Telugu Global
NEWS

కృష్ణా జలాల్లో 50 శాతం నీటివాటా కోసం పోరాడుతున్న తెలంగాణ ప్రభుత్వం

66:34 నిష్పత్తి కేవలం ఒక సంవత్సరం కోసం మాత్రమే నిర్ణయించారని తెలంగాణ అధికారులు చెప్తున్నారు. ఆ తర్వాత KRMB న్యాయామైన వాటాను కేటాయించాలనే అవగాహనతో తెలంగాణ అంగీకరించింది. అయితే KRMB అదే నిష్పత్తిని కొనసాగిస్తోంది. తెలంగాణ వాదనను పరిశీలించడానికి నిరాకరించింది.

కృష్ణా జలాల్లో 50 శాతం నీటివాటా కోసం పోరాడుతున్న తెలంగాణ ప్రభుత్వం
X

కృష్ణా నదీ జలాల నీటి వాటాపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల మధ్య చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది. తెలంగాణ నిరాకరించినప్పటికీ కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (KRMB) ఏపీకి 66 శాతం తెలంగాణకు 34 శాతం నీటిని కేటాయిస్తోంది. ఈ విషయంపై తెలంగాణ అధికారులు ఇప్పటికే అభ్యంతరాలు లేవనెత్తారు. ఈ నెలాఖరులో జరగనున్న కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (KRMB) సమావేశంలో 50:50 నిష్పత్తి కోసం తన డిమాండ్‌కు కట్టుబడి ఉండాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణ ఇరిగేషన్ అధికారుల వాదన ప్రకారం, 2022-23 సంవత్సరానికి 66:34 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య కృష్ణా నదీ జలాల పంపిణీ ఏర్పాట్లను కొనసాగించడంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది. KRMB సమావేశాలలో అనేక సార్లు ఈ సమస్యను లేవనెత్తినప్పటికీ, బోర్డు గత ఏడేళ్లుగా 66:34 నిష్పత్తిలో నీటి భాగస్వామ్యాన్ని కొనసాగించడంతో తెలంగాణ ప్రభుత్వం అసంత్రుప్తిని వ్యక్తం చేస్తూనే ఉంది.

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బిసి), కల్వకుర్తి ఎల్‌ఐఎస్, నెట్టెంపాడు ఎల్‌ఐఎస్ అనే మూడు ఆపరేషనల్ ప్రాజెక్టులకు 105 టిఎంసిల అవసరాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత నీటి సంవత్సరానికి నీటి పంపిణీ 50:50 నిష్పత్తిలో ఉండాలని తెలంగాణ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. KRMB ఏపీ, తెలంగాణల మధ్య సంవత్సరానికి ప్రాతిపదికన తాత్కాలిక నీటి-భాగస్వామ్య ఏర్పాట్లు చేస్తోంది. ఇది 2015లో 512:299 tmc ft (AP: TS) నిష్పత్తిలో నిర్ణయించబడింది, తరువాత 2017లో స్వల్పంగా 66:34నిష్పత్తికి సవరించారు .

66:34 నిష్పత్తి కేవలం ఒక సంవత్సరం కోసం మాత్రమే నిర్ణయించారని తెలంగాణ అధికారులు చెప్తున్నారు. ఆ తర్వాత KRMB న్యాయామైన వాటాను కేటాయించాలనే అవగాహనతో తెలంగాణ అంగీకరించింది. అయితే KRMB అదే నిష్పత్తిని కొనసాగిస్తోంది. తెలంగాణ వాదనను పరిశీలించడానికి నిరాకరించింది.

తెలంగాణ ప్రభుత్వ డిమాండ్‌ను బోర్డు పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల తెలంగాణ తన న్యాయమైన నీటి వాటాను కోల్పోతోందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2021-22లో, శ్రీశైలం జలాశయం నుండి ఆంధ్రా 34 TMC కంటే ఎక్కువ నీటిని మళ్లించకూడదనే షరతుకు లోబడి, నిరసనతో తెలంగాణ 66:34 నీటి భాగస్వామ్య నిష్పత్తికి అంగీకరించింది. అయితే KRMB మాత్రం ఆంధ్ర ప్రదేశ్‌కు చాలా ఎక్కువ నీటిని డ్రా చేసుకోవడానికి అనుమతించింది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తెలంగాణ 66:34 నీటి-భాగస్వామ్య నిష్పత్తిని అంగీకరించనప్పటికీ, ఆంధ్ర ప్రదేశ్ మాత్రం అదే పద్దతి కొనసాగించింది. పైగా నీటి-భాగస్వామ్య నిష్పత్తిని 70:30కి సవరించాలని KRMBని డిమాండ్ చేయడం ప్రారంభించింది, అయితే దానిని బోర్డు తిరస్కరించింది. 50:50 నిష్పత్తిలో నీటి పంపిణీ అంశాన్ని లేవనెత్తడమే కాకుండా, ఒక నీటి సంవత్సరంలో ఉపయోగించని నీటిని వచ్చే ఏడాది వాడుకోవడానికి అనుమతించాలని తెలంగాణ అధికారులు డిమాండ్ చేస్తున్నారు.

First Published:  7 Jan 2023 3:21 AM GMT
Next Story