ఇలా చేస్తే పగటిపూట నిద్రరాదు!

కారణాలివీ..
డయాబెటిస్, నిద్రలేమి, ఒత్తిడి, విటమిన్ల లోపం, కొన్ని రకాల మందులు వాడడం వంటి కారణాల వల్ల కొంతమందికి పగటిపూట నిద్ర వస్తుంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి గట్టెక్కొచ్చు.
ప్రొడక్టివిటీపై ఎఫెక్ట్
పగటిపూట నిద్ర మత్తు ఆవహించడం వల్ల చాలా నష్టాలుంటాయి. దీనివల్ల రోజంతా నిరుత్సాహంగా అనిపించడంతోపాటు పనిలో ప్రొడక్టివిటీ తగ్గుతుంది. ఇదిలాగే కంటిన్యూ అయితే చికాకు, ఒత్తిడి పెరుగుతాయి. ఏకాగ్రత లోపిస్తుంది. మెటబాలిజం తగ్గుతుంది.
టైమింగ్ ముఖ్యం
పగటిపూట నిద్ర వస్తున్నవాళ్లు క్రమం తప్పకుండా ఒక స్లీప్ సైకిల్‌ను ఫాలో అవ్వాలి. రోజూ ఒకే టైంకు పడుకుని ఒకే టైంకి నిద్ర లేచేలా అలవాటు చేసుకోవాలి. ఆరు లేదా ఏడు గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.
ఇవి తినొద్దు
పగటిపూట కునుకుపాట్లు పడకూడదంటే కెఫీన్, నికోటిన్, ఆల్కహాల్‌ వంటివి మానేయాలి. నూనె పదార్థాలు, జంక్ ఫుడ్‌ను కూడా వీలైనంత తగ్గిస్తే మంచిది. తాజా ఆహారాలు తీసుకుంటే శరీరం యాక్టివ్‌గా ఉంటుంది.
కాస్త వ్యాయామం
ఉదయం లేవగానే కొంతసేపు వర్కవుట్లు లేదా జాగింగ్ వంటివి చేయడం చేయడం ద్వారా రోజంతా యాక్టివ్‌గా ఉండొచ్చు. అలాగని మితిమీరిన వ్యాయామం చేస్తే నిస్సత్తువ ఆవహిస్తుంది. కాబట్టి తేలికపాటి వ్యాయామాలు చేయాలి.
పవర్ న్యాప్
పగటి పూట నిద్రవచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేయకుండా ఓ ఇరవై నిముషాల పాటు పడుకోవాలి. ఇలా ఒక పవర్ న్యా్ప్‌ వేసి ఫ్రెషప్ అయితే మళ్లీ యాక్టివ్‌గా అనిపిస్తుంది.
ఇవి కూడా..
రాత్రిళ్లు వీలైనంత ఎక్కువసేపు నిద్రపోతే పగటిపూట నిద్ర రాదు. దానికోసం స్క్రీన్ టైం తగ్గించాలి. ఒత్తిడిని తగ్గించే మార్గాల కోసం వెతకాలి. ధ్యానం వంటివి చేయొచ్చు. అలాగే బీపీ, డయాబెటిస్‌ను కూడా కంట్రోల్‌లో ఉంచుకోవాలి.