Telugu Global
NEWS

క‌ర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు వెనుక ప్రశాంత్ కిషోర్ శిష్యుడు.. నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ?

కర్ణాటకలో కాంగ్రెస్ విజయం వెనుక ఇప్పుడు వినిపిస్తున్న పేరు సునీల్ కానుగోలు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శిష్యుడైన సునీల్ కానుగోలు.. గత ఏడాది నుంచి కాంగ్రెస్‌ పార్టీకి పనిచేస్తున్నాడు. అతనికి రాహుల్ గాంధీ ఇచ్చిన ఫస్ట్ టాస్క్ కర్ణాటక ఎన్నికలు.

క‌ర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు వెనుక ప్రశాంత్ కిషోర్ శిష్యుడు.. నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ?
X

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఊహించిన దానికంటే ఎక్కువ స్థానాల్ని కైవసం చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. అధికారంలో ఉన్న బీజేపీ ఎన్ని ఎత్తులు వేసినా.. చివరికి ప్రధాని నరేంద్ర మోడీ విస్తృతంగా రాష్ట్రంలో పర్యటించినా లాభం లేకపోయింది. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం వెనుక ఇప్పుడు వినిపిస్తున్న పేరు సునీల్ కానుగోలు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శిష్యుడైన సునీల్ కానుగోలు.. గత ఏడాది నుంచి కాంగ్రెస్‌ పార్టీకి పనిచేస్తున్నాడు. అతనికి రాహుల్ గాంధీ ఇచ్చిన ఫస్ట్ టాస్క్ కర్ణాటక ఎన్నికలు.

వాస్తవానికి సునీల్ కానుగోలు బాధ్యతలు చేపట్టే నాటికి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గందరగోళంగా ఉంది. అంతర్గత కుమ్ములాటలతో పార్టీలోని చాలా మంది సీనియర్ నేతలు అసంతృప్తితో కనిపించారు. కానీ రాహుల్ గాంధీ జోడో యాత్ర కర్ణాటకలోకి వచ్చే సమయానికి పరిస్థితుల్ని పూర్తిగా చక్కదిద్దిన సునీల్ కానుగోలు.. రాహుల్ గాంధీ రాష్ట్ర సరిహద్దులు దాటేలోపే అభ్యర్థుల ఎంపికని కూడా దాదాపు పూర్తి చేసేశాడు. అలానే మ్యానిఫెస్టోలోనూ తన మార్క్ చూపించి కాకలు తీరిన బీజేపీ నేతల్ని సైతం ఇరుకున పెట్టేశాడు.

కర్ణాటక ఎన్నికలకి ముందే సునీల్ కానుగోలుతో ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన బీజేపీ అతడ్ని పార్టీలోకి లాగే ప్రయత్నం చేసింది. స్వయంగా సీఎం బస్వరాజ్ బొమ్మై చొరవ తీసుకుని మరీ పర్సనల్‌గా రిక్వెస్ట్ కూడా చేశాడట. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే సీఎం బస్వరాజ్ బొమ్మైకి సునీల్ కానుగోలు సన్నిహితుడే. అతని స్వస్థలం కర్ణాటక. అలానే గతంలో ప్రశాంత్ కిషోర్‌తో కలిసి బీజేపీకి పని చేశాడు. కానీ కర్ణాటక ఎన్నికలకి ముందు బీజేపీ ఆఫర్‌ని సునీల్ కానుగోలు తిరస్కరించాడు.

కర్ణాటకలో కాంగ్రెస్ విజయంతో ఇక సునీల్ కానుగోలు నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్‌ అసెంబ్లీ ఎన్నికలు‌గా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఈ ఏడాది చివర్లో తెలంగాణ ఎన్నికలు జరగబోతుండటంతో.. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్‌ని కూడా ఏకతాటిపైకి తెచ్చేందుకు సునీల్ కానుగోలు వ్యూహాలు రచించే అవకాశం ఉంది. మరి చూడాలి తెలంగాణలో అతని వ్యూహాలు ఎలా వర్కవుట్ అవుతాయో!

First Published:  13 May 2023 12:01 PM GMT
Next Story