Telugu Global
NEWS

నాటు నాటు.. ఆస్కార్‌కి అడుగు దూరంలో..!

భార‌తీయ సినీ వ‌ర్గాల్లో `నాటు నాటు` పాట ఆస్కార్ ఫైన‌ల్ లిస్ట్‌కు నామినేట్ కావ‌డంపై హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ పాట‌ను స్వ‌ర‌ప‌ర‌చిన సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి అయితే.. టీమ్ మొత్తానికి బిగ్ హ‌గ్స్.. అంటూ ట్వీట్ చేశారు.

నాటు నాటు.. ఆస్కార్‌కి అడుగు దూరంలో..!
X

సినీ ప్ర‌పంచ‌పు అతి గొప్ప పుర‌స్కారం ఆస్కార్‌.. దీనికి అడుగు దూరంలో ఉంది ఇప్ప‌డు మ‌న తెలుగు పాట `నాటు నాటు`. ద‌ర్శ‌క‌ధీరుడు జ‌క్క‌న్న రూపొందించిన `ఆర్ఆర్ఆర్‌` చిత్రంలోని ఈ పాట ఇప్పుడు ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో అవార్డుకు నామినేట్ అయింది. ఆస్కార్ అవార్డుల నామినేష‌న్ల‌ను భార‌త కాల‌మానం ప్ర‌కారం మంగ‌ళ‌వారం సాయంత్రం అమెరికాలోని కాలిఫోర్నియాలో అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇందులో మ‌న పాట చోటు ద‌క్కించుకోవ‌డం విశేషం. ఇక మార్చి 12న జ‌రిగే ఆస్కార్ పుర‌స్కారాల వేడుక వ‌ర‌కు ఉత్కంఠ‌గా ఎదురుచూడ‌ట‌మే మిగిలింది. కొన్నాళ్ల కిందటే ఆస్కార్ పుర‌స్కారాల్లో 15 పాట‌ల తుది జాబితాలో చోటు ద‌క్కించుకున్న ఈ చిత్రం.. తాజాగా ఫైన‌ల్ లిస్ట్‌లోనూ స్థానం ద‌క్కించుకుని అరుదైన గౌర‌వాన్ని సొంతం చేసుకుంది.

మ‌న `నాటు నాటు`తో పాటు `టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్‌` చిత్రంలోని అప్లాజ్‌.., `టాప్ గ‌న్ : మేవ‌రిక్‌` చిత్రంలోని హోల్డ్ మై హ్యాండ్‌.., `బ్లాక్ పాంథ‌ర్ : వ‌కాండా ఫ‌రెవ‌ర్‌` చిత్రంలోని లిఫ్ట్ మి అప్‌.., `ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వ‌న్స్‌` చిత్రంలోని దిస్ ఈజ్ ఎ లైఫ్‌.. తుది జాబితాలో చోటు ద‌క్కించుకున్నాయి. ఇప్పుడు అవార్డు కోసం మ‌న పాట ఈ పాట‌ల‌తో పోటీ ప‌డుతోంది.
బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేష‌న్ల‌ను సొంతం చేసుకున్న తొలి భార‌తీయ గీతం `నాటు నాటు` కావ‌డం విశేషం. గ‌తంలో సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహ‌మాన్ స్వ‌ర‌ప‌ర‌చిన `స్ల‌మ్ డాగ్ మిలీనీర్‌`లోని జై హో.. పాట‌ ఉత్త‌మ స్కోర్ విభాగంలో ఆస్కార్‌ను ద‌క్కించుకోవ‌డం తెలిసిందే. కానీ అది భార‌తీయ నేప‌థ్యం ఉన్న క‌థే అయినా.. ఆ చిత్రం మాత్రం బ్రిటీష్ రూప‌క‌ర్త‌ల నిర్మాణంలో రూపొందింది. ఇప్పుడు మ‌న `నాటు నాటు` పాట ఆస్కార్ సాధిస్తే మాత్రం ఈ అవార్డు సాధించిన తొలి భార‌తీయ గీతంగా చ‌రిత్ర సృష్టిస్తుంది.

`ల‌గాన్` త‌ర్వాత ఆస్కార్ బ‌రిలో నామినేష‌న్ ద‌క్కించుకున్న భార‌తీయ చిత్రంగా `ఆర్ఆర్ఆర్‌` నిలవ‌డం విశేషం. ఆస్కార్ 95 పుర‌స్కారాల కోసం రూపొందించిన ప్రోమోలో `ఆర్ఆర్ఆర్‌` కు చోటు ద‌క్క‌డం విశేషం.

ఆస్కార్ బ‌రిలో భార‌త డాక్యుమెంట‌రీలు సైతం..

ఈసారి ఆస్కార్ బ‌రిలో రెండు భార‌త డాక్యుమెంట‌రీలు కూడా చోటు ద‌క్కించుకుని అవార్డు కోసం పోటీప‌డుతున్నాయి. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ ఆవ‌శ్య‌క‌త నేప‌థ్యంలో రూపొందించిన భార‌తీయ డాక్యుమెంట‌రీ చిత్రం `ఆల్ ద‌ట్ బ్రెత్స్‌` ఉత్త‌మ డాక్యుమెంట‌రీ ఫీచ‌ర్ విభాగంలో ఫైన‌ల్ లిస్ట్‌లో చోటు ద‌క్కించుకుంది. దీనిని శౌన‌క్ శేన్ తెర‌కెక్కించారు. ఇది అకాడ‌మీ అవార్డుకు నామినేట్ అయిన తొలి భార‌తీయ డాక్యుమెంట‌రీ కూడా కావ‌డం విశేషం.

దీంతో పాటు భార‌తీయ డాక్యుమెంట‌రీ ల‌ఘు చిత్రం `ది ఎలిఫెంట్ విస్ఫ‌ర‌ర్స్‌` ఉత్త‌మ డాక్యుమెంట‌రీ షార్ట్ విభాగానికి నామినేట్ అయింది. 41 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంట‌రీకి కార్తీకి గోంజాల్వ్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌ధాన అవార్డు కోసం ఇది మ‌రో 14 డాక్యుమెంట‌రీల‌తో పోటీప‌డుతోంది.

సినీ వ‌ర్గాల్లో ఆనందోత్సాహాలు...

భార‌తీయ సినీ వ‌ర్గాల్లో `నాటు నాటు` పాట ఆస్కార్ ఫైన‌ల్ లిస్ట్‌కు నామినేట్ కావ‌డంపై హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ పాట‌ను స్వ‌ర‌ప‌ర‌చిన సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి అయితే.. టీమ్ మొత్తానికి బిగ్ హ‌గ్స్.. అంటూ ట్వీట్ చేశారు. రామ్‌చ‌రణ్‌, ఎన్టీఆర్ దీనిపై స్పందిస్తూ.. ఈ పాట ఆస్కార్‌కు నామినేట్ అవ‌డం చిర‌స్మ‌ర‌ణీయ ఘ‌న‌త అని పేర్కొన్నారు. ఈ పాట కోసం ప‌నిచేసిన‌వారంద‌రికీ ట్విట్ట‌ర్ ద్వారా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్రేమ్ ర‌క్షిత్ మాస్ట‌ర్ స్పందిస్తూ.. `ఆర్ఆర్ఆర్‌` సినిమా వ‌ల్లే త‌న పాట ఆస్కార్ వ‌ర‌కు వెళ్ల‌గ‌లిగింద‌ని సంతోషం వ్య‌క్తం చేశారు. చిరంజీవి, బాల‌కృష్ణ త‌దిత‌ర సినీ ప్ర‌ముఖులు చిత్ర బృందానికి అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

Next Story