Telugu Global
Others

సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ విద్యావేత్తల బహిరంగ లేఖ

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన భూమిని జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి.

సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ విద్యావేత్తల బహిరంగ లేఖ
X

గౌరవనీయులు ఎ. రేవంత్ రెడ్డి,

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను, ప్రభుత్వ విద్యా సంస్థల భవిష్యత్తును ఆకాంక్షించే ఆలోచనా పరులుగా తెలంగాణా విద్యావేత్తల బహిరంగ లేఖ

విషయం: డా. బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన భూమిని జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం గురించి.

తెలంగాణ విద్యావంతుల ఆలోచనలు, విద్యార్థుల ఆకాంక్షలు, ప్రజా ఉద్యమాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రం విద్యారంగం ఆశించిన ఫలితాలు సాధించలేదు. కారణాలు ఏమయినప్పటికీ గడిచిన పదేళ్లలో ప్రజల ఆకాంక్షల మేరకు ఉన్నత విద్యా వ్యవస్థలో పురోగతి కనిపించలేదు. మీరు ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్న కొన్ని చర్యలు, విధాన నిర్ణయాలు విద్యారంగ పటిష్టతకు తోడ్పడతాయని ఆశిస్తున్నాం. అదే సమయంలో డా. బి. ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో ఏర్పడిన సంక్షోభాన్ని మీ దృష్టికి రావాలని ఈ లేఖ రాస్తున్నాం. జూబిలీ హిల్స్ లో ఉన్న డా. బి. ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి చెందిన స్థలంలో నుంచి పది ఎకరాలు జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి కేటాయిస్తూ తెలంగాణా ప్రభుత్వ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారు సెప్టెంబర్ 19న ఒక నిర్ణయం తీసుకుని, తదుపరి చర్యల కోసం రెండు విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్ లకు (లెటర్ నెంబర్ 1043/TE /ఏ /2024) లేఖ రాసిన విషయం మా దృష్టికి వచ్చింది. ఇది మమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ విశ్వవిద్యాలయం ఆవిర్భావ నేపథ్యం, మన సమాజం మీద ఆ సంస్థ ప్రభావం తెలిసిన వారీగా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకు రావడం మా బాధ్యతగా భావిస్తున్నాం.

మీకు ఈ విశ్వవిద్యాలయం ఆవిర్భావం అభివృద్ధి గురించి కొంత వివరించే ప్రయత్నం చేస్తాం. డా. బీ ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం, 1970 వ దశకం చివర్లో ఈ దేశాన్ని ఉన్నత విద్యారంగం లో ముందుకు తీసుకు వెళ్ళడానికి అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ నాయకత్వంలో ని ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ విధానాల్లో భాగంగా ఈ దేశంలో సార్వత్రిక విద్యా విధానానికి సంబంధించిన ఆలోచన కలిగింది. దేశంలో మొట్టమొదటి సారిగా ఆ ఆలోచనను ఆచరణ రూపంలోకి తీసుకు రావడానికి 1982 లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ భవనం వెంకట్రామ్, విద్యాశాఖ మంత్రి కె. కేశవరావు గారు ఎంతో చొరవ చూపారు. వారికి ప్రముఖ విద్యావేత్త, ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి. రాం రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు. వారి నేతృత్వం లోనే దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం గా 'ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం' ఆగస్టు 26న రాష్ట్ర శాసనం ద్వారా ఏర్పడింది. మొదటి వీసీగా ప్రొఫెసర్ జి. రామ్ రెడ్డి గారి నాయకత్వంలో మనం సాధించిన ఈ విజయం యావత్ భారత దేశానికి మార్గదర్శిగా నిలిచింది. ఈ విజయాన్ని గుర్తించిన ఆనాటి ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ 1985 లో ఇదే నమూనాలో ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక . విశ్వవిద్యాలయాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేశారు. దానికి కూడా ప్రొఫెసర్ రామ్ రెడ్డి గారే మొదటి వైస్-ఛాన్సలర్ గా నాయకత్వం వహించి ఇదే నమూనాను దేశ వ్యాప్తం చేశారు. ఆ విశ్వవిద్యాలయ భావి ప్రభావాన్ని గుర్తించిన రాజీవ్ గాంధీ గారు ఢిల్లీ నగరంలో 150 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. విద్యను ప్రజాస్వామయీకరించడానికి పరితపించిన భారత రాజ్యాంగ నిర్మాత డా. బీ ఆర్ అంబేడ్కర్ శత జయంతి సందర్భంగా 1991లో ఈ విశ్వవిద్యాలయం లక్ష్యాలు , అంబేడ్కర్ గారి ఆశయాలు ఒక్కటేనని గుర్తించిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయం పేరును డా. బీ. ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం గా మార్చింది. మొదట నాగార్జున సాగర్ లో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయం రాష్ట్ర రాజధానిలో అందరికీ అందుబాటులో ఉండాలని హైదరాబాద్ తరలించి నగరం వెలుపల 120 ఎకరాల స్థలం కేటాయించారు. కానీ దూరవిద్య అయినా ప్రజలకు చేరువలో ఉండాలనే ఉద్దేశ్యంతో అప్పటి శ్రీ నందమూరి తారక రామారావు జూబిలీ హిల్స్ లో 54 ఎకరాల భూమిని కేటాయించి 1988 లో శంకుస్థాపన కూడా చేశారు. ఇప్పుడున్న క్యాంపస్ ను అప్పటి ప్రధాని, తెలుగు జాతి గర్వించదగ్గ మహానేత శ్రీ పీవీ నరసింహారావు 1994 లో ప్రారంభించారు.

డా. బీ. ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం భారతదేశంలో UGC-NAAC ద్వారా 'A గ్రేడ్ సాధించిన ఓపెన్ యూనివర్సిటీ లలో ఒకటి. అలాగే ఇంగ్లీష్ తో పాటు తెలుగు, ఉర్దూ ప్రాంతీయ భాషల్లో వివిధ కోర్సులు అందిస్తున్న ఏకైక విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందింది. ఇప్పటికే ఐదు లక్షల మందికి పైగా ఈ విశ్వవిద్యాలయం ద్వారా ఉన్నత విద్యావకాశాలు పొందారు. ఏటా లక్షన్నర మందికి పైగా వివిధ కోర్సుల్లో చేరుతున్న విద్యార్థులతో కలిపి ఇప్పటికీ కనీసం పది లక్షల మందికి నిరంతరం సేవలు అందిస్తోంది. ఇందులో చేరుతున్న వారిలో దాదాపు 90 శాతం మంది రెగ్యులర్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో ఖరీదైన చదువులు చదువ లేని నిరుపేదలు, గ్రామీణ ప్రాంతాల వాళ్ళు,మధ్యలో చదువు మానేసి చిన్నా,చితకా పనులు చేసుకుంటున్న శ్రమజీవులు. కార్మికులు, కర్షకుల పిల్లలు. వీరిలో నూటికి దాదాపు 86 మంది దళిత బహుజన వర్గాలు. దాదాపు సగం మంది చదువులకు నోచుకోని మహిళలు, గృహిణులు. ఒక రకంగా డా. బీ. ఆర్. అంబేడ్కర్ ఏ వర్గాల అభ్యున్నతికి జీవితాంతం పోరాడారో ఆ వర్గాలకు తక్కువ ఖర్చుతో, నాణ్యమైన, ఉన్నత విద్యను అందించి ఆయన ఆశయాలకు ప్రతీకగా నిలబడిన సంస్థ ఇది. మధ్యలో చదువు మానేసి ఇక జీవితం ముగిసిపోయిందని భావించిన లక్షలాది మందికి వెలుగు ప్రసాదించి నలభై ఏళ్లుగా ఒక దీప స్తంభం గా నిలబడి కొత్త దారి చూపించిన సంస్థ ఇది. ఇక్కడ చదువుకున్న అనేకమంది ఐఏఎస్ మొదలు అనేక ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నారు. అంతే కాదు ఏటా లక్షలాది మందికి అడ్మిషన్లు ఇచ్చి ఉన్నత విద్యారంగం స్థూల నమోదు నిష్పత్తి - Gross Enrolment Ratio (GER) లో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను దేశంలో ముందు వరసలో నిలిపిన విశ్వవిద్యాలయం ఇది. మీ శాసన సభ్యులు, మంత్రివర్గ సహచరులు కూడా ఈ విశ్వవిద్యాలయం ద్వారా చదువు పూర్తి చేసినవారు, చదువుకుంటున్నవారు ఉండడం మనందరికీ గర్వకారణం.

ఓపెన్ యూనివర్సిటీ దూరవిద్యా విధానం కాబట్టి ఇక్కడ విద్యార్థులు ఉండరనే భావన కొందరికి ఉంటుంది. కానీ డా. బి. ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ దానికి పూర్తిగా భిన్నమైనది. ఇక్కడ యూజీ నుంచి పీహెచ్డీ వరకు విద్యా కార్యక్రమాలు ఉన్నాయి. ఇందులో కొన్ని కార్యక్రమాల శిక్షణ, బోధన పూర్తిగా ఇక్కడే జరుగుతుంది. బీఎస్సీ., ఎం.ఎస్సీ. తదితర సైన్స్ కోర్సులు, సైకాలజీ వంటి కార్యక్రమాలకు అవసరమైన సెంట్రల్ లాబొరేటరీలు ఇక్కడే ఉన్నాయి. ఈ ప్రయోగశాలల్లో నిరంతర శిక్షణ, రీసెర్చ్ స్కాలర్స్ పరిశోధనల తో పాటు దూర ప్రాంతాల విద్యార్థులకు కావలసిన ప్రాక్టికల్ శిక్షణ నమూనాల రూపకల్పన కూడా జరుగుతుంది. ఇక్కడి స్టూడియోల నుంచే దూర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు కావలసిన ఆన్-లైన్ బోధన, ఆడియో-వీడియో పాఠాల రూపకల్పన ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా జరుగుతుంది. వాటితో పాటు ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ,పరిశోధక విద్యార్థులకు నిరంతర బోధన జరుగుతుంది. డా. బి, ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం జూబిలీ హిల్స్ లోని కేంద్ర కార్యాలయం క్యాంపస్ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఏటా లక్షలాది మందికి అడ్మిషన్లు మొదలు అన్ని సేవలు ఇక్కడి నుంచి అందిస్తోంది. రోజూ వందలాది మంది విద్యార్థులు వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి అధ్యాపకులు విద్యార్థులకు కావలసిన, పాఠ్యాంశాలు, పుస్తకాలు, ఆడియో విజువల్ మెటీరియల్స్, ప్రాక్టికల్ మాన్యువల్స్ , కిట్స్ ఇక్కడే రూపొందిస్తుంటారు. ఓపెన్ యూనివర్సిటీ కేవలం పుస్తకాలు మాత్రమే కాదు. టెలివిజన్, రేడియో, ఆడియో మాధ్యమాల ద్వారా కూడా విద్యార్థులకు పాఠాలు రూపొందించి ప్రసారం చేస్తుంది. దానికి అవసరమైన సాంకేతిక వ్యవస్థ అంతా ఇక్కడే ఉంది. ఇట్లా దూరవిద్యలో కీలకమైన బోధనా వనరులు (Learning Resources) అన్నీ ఇక్కడే రూపొందుతాయి. వాటిని మారుమూల ప్రాంతాలకు, విద్యార్థుల గడప ముందుకు చేరవేసే సమగ్ర విద్యార్థుల సేవా వ్యవస్థకు ఈ క్యాంపస్ కేంద్ర బిందువు. నిజానికి డా. బి. ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం కోసం తొలుత కేటాయించిన 54 ఎకరాల్లో దాదాపు 10 ఎకరాలు దుర్గం చెరువు ఎకలాజికల్ జోన్ (బఫర్ జోన్) ఉంది, అందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టే అవకాశం లేదు. మిగిలిన భూమిలో దాదాపు 40 శాతం సహజసిద్ధమైన కొండ ప్రాంతం, వాటిని ధ్వంసం చేయకుండా, పర్యావరణానికి హాని కలగకుండా ఇప్పటివరకు ఏడు భవన సముదాయాలు, విద్యార్థుల స్టడీ మెటీరియల్ నిల్వ చేసే రెండు గోడౌన్ లు విశ్వవిద్యాలయం నిర్మించుకుంది. ప్రకృతిని పాడు చేయకుండా నిర్మాణాలు చేపట్టినందుకు విశ్వవిద్యాలయానికి యునెస్కో తో పాటు సేవ్ రాక్ సొసైటీ తో సహా అనేక సంస్థల అవార్డులు వచ్చాయి. పైగా అన్ని వైపులా ఆక్రమణలకు గురైన దుర్గం చెరువును కాపాడుతున్నది ఒక్క అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ నే అన్నది వాస్తవం. ఇప్పటికే T-SAT, We-Hub వంటి ప్రభుత్వ సంస్థలు దాదాపు మూడు ఎకరాల భూమిని లో ఉన్నాయి. దుర్గం చెరువు పైన నిర్మించిన కేబుల్ బ్రిడ్జి మూలంగా దాదాపు ఐదెకరాలకు పైగా భూమి పోయింది. కాబట్టి భూమి లభ్యత లేదని విశ్వవిద్యాలయం అధికారులు చెబుతున్నారు.

దీనికితోడు ప్రతి రోజూ వందలాది మంది విద్యార్థులు వివిధ అవసరాల కోసం క్యాంపస్ ను సందర్శిస్తుంటారు. నిజానికి తెలంగాణా సమాజానికి ఈ విశ్వవిద్యాలయం ఎంతో అవసరం అంతే కాకుండా మారుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని విశ్వవిద్యాలయం విస్తరించు కోవాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా విశ్వవిద్యాలయం తన విస్తరణ ప్రణాళిక రూపొందించినట్లు చెపుతోంది. శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి అనుగుణంగా ఎలక్ట్రానిక్ మీడియా రిసోర్స్ సెంటర్ ను , విద్యార్థుల నైపుణ్యం వికాసానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను , ఆన్-లైన్ విద్యా బోధనకు అవసరమైన ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుకు ఇప్పటికే పాలకమండలి అనుమతులు మంజూరు చేసింది. న్యాక్ అక్రెడిటేషన్ లో 'మంచి గ్రేడ్ సాధించిన దరిమిలా వీటికి యూజీసీ-రూసా నిధులు లభించే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ చేరుతున్న విద్యార్థులకు ఇంగ్లీషు తో పాటు ఇతర విదేశీ భాషల బోధన, శిక్షణకు ప్రత్యేక కేంద్రం, లాంగ్వేజ్ ల్యాబ్స్ ఏర్పాటు ప్రతిపాదన కూడా ఉంది. విశ్వవిద్యాలయం విస్తరణ ప్రణాళిక కు అవసరమైన స్థలం లేదు. ఈ దశలో క్యాంపస్ నుంచి భూమి తీసుకోవడం మూలంగా విశ్వవిద్యాలయం కార్యకలాపాలు కుంటుపడే ప్రమాదం ఉందని ఆందోళన విశ్వవిద్యాలయంలో వ్యక్తం అవుతోంది. అలాగే జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం కూడా విస్తరణకు విస్తృత అవకాశాలు ఉన్న సంస్థ, దాని అవసరాలకు కూడా పది ఎకరాలు ఎంత మాత్రమూ సరిపోకపోవచ్చు. రెండు విశ్వవిద్యాలయాలు ఒక క్యాంపస్ లో ఏర్పాటు చేయడం వాటి ఉనికికే ప్రమాదం. భావి అవసరాలను దృష్టిలో ఉంచుకుని వీటిని కాపాడాలని ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలని తెలంగాణా విద్యావేత్తలు గా మా సూచన.

రేవంత్ రెడ్డిగారూ !

మీరు ప్రజా పాలను హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడుతామని చెప్పారు. డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆదర్శమని మీరు, మీ పార్టీ, మీ నాయకుడు రాహుల్ గాంధీ పదేపదే చెపుతుంటారు. ఈ విశ్వవిద్యాలయం అణగారిన వర్గాల ఆశాజ్యోతి, ఆధునిక భారత నిర్మాత డా. బి.ఆర్.అంబేడ్కర్ పేరుతో ఉంది. అంతే కాదు ఆయన ఆకాంక్షలకు ప్రతీకగా పేద, బడుగు, బలహీన వర్గాలకు నామ మాత్రపు ఖర్చుతో నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తోంది. పైగా ఈ విశ్వవిద్యాలయం ఆలోచన, ఆవిర్భావం, ఎదుగుదలలో ఇందిరాగాంధీ మొదలు పీవీ నరసింహారావు గారి దాకా మీ ప్రభుత్వాల పాత్ర అడుగడుగునా ఉంది. ఆ స్ఫూర్తిని మీరు కాపాడుతారని విశ్వసిస్తున్నాం. విద్యకు సామాజిక ప్రయోజనం ఉంటుంది. విశ్వవిద్యాలయాలు ఆ ప్రయోజనాన్ని సమకూర్చే వేదికలుగా ఉంటాయి. అందులో అణగారిన వర్గాలకు, అవకాశాలు అందని వర్గాలకు బాసటగా ఉన్న విద్యాసంస్థలను, విశ్వవిద్యాలయాలను నిలబెట్టుకోవడం బాధ్యత మేం భావిస్తున్నాం. ఇప్పుడున్న విశ్వవిద్యాలయాల్లో నామమాత్ర ఫీజుతో నడుస్తున్న ఒకే ఒక్క విశ్వవిద్యాలయం ఇది. దీనిని నిలబెట్టడం అంబేడ్కర్ మహాశయుని ఆశయాలను నిలబెట్టడం అవుతుంది. మీరు పునరాలోచించాలని, మీ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఆ ఉత్తర్వులు రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

లేఖ కోసం కింది లింక్‌ను క్లిక్‌ చేయండి.



First Published:  28 Sept 2024 3:45 PM GMT
Next Story