Telugu Global
NEWS

కంపెనీకి కాదు, జీతానికే ప్రాధాన్యం.. ఐటీలో రికార్డ్ స్థాయిలో వలసలు..

డిజిటలైజేషన్‌తో ఐటీ ఉద్యోగులకు డిమాండ్ పెరగడంతో వలసల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఉద్యోగులు వలస వెళ్లకుండా ఆయా కంపెనీలు ప్రయత్నిస్తున్నా, వేరే సంస్థలు ఇస్తున్న ఆఫర్లు నచ్చడంతో వారు వెంటనే కంపెనీ మారిపోతున్నారు.

కంపెనీకి కాదు, జీతానికే ప్రాధాన్యం.. ఐటీలో రికార్డ్ స్థాయిలో వలసలు..
X

జీతం కావాలా, మంచి కంపెనీలో కొలువు కావాలా అంటే నిన్న మొన్నటి వరకూ కంపెనీకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు ఉద్యోగులు. ఊరూపేరు లేని కంపెనీలు ఎక్కువ జీతం ఆఫర్ చేస్తున్నా దినదినగండంలా పనిచేయడానికి చాలామంది ఇష్టపడేవారు కాదు. కంపెనీ ట్రాక్ రికార్డ్ బాగుంటే, తమ ఉద్యోగానికి ఢోకా లేదనుకుంటే కాస్త తక్కువ జీతానికయినా ఉద్యోగులు అడ్జస్ట్ అయిపోయేవారు. కానీ కరోనా తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఎవరూ శాశ్వతం కాదు, ఏదీ శాశ్వతం కాదు. ఈ నిజం అర్థమైపోయింది. అందుకే కంపెనీ కంటే, జీతానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు ఉద్యోగులు. అందులోనూ ఐటీ రంగంలో ఈ ప్రయారిటీ బాగా ఎక్కువట.

ఐటీ ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారడం సర్వ సాధారణమే అయినా కోవిడ్‌ తర్వాత వలసలు ఎక్కువగా జరుగుతున్నాయని టీమ్‌ లీజ్‌ సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. జులై నుంచి సెప్టెంబర్‌ వరకు మూడు నెలల కాలంలో జరిగిన వలసలపై Q2 - 2022-23 నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం ఐటీ రంగంలో వలసలు 22.03 శాతంగా ఉన్నాయి. అంటే 100 మంది ఉద్యోగుల్లో 22.3శాతం మంది ఎక్కడో ఒకచోట కంపెనీలు మారుతూనే ఉన్నారన్న మాట. దీన్ని అట్రిషన్(వలసల) రేటు అంటారు.

రియల్ ఎస్టేట్ రంగంలో అతి తక్కువ..

ఇలా కంపెనీలు మారే ఉద్యోగుల సంఖ్య రియల్ ఎస్టేట్ రంగంలో బాగా తక్కువట. ఇన్నాళ్లూ ఓ కంపెనీని పొగిడి, ఇప్పుడు మరో కంపెనీకి ప్రచారం చేయడం ఆ రంగంలో పెద్దగా వర్కవుట్ అయ్యేలా లేదు. అందుకే రియల్ ఎస్టేట్ రంగంలో అట్రిషన్ రేటు కేవలం 4.29 శాతం మాత్రమే. ఇక ఐటీకి పోటీ కాకపోయినా విద్యా రంగంలో 13.11 శాతం అట్రిషన్ రేటు ఉంది. అంటే విద్యాసంస్థల్లో జీతాల పెంపు ఉద్యోగుల కంపెనీల మార్పుపై బాగా ప్రభావం చూపుతోంది. హెల్త్ కేర్ రంగంలో 12.25 శాతం, ఇ-కామర్స్ రంగంలో 11.04 శాతం, అగ్రికల్చర్ రంగంలో 6.21 శాతం అట్రిషన్ రేటు ఉంది.

డిజిటలైజేషన్‌తో ఐటీ ఉద్యోగులకు డిమాండ్ పెరగడంతో వలసల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఉద్యోగులు వలస వెళ్లకుండా ఆయా కంపెనీలు ప్రయత్నిస్తున్నా, వేరే సంస్థలు ఇస్తున్న ఆఫర్లు నచ్చడంతో వారు వెంటనే కంపెనీ మారిపోతున్నారు. కంపెనీ మారినా మరోసారి జీతం పెరిగే అవకాశముంటే, మళ్లీ బిచాణా ఎత్తేస్తున్నారు.

First Published:  6 Oct 2022 9:57 AM GMT
Next Story