Telugu Global
NEWS

పురందేశ్వరి గాలి కిషన్ తీసేశారా?

పురందేశ్వరి ఆరోపణలపై మంత్రులు కానీ లేదా వైసీపీ నేతల నుండి సరైన సమాధానం రాలేదు. అయితే ఆమె ఆరోపణలకు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గట్టి సమాధానమిచ్చారు.

పురందేశ్వరి గాలి కిషన్ తీసేశారా?
X

అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై దగ్గబాటి పురందేశ్వరి పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో కీలకమైనది ఏమిటంటే రాష్ట్రంలో టిడ్కో ఇళ్ళ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తోంది. కేంద్రం అంత సాయం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇళ్ళని నిర్మించలేకపోతోందని తీవ్రంగా ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి కారణంగా కేంద్రం చేస్తున్న సాయమంతా వృధాగా పోతోందని తెగ బాధపడిపోతున్నారు.

పురందేశ్వరి ఆరోపణలపై మంత్రులు కానీ లేదా వైసీపీ నేతల నుండి సరైన సమాధానం రాలేదు. అయితే ఆమె ఆరోపణలకు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గట్టి సమాధానమిచ్చారు. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న కిషన్ తెలంగాణలో కేసీఆర్‌ ఇళ్ళ నిర్మాణాలపై సరైన శ్రద్ధ చూపటంలేదని మండిపడ్డారు. ఇదే సమయంలో ఏపీని మెచ్చుకున్నారు. ఆయన ఏమన్నారంటే పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 లక్షల ఇళ్ళు నిర్మించిందని మెచ్చుకున్నారు.

పురందేశ్వరేమో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇళ్ళే కట్టలేదని అంటారు. మరి కిషన్ ఏమో ఏపీలో 20 లక్షల ఇళ్ళు నిర్మించారని అభినందించారు. రెండింటిలో ఏది నిజం? జగన్‌పై ద్వేషంతో అసలు ఇళ్ళే కట్టలేదని పురందేశ్వరి ఆరోపణలు చేస్తున్నట్లున్నారు. కానీ కిషన్ కేంద్రమంత్రన్న విషయం మరచిపోకూడదు. కేంద్రమంత్రిగా ఇళ్ళ నిర్మాణం విషయంలో తెలంగాణ-ఏపీ మధ్య కంపేర్ చేస్తూ ఏపీలో 20 లక్షల ఇళ్ళు నిర్మించినట్లు పూర్తి సమాచారంతో చెప్పారు.

కాబట్టి పురందేశ్వరి తప్పుడు ఆరోపణలు చేసినట్లే అనుకోవాలి. ఒకవేళ కిషన్ చెప్పినట్లుగా ఏపీలో 20 లక్షల ఇళ్ళు నిర్మించకపోతే దాన్ని ఆధారాలతో పురందేశ్వరి ఖండించాలి. ఇక మరో విషయం ఏమిటంటే ఏపీకి పెట్టుబడులే రావటంలేదని పదేపదే అంటున్నారు. ఇదికూడా తప్పని స్వయంగా కేంద్ర ప్ర‌భుత్వ‌మే చెప్పింది. పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నట్లు ఇప్పటికే లెక్కలతో సహా చెప్పింది. తాజాగా ఏపీలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ. 2273 కోట్ల ఎఫ్‌డీఐలు వచ్చినట్లు చెప్పింది. అంటే పరిశ్రమలు, పెట్టుబడులు, ఇళ్ళ నిర్మాణంలో పురందేశ్వరి చెప్పిందంతా అబద్ధాలే అని తేలిపోయింది.

First Published:  23 July 2023 5:30 AM GMT
Next Story