Telugu Global
NEWS

రెండు రాష్ట్రాల్లోనూ ఒకటే డిమాండా?

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో శాంతి భద్రతలకు వచ్చిన ఢోకా ఏమీలేదు. అక్కడక్కడ జరుగుతున్న గొడవలు ఎప్పుడూ జరిగేవే. గత ప్రభుత్వాల హయాంలో కూడా చిన్న చిన్న గొడవలు జరుగుతునే ఉండేవి. ఇలాంటి చెదురుమదురు ఘటనలను చూపించి రాష్ట్రపతి పాలన విధించే అవకాశంలేదు.

రెండు రాష్ట్రాల్లోనూ ఒకటే డిమాండా?
X

తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన డిమాండ్లు వినిపిస్తున్నాయి ప్రతిపక్షాల నుండి. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలనే డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో అరాచకం పెరిగిపోయిందని, శాంతి భద్రతలు దారి తప్పాయని, పోలీసు రాజ్యం పెరిగిపోతోందని, ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేదు కాబట్టి వెంటనే ప్రెసిడెంట్ పాలన పెట్టాల్సిందే అని చంద్రబాబునాయుడు అండ్ కో డిమాండ్లు చేస్తున్నారు. నిజంగానే వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్లుగా రాష్ట్రంలో పరిస్థితులు అంత అధ్వాన్నంగా ఉన్నాయా?

ఏపీ సంగతిని పక్కనపెట్టేస్తే తెలంగాణలో కూడా అలాంటి డిమాండే వినిపిస్తోంది. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల శనివారం గవర్నర్ తమిళిసైని కలిశారు. రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే అని డిమాండ్ చేశారు. ఎందుకంటే పరిస్థితులు బాగా దిగజారిపోయాయట. ఇక్కడ గమనించాల్సిందేమంటే రెండు రాష్ట్రాల్లో కూడా రాష్ట్రపతి పాలన పెట్టాల్సినంతగా పరిస్థితులు దిగజారిపోలేదు. లా అండ్ ఆర్డర్ పరిస్ధితులు చక్కదిద్దటానికి అవకాశం లేనంతగా దిగజారిపోయినప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన గురించి ఆలోచిస్తుంది.

అదికూడా గవర్నర్ నివేదిక అందిన తర్వాత మాత్రమే. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో శాంతి భద్రతలకు వచ్చిన ఢోకా ఏమీలేదు. అక్కడక్కడ జరుగుతున్న గొడవలు ఎప్పుడూ జరిగేవే. గత ప్రభుత్వాల హయాంలో కూడా చిన్న చిన్న గొడవలు జరుగుతునే ఉండేవి. ఇలాంటి చెదురుమదురు ఘటనలను చూపించి రాష్ట్రపతి పాలన విధించే అవకాశంలేదు. కాకపోతే ప్రభుత్వాలపై ప్రతిపక్షాల్లో పేరుకుపోతున్న వ్యతిరేకత లేకపోతే కసి కారణంగానే రాష్ట్రపతి పాలన డిమాండ్లు చేస్తున్నారు.

ఒక‌ప్పుడు ఏపీలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అని ప్రతిపక్షాలు గోలగోల చేసి చివరకు అలసిపోయి ఊరుకున్నాయి. విచిత్రం ఏమిటంటే ప్రతిపక్షాలకు ముఖ్యంగా టీడీపీకి మద్దతుగా మెజారిటి మీడియా రంగంలోకి దిగేసి రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడాలంటే రాష్ట్రపతి పాలన పెట్టడం ఒకటే మార్గమని నానా యాగీ చేశాయి. ప్రభుత్వాలంటే పడని ప్రతిపక్షాలు కాదు రాష్ట్రపతి పాలనకు డిమాండ్లు చేయాల్సింది మామూలు జనాలు. నిజంగానే శాంతిభద్రతలకు అంత సమస్యే వస్తే అప్పుడు జనాలే రోడ్ల మీదకు వస్తారు. అప్పుడు కేంద్రం కూడా ఆలోచిస్తుందంతే.

First Published:  26 Feb 2023 5:09 AM GMT
Next Story