ప్రొటీన్ సరిపోట్లేదనడానికి సంకేతాలివే

ప్రొటీన్ ఎంతో ముఖ్యం
శరీరం నిలబడడానికి, శక్తి కోసం ప్రొటీన్స్ ఎంతో అవసరం. ఒక వ్యక్తికి రోజుకి తన బరువులో కిలోకి 0.8 గ్రాముల ప్రొటీన్ అవసరం. ఒకవేళ శరీరంలో ప్రొటీన్ లోపిస్తే అది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఇమ్యూనిటీ తగ్గుతుంది
శరీరంలో తగినంత ప్రొటీన్ లేకపోతే ఇమ్యూనిటీ లోపిస్తుంది. తద్వారా సాధారణ ఇన్ఫెక్షన్లు తరచూ తిరగబెడుతుంటాయి. అనారోగ్య సమస్యలు త్వరగా తగ్గకుండా ఎక్కువకాలం వేధిస్తుంటాయి.
వాపు
శరీరంలో లిక్విడ్స్‌ని బ్యాలెన్స్ చేయడంలో ప్రొటీన్స్ కీలక పాత్ర పోషిస్తాయి. శరీరంలో ప్రొటీన్ లోపించినప్పుడు అసాధారణమైన వాపు కనిపిస్తుంది. నొప్పి లేకుండానే చేతులు కాళ్లు కొద్దిగా ఉబ్బినట్టు కనిపిస్తాయి.
మజిల్ వీక్‌నెస్
కండరాల ఆరోగ్యానికి ప్రొటీన్స్ కీలకం. కాబట్టి ప్రొటీన్స్ లేకపోతే కండరాలు, కీళ్లు బలహీనపడతాయి. ఫలితంగా కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వస్తాయి.
అనీమియా
ప్రొటీన్ డెఫీషియన్సీ వల్ల రక్త కణాల అభివృద్ధి తగ్గుతుంది. తద్వారా రక్త హీనత, బరువు తగ్గడం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.
జుట్టు, చర్మం ఇలా..
జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉండడానికి ప్రొటీన్స్ ఎంతో అవసరం. కాబట్టి ప్రోటీన్ లోపం వల్ల చర్మంపై పొట్టు రాలడం, జుట్టు రాలడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
జాగ్రత్తలు ఇలా..
ప్రొటీన్‌ లోపం ఉన్నట్టు అనుమానం వస్తే వెంటనే డాక్టర్ సలహా తీసుకుని తగిన మందులు వాడడం మంచిది. అలాగే ప్రొటీన్స్ కోసం పప్పులు, నట్స్, పాలు, గుడ్డు వంటివి తీసుకుంటుండాలి.