నోటిపూతకు చెక్ పెట్టండిలా!

చలికాలం ఎక్కువ
సాధారణంగా చలికాలంలో ఇమ్యూనిటీ తగ్గుతుంటుంది. దీనివల్ల జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లతోపాటు నోటి పూత కూడా ఎక్కువగా వస్తుంటుంది. దీన్నెలా తగ్గించుకోవచ్చంటే..
డీహైడ్రేషన్
నోటి పూత రావడానికి వివిధ కారణాలున్నాయి. ముఖ్యంగా నీళ్లు తగినంత తీసుకోకపోవడం, సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల నోటి పూత వస్తుంటుంది. తగినంత నీరు తాగడం ద్వారా దీన్ని తగ్గించుకోవచ్చు.
విటమిన్ డెఫీషియన్సీ
హార్మోనల్ ఇంబాలెన్స్, జింక్, విటమిన్–బీ12, విటమిన్–సీ, ఐరన్ వంటివి లోపించడం వల్ల కూడా నోటిపూత వస్తుంది. ఇలాంటప్పుడు తగిన పోషకాహారం తీసుకోవడం ద్వారా సమస్యను తగ్గించుకోవచ్చు.
తేనె
నోటి పూతకు తేనె మంచి మెడిసిన్‌గా పనిచేస్తుంది. పూత వచ్చిన ప్రాంతంలో తరచూ తేనే పూస్తుండడం ద్వారా రెండు రోజుల్లో నోటి పూత తగ్గుముఖం పడుతుంది. తేనెలోని యాంటీమైక్రోబయల్ గుణాలు పూతను తగ్గిస్తాయి.
కొబ్బరి
కొబ్బరిలో ఉండే వగరు, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి గుణాలు పూతను తగ్గించడంతో సాయపడతాయి. కొబ్బరినీళ్లు లేదా పచ్చి కొబ్బరి తీసుకోవడం ద్వారా నోటిపూత తగ్గుతుంది. కొబ్బరి నూనె రాసుకున్నా ఫలితం ఉంటుంది.
పాలు
పాలు లేదా పాల పదార్థాలతో కూడా నోటిపూత సమస్యను తగ్గించుకోవచ్చు. పూత ఉన్న చోట వెన్న లేదా నెయ్యి రాయడం, రోజుకి రెండుమూడు సార్లు మజ్జిగ తాగడం ద్వారా సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.
తులసి
తులసి ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు నోటి పూతను వెంటనే తగ్గిస్తాయి. నోటిలో నాలుగు తులసి ఆకుల్ని వేసుకుని ఎక్కువసేపు నమలాలి. ఇలా రోజుకు నాలుగైదు సార్లు చేస్తే నోటిపూత తగ్గుతుంది.
నొప్పి పోవాలంటే..
నోటిపూత వల్ల వచ్చే నొప్పి తగ్గడం కోసం లవంగం నమలితే సరిపోతుంది. లేదా పూత ఉన్నచోట లవంగం నూనె రాసినా చాలు. ఎంత ప్రయత్నించినా నోటిపూత తగ్గకపోతుంటే, నాలుగు కంటే ఎక్కువ రోజుల పాటు వేధిస్తుంటే డాక్టర్‌‌ను కలవడం మంచిది.