డయాబెటిస్ ఉన్నా ఇవి తినొచ్చు!

తియ్యగా తినాలంటే..
డయాబెటిస్ ఉంటే నోరు కట్టేసుకోవాలి అనుకుంటారు చాలామంది. ముఖ్యంగా తీపి పదార్థాల జోలికే వెళ్లకూడదనుకుంటారు. అయితే డయాబెటిస్ వాళ్లు కూడా తియ్యగా తినదగిన కొన్ని స్వీట్స్ అండ్ డిజర్ట్స్ ఉన్నాయి. అవేంటంటే..
యాపిల్ డిజర్ట్
డయాబెటిస్ ఉన్నవాళ్లు యాపిల్‌తో చేసిన డిజర్ట్స్ తీసుకోవచ్చు. షుగర్ ఫ్రీ యాపిల్ జామ్, యాపిల్ హల్వా.. ఇలా షుగర్ లేకుండా అచ్చం యాపిల్, పాలతో చేసే పలు డిజర్ట్స్‌ను ఆస్వాదించొచ్చు.
డార్క్ చాక్లెట్
డయాబెటిస్ పేషెంట్లకు డార్క్ చాక్లెట్ మేలు చేస్తుంది. డార్క్ చాక్లెట్‌లోని ఫ్లేవనాయిడ్స్ రక్తంలో షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. షుగర్ లేకుండా చేసిన డార్క్ చాక్లెట్ కప్ కేక్స్, బ్రౌనీస్, స్మూతీస్ వంటివి తీసుకోవచ్చు.
పియర్స్
పియర్ పండ్లు షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ లో ఉంచుతాయి. వీటితో చేసిన పియర్ కేక్స్, పియర్ ఆల్మండ్ స్మూతీ వంటివి రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి.
బనానా
అరటిపండ్లలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. కాబట్టి షుగర్ పేషెంట్లు అరటిపండ్లతో చేసిన మిల్క్ షేక్స్, బనానా స్మూతీ, బనానా కేక్స్, బనానా కుకీస్, బనానా మఫిన్స్ వంటివి తీసుకోవచ్చు.
ఇవి కూడా
ఇక వీటితోపాటు జీడిపప్పు, బాదం, బెర్రీ పండ్లతో చేసిన స్వీట్లు, ఓట్స్, కొబ్బరితో చేసిన షుగర్ ఫ్రీ డిషెస్‌ను కూడా డయాబెటిస్ ఉన్నవాళ్లు తీసుకోవచ్చు.
ఈ జాగ్రత్తలు ముఖ్యం
డయాబెటిస్ ఉన్నవాళ్లు స్వీట్స్ లేదా డిజర్ట్స్ వంటివి తినాలంటే పండ్లగుజ్జు లేదా కొద్దిగా తేనె వంటివి వాడుకోవాలి. తీపి కోసం చాలా తక్కువమొత్తంలో ఖర్జూర పండ్లను కూడా వాడుకోవచ్చు. ఏదేమైనా షుగర్ పేషెంట్లు తీపి పదార్థాలను చాలా మితంగా తీసుకోవడం ఎంతైనా మంచిది.