Telugu Global
NEWS

దేశంలోనే తొలి ప్రైవేటు రాకెట్ రూపక‌ర్త‌లు.. మ‌న‌ తెలుగు తేజాలు - ఈ నెలలోనే నింగిలోకి దూసుకెళ్ల‌నున్న `విక్ర‌మ్‌-ఎస్‌`

శ్రీ‌హ‌రికోట‌లోని భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ రాకెట్ ప్ర‌యోగం చేయ‌నున్నారు. ప్ర‌స్తుత ప్ర‌యోగం డిమాన్‌స్ట్రేష‌న్ మాత్ర‌మే. ఇందులో మూడు శాటిలైట్ల‌ను పంపిస్తున్నారు.

దేశంలోనే తొలి ప్రైవేటు రాకెట్ రూపక‌ర్త‌లు.. మ‌న‌ తెలుగు తేజాలు  - ఈ నెలలోనే నింగిలోకి దూసుకెళ్ల‌నున్న `విక్ర‌మ్‌-ఎస్‌`
X

అంత‌రిక్ష రంగంలో చ‌రిత్ర సృష్టించేందుకు మ‌న తెలుగు తేజాలు శ్రీ‌కారం చుడుతున్నారు. దేశంలోనే తొలి ప్రైవేటు రాకెట్ రూపొందించి ఔరా అనిపిస్తున్నారు. ఈ నెల 16 లేదా 18న నింగిలోకి దూసుకెళ్ల‌నున్న ఈ రాకెట్‌కు భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా వ్య‌వ‌స్థ‌కు ఆద్యుడైన విక్ర‌మ్ అంబాలాల్ సారాభాయ్‌కి నివాళిగా `విక్ర‌మ్‌-ఎస్‌` (శ‌ర‌భి) అని నామ‌క‌ర‌ణం చేశారు.

ఈ రాకెట్ రూప‌క‌ర్త‌ల్లో ఒక‌రు విశాఖ‌పట్నానికి చెందిన నాగ‌భ‌ర‌త్ దాకా (33) కాగా, మ‌రొక‌రు హైద‌రాబాద్‌కు చెందిన చంద‌న్ ప‌వ‌న్‌కుమార్‌. వీరిద్ద‌రూ స్కైరూట్ ఏరో స్పేస్ పేరిట స్టార్ట‌ప్ సంస్థ‌ను ప్రారంభించారు. వ్య‌వ‌స్థాప‌కుల్లో ఒక‌రు.. చీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్ (సీవోవో)గా వ్య‌వ‌హ‌రిస్తున్న నాగ‌భ‌ర‌త్‌.. విశాఖ శివారు భీమిలిలోని అనిల్ నీరుకొండ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ అండ్ సైన్సెస్(అనిట్స్‌) ఫౌండ‌ర్ ప్రిన్సిప‌ల్‌గా వ్య‌వ‌హ‌రించిన డాక్ట‌ర్ ర‌ఘురామిరెడ్డి కుమారుడు.

ఐఐటీ మ‌ద్రాస్‌లో ఎల‌క్ట్రిక‌ల్ ఇంజ‌నీరింగ్ చ‌దివిన నాగ‌భ‌ర‌త్ 2012 నుంచి 2015 వ‌ర‌కు విక్ర‌మ్ సారాభాయ్ స్పేస్ సెంట‌ర్లో ఇంజ‌నీర్ (ఎస్‌సీ)గా విధులు నిర్వ‌ర్తించారు. ఆ త‌ర్వాత ఉద్యోగానికి స్వ‌స్తి చెప్పి త‌న తోటి శాస్త్రవేత్త చంద‌న్ ప‌వ‌న్ కుమార్‌తో క‌ల‌సి 2018లో స్కైరూట్ ఏరో స్పేస్ అనే స్టార్ట‌ప్ సంస్థ‌ను హైద‌రాబాద్ కేంద్రంగా ప్రారంభించారు. అక్క‌డ చిన్న చిన్న రాకెట్ల మోడ‌ళ్లు త‌యారు చేస్తూ త‌మ ప‌రిశోధ‌న‌లు వేగ‌వంతం చేశారు.

ప్రైవేటుకు ఇస్రో గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో...

ఇప్ప‌టివ‌ర‌కు అంత‌రిక్షంలోకి రాకెట్ల‌ను పంపించేందుకు ఇస్రోకు మాత్ర‌మే అనుమ‌తులు ఉండేవి. ఈ రంగంలోకి ప్రైవేటు సంస్థ‌ల‌కు కూడా అనుమ‌తులు ఇస్తూ రెండేళ్ల క్రితం ఇస్రో గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో నాగ‌భ‌ర‌త్‌, ప‌వ‌న్‌కుమార్ క‌ల‌సి దేశంలో అంత‌రిక్షంలోకి అడుగుపెట్టే తొలి ప్రైవేట్ రాకెట్ త‌మ‌దే కావాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ప‌రిశోధ‌న‌లు చేప‌ట్టారు. అనేక సంస్థ‌ల నుంచి విప‌రీత‌మైన పోటీ ఎదురైనా.. వాణిజ్య అవ‌స‌రాలు తీర్చేలా స్నేహితులిద్ద‌రూ ముందుగా రాకెట్ రూపొందించి రికార్డు సృష్టించారు.

శ్రీ‌హ‌రికోట‌లోని భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ రాకెట్ ప్ర‌యోగం చేయ‌నున్నారు. ప్ర‌స్తుత ప్ర‌యోగం డిమాన్‌స్ట్రేష‌న్ మాత్ర‌మే. ఇందులో మూడు శాటిలైట్ల‌ను పంపిస్తున్నారు. ఇది దేశంలోనే తొలి ప్రైవేటు రాకెట్ కావడంతో దీనికి `ప్రారంభ్ మిష‌న్‌` గా నామ‌క‌ర‌ణం చేశారు. విక్ర‌మ్ పేరుతో వీరు మూడు రాకెట్ల‌ను త‌యారు చేస్తున్నారు.

త‌గ్గ‌నున్న రాకెట్ల త‌యారీ వ్య‌యం..!

బ‌డ్జెట్ ప‌రిమితుల కార‌ణంగా ఇస్రో అనుకున్నంత వేగంగా ప‌రిశోధ‌న‌లు కొన‌సాగ‌డం లేదు. ఈ కార‌ణంగానే స్పేస్ రంగంలోకి ప్రైవేటు రంగానికి ద్వారాలు తెరుస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇస్రో, బీహెచ్ఈఎల్ స‌హ‌కారంలో పీఎస్ఎల్‌వీ రాకెట్ త‌యారీకి వివిధ సంస్థ‌ల‌తో క‌ల‌సి క‌న్సార్టియం ఏర్పాటుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తోంది. ఇది విజ‌య‌వంత‌మైతే భ‌విష్య‌త్తులో రాకెట్ల ఖ‌ర్చు త‌గ్గుముఖం ప‌ట్టే అవ‌కాశాలున్నాయి.

స్పేస్ రంగంలోకి ప్రైవేటు సంస్థ‌ల రాక‌తో భ‌విష్య‌త్తులో ఉప‌గ్ర‌హాల వినియోగం భారీగా పెరిగే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. స్పేస్ స్టార్ట‌ప్‌ల సంఖ్య కూడా దేశంలో క్ర‌మంగా పెరుగుతూ వ‌స్తోంది. భార‌త్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 50కి పైగా స్పేస్ స్టార్ట‌ప్‌లు ఇస్రో వ‌ద్ద రిజిస్ట‌ర్ కావ‌డం విశేషం. ఇందులో ఎక్కువ శాతం రాకెట్ల త‌యారీ, శాటిలైట్లు నిర్మించేవే ఎక్కువ‌.

First Published:  15 Nov 2022 7:39 AM GMT
Next Story