Telugu Global
NEWS

భానుడి భ‌గ‌భ‌గ‌లు.. తెలంగాణ‌లో 46, ఏపీలో 47 డిగ్రీలు దాటేసిన ఉష్ణోగ్ర‌త‌లు

ప్ర‌కాశం జిల్లా ఎండ్ర‌ప‌ల్లిలో 47.1 డిగ్రీల అత్య‌ధిక ఉష్ణోగ్రత రికార్డ‌యింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సీజ‌న్‌లో ఇదే టాప్‌. ప్ర‌కాశం జిల్లా మార్కాపురంలోనూ 47 డిగ్రీల టెంప‌రేచ‌ర్ న‌మోద‌యింది.

భానుడి భ‌గ‌భ‌గ‌లు.. తెలంగాణ‌లో 46, ఏపీలో 47 డిగ్రీలు దాటేసిన ఉష్ణోగ్ర‌త‌లు
X

భానుడు భ‌గ‌భ‌గ‌లాడిపోతున్నాడు. సూర్య‌ప్ర‌తాపంతో తెలుగు రాష్ట్రాల జ‌నం అల్లాడిపోతున్నారు. రోజురోజుకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్ర‌త‌లు అడుగుబ‌య‌ట పెట్టాలంటేనే భ‌యం పుట్టిస్తున్నాయి. గురువారం నాటి ఉష్ణోగ్ర‌త‌లు తెలంగాణ‌లో 46 డిగ్రీలు దాటిపోగా.. ఆంధ్ర‌ప్ర‌దేశ్లో 47 డిగ్రీల మార్కును తాకాయి. మే నెల మొద‌ట్లోనే ఇలా ఎండ పేల్చేస్తుంటే ముందు ముందు ఇంకెంత దారుణ‌మైన ఎండ‌ను చూడాలోన‌ని జ‌నం బెంబేలెత్తిపోతున్నారు.

ప్ర‌కాశం జిల్లాలో 47 డిగ్రీలు దాటింది

గురువారం ప్ర‌కాశం జిల్లా ఎండ్ర‌ప‌ల్లిలో 47.1 డిగ్రీల అత్య‌ధిక ఉష్ణోగ్రత రికార్డ‌యింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సీజ‌న్‌లో ఇదే టాప్‌. ప్ర‌కాశం జిల్లా మార్కాపురంలోనూ 47 డిగ్రీల టెంప‌రేచ‌ర్ న‌మోద‌యింది. ఇక తెలంగాణ‌లో న‌ల్గొండ జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నంలో అత్య‌ధికంగా 46.6 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోద‌యింది. సూర్యాపేట జిల్లా మున‌గాల‌, న‌ల్గొండ జిల్లా నాంప‌ల్లి, జ‌గిత్యాల జిల్లా నేరెళ్ల‌, వెల్గటూరుల్లో 46.4 డిగ్రీల చొప్పున టెంప‌రేచ‌ర్ వ‌చ్చింది. 8 జిల్లాల్లో ఉష్ణోగ్ర‌తలు 46డిగ్రీలు దాటిపోవ‌డంతో జ‌నం ఇళ్ల‌లో నుంచి బ‌య‌టికి రావాలంటేనే భ‌య‌ప‌డిపోతున్నారు.

ఈడ్చికొడుతున్న వ‌డ‌గాలులు

ఎండ తీవ్ర‌త‌కు తోడు నిప్పుల సెగ‌లాంటి వ‌డ‌గాలుల‌తో జ‌నం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెలంగాణ‌లో నిన్న 80 మండ‌లాల్లో వ‌డగాలులు వీస్తే ఏపీలో ఆ సంఖ్య దాదాపు రెట్టింపుగా ఉంది. రాబోయే రెండు రోజుల్లో కూడా ఇదే ప‌రిస్థితి ఉంటుందని విశాఖ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది.

సోమ‌వారం నుంచి కాస్త ఉప‌శ‌మ‌నం|

ఈ నెల 6 వ‌ర‌కు అంటే ఆదివారం వ‌ర‌కు ఇదే తీవ్ర‌త ఉంటుంద‌ని, త‌ర్వాత ఎండ‌లు కొంత త‌గ్గు ముఖం ప‌ట్టే అవ‌కాశం ఉందని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం చెబుతోంది. తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డా ఓ మోస్త‌రు వాన‌లు ప‌డే అవ‌కాశం ఉంద‌ని, దీనివల్ల ఎండ తీవ్ర‌త కాస్త త‌గ్గ‌వ‌చ్చ‌ని చెప్ప‌డం కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించే మాట‌.

First Published:  3 May 2024 9:19 AM GMT
Next Story