వర్షాకాలంలో ఈ ప్లేసులు మిస్ అవ్వొద్దు!

మాన్‌సూన్ టూర్స్
వర్షాకాలంలో కొన్ని ప్రదేశాలు చూడముచ్చటగా ముస్తాబవుతాయి. ముఖ్యంగా మనదేశంలో అచ్చంగా మాన్‌సూన్ సీజన్‌లోనే చూడాల్సిన ప్లేసులు కొన్ని ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
కేరళ
పచ్చని అందాలతో కనువిందు చేసే కేరళ.. మిగతా సీజన్లలో ఒకలా, వర్షాకాలంలో ఒకలా ఉంటుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో కేరళలోని అలపుజా, కొజికొడై, వయానాడ్ ప్రాంతాలు మరింత అందంగా తయారవుతాయి. వర్షం కురుస్తున్నప్పుడు అలపుజా బోట్ రైడ్ చేయడం ఒక ప్రత్యేకమైన అనుభూతి.
లఢాఖ్
మిగతా సీజన్లలో మంచుతో కప్పబడి ఉండే లఢాఖ్ ఈ సీజన్‌లో జలపాతాలు, సరస్సులతో కనువిందు చేస్తుంది. హిమాలయాల మధ్యలో ఉండే ఈ ఎడారి ప్రాంతంలో వర్షాకాలమంతా కారుమబ్బులు కమ్మి.. చూసేందుకు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది.
అరకు
ఆంధ్రప్రదేశ్‌లోని అరకు ప్రాంతం మాన్ సూన్ సీజన్‌లో మరింత పచ్చగా తయారవుతుంది. అరకు ప్రాంతానికి దగ్గర్లోని లంబసింగిలో ఈ సీజన్ పొడవునా చిరుజల్లులు కురుస్తూ.. ప్రత్యేకమైన అనుభూతిని పంచుతుంది.
కొడైకెనాల్
సౌత్ ఇండియాలోని బెస్ట్ హిల్ స్టేషన్స్‌లో ఒకటైన కొడైకెనాల్.. ఈ సీజన్‌లో వెళ్లాల్సిన బెస్ట్ టూరిస్ట్ స్పాట్. వర్షాకాలం వస్తే ఇక్కడి సరస్సులన్నీ నిండిపోతాయి. రోజంతా మబ్బులు కమ్మినట్టు ఉండే వాతావరణం ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది.
మేఘాలయ
ప్రపంచంలో అత్యధిక వర్షపాతాలు నమోదయ్యే మాసిన్రామ్, చిరపుంజీ ప్రాంతాలు మేఘాలయలోనే ఉన్నాయి. ఇక్కడ ఏడాదంతా వర్షాలు కురుస్తూనే ఉంటాయి. ఇక ఈ సీజన్‌లో అయితే అసలు గ్యాప్ ఉండదు. ఈ సీజన్‌లో ఇక్కడి జలపాతాలన్నీ పరవళ్లు తొక్కుతూ మరింత అందంగా ముస్తాబవుతాయి.
అస్సాం
పచ్చిక మైదానాలతో నిండి ఉండే అస్సాం రాష్ట్రం.. వర్షాకాలం వచ్చిందంటే మరింత ఆహ్లాదకరంగా మారిపోతుంది. ఎటుచూసినా పచ్చని మైదానాలు, కొండలు, కారుమబ్బులు.. మనసులో ఉల్లాసాన్ని నింపుతాయి.