Telugu Global
NEWS

మీకు విటమిన్ల లోపం ఉందా? ఇలా తెలుసుకోండి!

పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో అన్ని విటమిన్లు సమపాళ్లలో ఉండాలి. శరీరంలో ఏదైనా విటమిన్ లోపిస్తే దాని ప్రభావం వెంటనే కనిపిస్తుంది. కొన్ని ముందస్తు లక్షణాల ఆధారంగా మీలో ఏయే విటమిన్లు లోపించాయో తెలుసుకోవచ్చు. అదెలాగంటే..

మీకు విటమిన్ల లోపం ఉందా? ఇలా తెలుసుకోండి!
X

తరచూ ఏవో రకమైన అనారోగ్య సమస్యలు వస్తుంటే, అలాగే జలుబు, దగ్గు వంటి సాధారణ ఇన్ఫెక్షన్లు తగ్గకపోతుంటే మీలో ఇమ్యూనిటీ లోపం ఉండి ఉండొచ్చు. దీనికై విటమిన్–సీ తగిన పాళ్లలో తీసుకోవాల్సి ఉంటుంది. శరీరంలో విటమిన్–సీ లోపిస్తే చిగుళ్ల సమస్యలు, చర్మ సమస్యలు కూడా వస్తుంటాయి. విటమిన్–సీ కోసం నిమ్మ, బత్తాయి, జామ వంటి పండ్లు తీసుకోవచ్చు.

పెదవులు, కళ్లు ఎర్రగా కాకుండా పొడిబారి కనిపించినా, గోళ్లు తెల్లగా కనిపిస్తున్నా శరీరంలో హిమోగ్లోబిన్ లోపించినట్టు అర్థం చేసుకోవాలి. దీనికోసం దానిమ్మ, బీట్‌రూట్, బీన్స్, ఆకుకూరల వంటివి తినాలి.

వేళ్లు విరిచినప్పుడు ఎక్కువ శబ్ధం వస్తున్నా, కీళ్ల నొప్పులు, మెడ పట్టేయడం వంటివి తరచూ వస్తుంటే కాల్షియం, విటమిన్–డీ లోపించి ఉండొచ్చు. కాబట్టి వీటికోసం పాలు, ఆకుకూరలు, నువ్వుల వంటివి తినాలి. ఎండకు ఎక్స్‌పోజ్ అవ్వాలి.

కళ్లు సరిగా కనిపించకపోతుంటే విటమిన్‌–ఏ లోపం ఉండి ఉండొచ్చు. దీనికోసం క్యారెట్, కరివేపాకు వంటివి తీసుకోవచ్చు.

గాయాలైనప్పుడు రక్తం త్వరగా గడ్డకట్టకపోతుంటే విటమిన్‌–కె లోపం అయ్యి ఉండొచ్చు. దీనికోసం పాలకూర, క్యాబేజీ, బ్రొకలీ వంటివి తీసుకోవచ్చు.

నోటిపూత ఎక్కువ వస్తుంటే విటమిన్–బీ2 (రెబోఫ్లావిన్‌) లోపం అయ్యి ఉండొచ్చు. దీనికోసం చేపలు, మాంసం, పెరుగు వంటివి తీసుకోవచ్చు.

జుట్టు రాలడం, చిట్లిపోవడం వంటి సమస్యలు విటమిన్–బీ7 (బయోటిన్‌)లోపానికి సంకేతం. దీనికోసం నట్స్, గుడ్లు, ఆవకాడో, మష్రూమ్స్, చిలకడ దుంప వంటివి తినొచ్చు.

అలసట, ఒత్తిడికి లోనవ్వడం, కండరాల బలహీనత వంటివాటికి విటమిన్–బీ12లోపం కారణం అవ్వొచ్చు. కాబట్టి ఈ లక్షణాలు ఉన్నవాళ్లు చేపలు, గుడ్లు, మాంసం, పాల పదార్థాలు, ఆకకూరలు, నట్స్ వంటివి తిసుకోవచ్చు.

విటమిన్ల లోపాన్ని నిర్ధారించుకునేముందు డాక్టర్ సలహా కూడా తీసుకోవడం మంచిది. సరైన రక్త పరీక్షల ద్వారా అసలైన సమస్య ఎంటో తెలుసుకుంటే మరింత త్వరగా అనారోగ్యం నుంచి కోలుకోవచ్చు.

First Published:  27 Jan 2024 2:00 PM GMT
Next Story