పాలతో అందంగా మారొచ్చు!

పాలతో స్కిన్ కేర్
చర్మాన్ని యవ్వనంగా ఉంచేందుకు, మొటిమలు, ముడతల వంటివాటిని తగ్గించేందుకు మరే ఇతర క్రీములు అవసరం లేదు. కేవలం పాలతోనే రకరకాల స్కిన్ సమస్యలను దూరం చేసుకోవచ్చు. అదెలాగంటే..
మాయిశ్చరైజర్‌‌గా
చర్మం ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం కోసం కేవలం పచ్చి పాలు చాలు. రోజుకోసారి చర్మానికి పాలు అప్లై చేస్తే చర్మానికి కావాల్సిన సహజ కొవ్వులు, ప్రొటీన్లు లభిస్తాయి.
డీ ట్యాన్ ఇలా
పాలలో గుమ్మడి గింజల పొడి కలిపి వారానికి మూడు సార్లు ప్యాక్‌లా వేసుకుంటే చర్మంలోని మృతకణాలన్నీ తొలగిపోయి స్కిన్ తాజాగా, కాంతివంతంగా మారుతుంది.
ముడతల కోసం
పాలల్లో ఉండే విటమిన్లు, ప్రొటీన్లు చర్మాన్ని బిగుతుగా ఉంచుతాయి. పాలలో కొద్దిగా పసుపు కలిపి ముఖానికి పట్టిస్తే వృద్ధాప్య ఛాయలు తగ్గి చర్మం టైట్‌గా మారుతుంది.
మచ్చలు పోవాలంటే
ముఖంపై ఉండే మొండి మచ్చలు పోవాలంటే పాలలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి అప్లై చేయాలి. వారానికి రెండు మూడు సార్లు ఇలా చేస్తుంటే క్రమంగా మచ్చలు కనుమరుగవుతాయి.
మీగడతో ఇలా
పొడి చర్మం, పొట్టు రాలడం వంటి సమస్యలున్నవాళ్లు కాచిన పాలపై పేరుకునే మీగడను ప్యాక్‌లా వేసుకోవాలి. దీనివల్ల స్కిన్ తేమగా, తాజాగా మారుతుంది.
బ్రైట్‌నెస్ కోసం
పచ్చి పాలలో కొంచెం శనగపిండిని కలిపి ప్రతి రోజూ ముఖానికి పట్టిస్తూ ఉంటే.. కొద్దిరోజుల్లోనే మెరిసే చర్మం మీ సొంతం.