సరైన భంగిమ. ఈ పోశ్చర్‌‌లో జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పడదు. అలాగే గర్భిణులకు కూడా ఈ పోశ్చర్ మంచిది.
బోర్లా పడుకుంటే..
బోర్లా పడుకోవడాన్ని బ్యాడ్ పోశ్చర్‌‌గా డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ పోశ్చర్ వల్ల కీళ్ల సమస్యలు, మెడ, వెన్ను నొప్పుల వంటివి మొదలవ్వొచ్చు. ముఖ్యంగా వయసు పైబడినవాళ్లు ఈ పోశ్చర్‌‌లో నిద్రించకూడదు.
జాగ్రత్తలు ఇలా..
ఇకపోతే నిద్రించేటప్పుడు పరుపు లేదా మంచం వంగిపోకుండా సమాంతరంగా ఉంటే మంచిది. అలాగే వెల్లకిలా పడుకునేవాళ్లు సన్నటి దిండు.. పక్కకి తిరిగి పడుకునేవాళ్లు మెడ ఎత్తుకి సరిపోయే దిండుని వాడాలి.