Telugu Global
NEWS

పాన్ ఇండియా మూవీస్.. కేరాఫ్ టాలీవుడ్

ఇక కార్తికేయ-2తో నార్త్ లో భారీ విజయం అందుకున్న నిఖిల్, మేజర్, హిట్-2 సినిమాలతో బాలీవుడ్ లో పాగా వేసిన అడవి శేష్ తమ తదుపరి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

పాన్ ఇండియా మూవీస్.. కేరాఫ్ టాలీవుడ్
X

బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్, కార్తికేయ-2, మేజర్ వంటి తెలుగు సినిమాలకు దేశవ్యాప్తంగా ఆదరణ దక్కడంతో టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల నిర్మాణం భారీగా పెరిగింది. తెలుగు అగ్ర హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలపై మనసు పారేసుకున్నారు. ఇకపై తాము నటించే ప్రతి సినిమాను పాన్ ఇండియా స్థాయి సినిమాగా ఉండేలా చూసుకుంటున్నారు. దీంతో ఏ భాషలో లేని విధంగా తెలుగులో అత్యధికంగా పాన్ ఇండియా సినిమాల నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలోనే దాదాపు పది సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్నాయంటే ఇక్కడి హీరోలు పాన్ ఇండియా సినిమాల పట్ల ఎంత ఆసక్తి చూపుతున్నారో అర్థం అవుతుంది.

ఇప్పటికే తెలుగు నుంచి ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం వీరు నటిస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్నాయి. ఇక కార్తికేయ-2తో నార్త్ లో భారీ విజయం అందుకున్న నిఖిల్, మేజర్, హిట్-2 సినిమాలతో బాలీవుడ్ లో పాగా వేసిన అడవి శేష్ తమ తదుపరి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. వీరే కాకుండా పలువురు సీనియర్, యంగ్ హీరోలు పాన్ ఇండియా స్థాయి సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

తెలుగు టాప్ స్టార్లు అయిన పవన్ కల్యాణ్ క్రిష్ హరిహర వీరమల్లు, మహేష్ బాబు రాజమౌళి సినిమాలతో పాన్ ఇండియా కేటగిరిలోకి తొలిసారి అడుగు పెడుతున్నారు. ఇక నిఖిల్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా స్పై అనే సినిమాతో మరోసారి పాన్ ఇండియాను పలకరించనున్నాడు. ఇక లైగర్ పరాజయం పాలైనప్పటికీ బాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. అతడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అయిన ఖుషి సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నాడు.

హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న సందీప్ కిషన్ మైకేల్ అనే సినిమా పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. విభిన్న కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక మరో యంగ్ హీరో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. సుకుమార్ స్క్రీన్ ప్లే అందించగా.. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న విరూపాక్ష మూవీతో సాయి ధరమ్ తేజ్ బాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు.

ఇక నాగచైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ అనే పేరుతో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇలా ఏ భాషలో లేని విధంగా తెలుగులో భారీ సంఖ్యలో పాన్ ఇండియా స్థాయి సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇవి కనుక విజయవంతం అయితే తెలుగులో మరిన్ని సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకునే అవకాశం ఉంది.

First Published:  7 Dec 2022 10:21 AM GMT
Next Story