నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? ఇవి తెలుసుకోండి!

లేచింది మొదలు..
స్మార్ట్ ఫోన్ యూజర్స్‌లో 80 శాతం మంది నిద్ర లేచిన 15 నిముషాల్లోపు ఫోన్ చూస్తున్నారని ఓ స్టడీలో తేలింది. అయితే ఇది అంత తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కాదంటున్నారు మానసిక నిపుణులు. ఈ అలవాటు వల్ల క్వాలిటీ లైఫ్ కోల్పోతారంటున్నారు.
నష్టాలివీ..
మొబైల్ వాడకాన్ని కంట్రోల్ చేసుకోవడం అంత ఈజీ కాదు. కానీ, కనీసం ఉదయాన్నే ఫోన్ చూసే అలవాటును మాత్రం మార్చుకోవాలంటున్నారు నిపుణులు. లేవగానే మొబైల్ చూడడం వల్ల బోలెడు ప్రమాదాలనున్నాయట.
అనవసరమైన ఒత్తిడి
రోజులో మొదట చేసే పని.. ఆరోజు మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. లేవగానే ఫోన్‌లో నోటిఫికేషన్స్, మెసేజ్‌లు, సోషల్‌ మీడియా అప్‌డేట్స్ చూడడం వల్ల అనవసరమైన ఒత్తిడితో రోజుని మొదలుపెట్టాల్సి వస్తుంది.
డోపమైన్ ఎఫెక్ట్
ఉదయాన్నే చేసే పనిపై బ్రెయిన్ పూర్తి ఫోకస్ పెడుతుంది. రోజూ లేవగానే ఫోన్ చూస్తుంటే మెదడులో మరింత ఎక్కువ డోపమైన్ రిలీజ్ అయ్యి మెదడు దాన్నొక అలవాటుగా మార్చుకుంటుంది. ఇది క్రమంగా మొబైల్ అడిక్షన్‌కు దారితీయగలదు.
ప్రొడక్టివిటీపై ఎఫెక్ట్
నిద్ర లేవగానే ఫోన్ వాడే అలవాటు వల్ల క్రమంగా యాంగ్జైటీ పెరుగుతుందని స్టడీల్లో తేలింది. రోజులో చేసే మిగతా పనులపై దీని ఎఫెక్ట్ పడుతుందట. తద్వారా క్రమంగా ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది.
డిస్ట్రాక్షన్
లేవగానే వ్యాయామం చేయడం లేదా చదువుకునే అలవాటుంటుంది చాలామందికి. అలాంటివాళ్లు లేచిన వెంటనే కేవలం పది నిముషాలపాటు ఫోన్ చూసినా చాలు.. చేయాల్సిన పనుల మీద ఫోకస్ దెబ్బతింటుంది. స్టూడెంట్స్‌కు దీని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ.
నెగెటివ్ థింకింగ్
లేవగానే మొబైల్ చూసే అలవాటు వల్ల నెగెటివ్ థింకింగ్ పెరుగుతుందని స్టడీల్లో తేలింది. అంతేకాదు.. కంటి ఆరోగ్యం, డెసిషన్ మేకింగ్‌పై కూడా దీని ప్రభావం ఉంటుందట.
ఇలా చేయాలి
నిద్ర లేచిన తర్వాత కనీసం గంటపాటు మొబైల్ చూడకుండా ఉంటే మంచిదని నిపుణులు చెప్తున్నారు. మార్నింగ్ టైంను వ్యాయామం లేదా మనసుకు హాయినిచ్చే పనులకు కేటాయించడం వల్ల మానసిక ఆరోగ్యం బాగుంటుంది.