సమ్మర్ కోసం రిఫ్రెషింగ్ డ్రింక్స్!

హెల్దీ డ్రింక్స్
ఎండాకాలం లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటే డీహైడ్రేషన్, వేడి వంటి సమస్యలుండవు. పైగా ఈ సీజన్‌లో చల్లగా ఏవైనా తాగాలనిపిస్తుంటుంది. అందుకే ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగిన కొన్ని డ్రింక్స్ ఇప్పుడు చూద్దాం.
పానకం
సమ్మర్‌‌లో పానకం చలువ చేస్తుంది. బెల్లాన్ని మెత్తగా దంచి నీళ్లలో కలుపుకోవాలి. తర్వాత అందులో మిరియాలపొడి, శొంఠి పొడి, యాలకుల పొడి కొద్దిగా ఉప్పు వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. దీన్ని రోజుకోసారి తాగితే వేడి తగ్గుతుంది.
మ్యాంగో లస్సీ
ఈ సీజన్‌లో లభించే మామిడి పండ్లతో టేస్టీ లస్సీ చేసుకోవచ్చు. ముందుగా మామిడిపండ్ల గుజ్జుని మెత్తగా మిక్సీ పట్టుకుని అందులోనే పెరుగు, రెండు యాలకులు, తేనె, ఐస్ క్యూబ్స్‌ కూడా మరోసారి మిక్సీ పట్టాలి. అంతే టేస్టీ మ్యాంగో లస్సీ రెడీ.
జల్ జీరా
సమ్మర్‌‌లో మంచి అరుగుదల కోసం జల్ జీరా తాగొచ్చు. ముందుగా మిక్సీలో పుదీనా, కొత్తిమీర, కొద్దిగా చింతపండు రసం వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. అందులో జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసి నీళ్లు పోసి మరోసారి మిక్సీ పట్టి, మెత్తటి గుడ్డతో వడపోస్తే జల్ జీరా రెడీ.
వాటర్‌‌మిలన్ చిల్లర్
పుచ్చకాయ ముక్కలు, దానిమ్మ గింజలను మిక్సీ గిన్నెలో వేసి అందులో కొద్దిగా నిమ్మరసం, రెండు పుదీనా ఆకులు వేసి బ్లెండ్ చేసి ఐస్ క్యూబ్స్ వేసుకుంటే వాటర్ మిలన్ చిల్లర్ రెడీ.
ఆరెంజ్ ఎనర్జీ డ్రింక్
సమ్మర్‌‌లో అలసిపోయి ఇంటికిరాగానే ఆరెంజ్ డ్రింక్ తాగితే రీఫ్రెష్ అవ్వొచ్చు. వెచ్చనినీటిలో రెండు టీస్పూన్ల తేనె, కొద్దిగా ఉప్పు, ఒక చెక్క నిమ్మరసం వేసి చల్లారేవరకూ ఆగాలి. తర్వాత అందులో ఆరెంజ్ జ్యూస్ కలిపి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే ఆరెంజ్ ఎనర్జీ డ్రింక్ రెడీ.
ఇవి కూడా
ఇక వీటితోపాటు తేనె కలిపిన నిమ్మరసం, మజ్జిగ, కీరా ముక్కలు, క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్ వంటివి కూడా సమ్మర్‌‌లో మేలు చేస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా రోజుకి నాలుగు లీటర్ల నీటిని తాగడం మర్చిపోకూడదు.