Telugu Global
NEWS

విప్రో ఆఫీసులో కూర్చొని వేరే కంపెనీలకు పనిచేస్తున్న 300 మంది తొలగింపు

విప్రో సంస్థలో చాలా మంది మూన్ లైటింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గత రెండు నెలల్లో మూన్ లైటింగ్ చేస్తున్న 300 మందిని గుర్తించి విధుల నుంచి తొలగించినట్లు విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ వెల్లడించారు.

విప్రో ఆఫీసులో కూర్చొని వేరే కంపెనీలకు పనిచేస్తున్న 300 మంది తొలగింపు
X

సాఫ్ట్‌వేర్ రంగంలో ఇటీవల వినిపిస్తున్న మాట 'మూన్ లైటింగ్'. ఒక వ్యక్తి ఒకే సమయంలో రెండు ఉద్యోగాలు చేయడాన్నే మూన్ లైటింగ్‌గా ప‌రిగ‌ణిస్తారు. కరోనా లాక్‌డౌన్ సమయం నుంచి అన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ పద్దతిని ప్రవేశ పెట్టాయి. అంతే కాకుండా ఆ సమయంలో కంపెనీలు కొత్తగా రిక్రూట్ చేసుకోవడానికి వీలు లేకపోవడంతో.. అప్పటికే ఇతర సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను సంప్రదించాయి. దీంతో కొంత మంది ఉద్యోగులు ఇతర సంస్థలకు పార్ట్ టైం చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇంట్లో కూర్చొని రెండు కంపెనీలకు వర్క్ చేస్తుండంతో మాతృ సంస్థలు గుర్తించలేక పోయాయి. అయితే ఇటీవల చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎత్తేయడంతో ఉద్యోగులు ఆఫీసులకు రాక తప్పడం లేదు. ఈ క్రమంలో అప్పటికే వేరే సంస్థలతో పార్ట్‌టైం ఒప్పందాలు కుదుర్చుకున్న చాలా మంది తమ సొంత ఆఫీసులో కూర్చొని పక్క కంపెనీలకు కూడా పని చేయడం మొదలు పెట్టారు.

ఇటీవల పలు మూన్ లైటింగ్ కేసులు వెలుగులోకి రావడంతో ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థలు ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశాయి. ఆఫీసు సమయంలోనే కాకుండా ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఇతర సంస్థలకు పనిచేయడం నేరమని, ఉద్యోగంలో చేరినప్పుడు చేసుకున్న ఒప్పందంలో ఆ నిబంధన ఉందని స్పష్టం చేశాయి. అయినా సరే విప్రో సంస్థలో చాలా మంది మూన్ లైటింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గత రెండు నెలల్లో మూన్ లైటింగ్ చేస్తున్న 300 మందిని గుర్తించి విధుల నుంచి తొలగించినట్లు విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ వెల్లడించారు.

విప్రో సంస్థకు చెందిన ఉద్యోగులు టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐబీఎం కంపెనీల ప్రాజెక్టులను సమాంతరంగా చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఒకే విధమైన ప్రాజెక్టులు కావడంతో ఉద్యోగులు కూడా అవలీలగా రెండు ఉద్యోగాలు చేసేస్తున్నారు. అయితే విప్రో సంస్థ ఐటీ విభాగం.. తమ ఉద్యోగులు విప్రో ఐపీలను ఉపయోగించి వేరే కంపెనీ అకౌంట్లలోకి లాగిన్ అవుతున్న విషయాన్ని గమనించారు. కొన్ని వారాల పాటు వారిపై నిఘా పెట్టిన అనంతరమే సదరు ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తున్నది.

టెక్ మహీంద్ర సీఈవో గుర్నానీ ట్వీట్ చేస్తూ.. మూన్ లైటింగ్‌ను సహించేది లేదని తెలిపారు. ఒకే సమయంలో రెండు ఉద్యోగాలు చేయడం అంటే సొంత సంస్థను మోసం చేయడమే అని పేర్కొన్నారు. ఐటీ కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న సమయంలో ఇలా కొందరు ఉద్యోగుల కారణంగా.. సున్నితమైన సమాచారం లీక్ అయ్యే ప్రమాదం కూడా ఉందని ఆయన తెలిపారు. ఇన్ఫోసిస్ కూడా తమ ఉద్యోగులకు మూన్ లైటింగ్‌పై హెచ్చరికలు జారీ చేసింది. ఒకే సారి రెండు ఉద్యోగాలు చేయడాన్ని అంగీకరించబోమని పేర్కొన్నది. అలా ఎవరైనా ఎంప్లాయ్ చేస్తే వెంటనే టర్మినేట్ చేస్తామని హెచ్చరించింది. ఇలా ఒకే సారి రెండు ఉద్యోగాలు చేయడం మోసంతో సమానమని పేర్కొన్నది.

First Published:  22 Sep 2022 3:51 AM GMT
Next Story