Telugu Global
NEWS

5జీ సేవలు పొందాలంటే ఇవి ఉండాలి

మొబైల్ కంపెనీలు ఏడాది క్రితం నుంచే 5జీ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల 5జీ మోడల్స్‌ అందుబాటులో ఉన్నాయి. 5జీ ఫోన్‌ కొనేముందు ఏమేం చెక్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

5జీ సేవలు పొందాలంటే ఇవి ఉండాలి
X

అంతరాయం లేకుండా వేగంగా ఇంటర్నెట్ సేవలు అందించే 5జీ నెట్‌వర్క్ ఎట్టకేలకు దేశంలో అందుబాటులోకి వచ్చేసింది. ముందుగా ప్రధాన నగరాల్లో, ఆ తర్వాత దేశవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు 5జీ సేవలను విస్తరిస్తామని మొబైల్ నెట్‌వర్క్‌ సంస్థలు చెప్తున్నాయి. మొబైల్ కంపెనీలు ఏడాది క్రితం నుంచే 5జీ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల 5జీ మోడల్స్‌ అందుబాటులో ఉన్నాయి. 5జీ ఫోన్‌ కొనేముందు ఏమేం చెక్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

మొబైల్ ఫోన్.. 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేయాలంటే అందులో ముందుగా ఉండాల్సింది 5జీ ప్రాసెసర్‌. ఫోన్ లో 5జీ ప్రాసెసర్‌ ఉంటేనే 5జీ నెట్‌వర్క్ పనిచేస్తుంది.

లేటెస్ట్ గా వస్తున్న ప్రాసెసర్లలో స్నాప్‌డ్రాగన్‌ 695, 765జీ, 865 ఆపై మోడల్స్‌ 5జీని సపోర్ట్ చేస్తాయి. మీడియాటెక్ డైమెన్సిటీ సిరీస్‌లో 700, 8100, 9,000తోపాటు జీ, హీలియో సిరీస్‌ ప్రాసెసర్లు కూడా 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తాయి. ఫోన్‌ కొనేముందు ఆ ప్రాసెసర్‌ 5జీ వెర్షనా.. కాదా.. అనేది చెక్ చేసుకుని కొనాలి.

ప్రాసెసర్‌తో పాటు 5జీ మొబైల్‌లో ఉండాల్సిన మరో ముఖ్యమైన ఫీచర్‌ బ్యాండ్స్‌. ఫోన్ ఎన్ని రకాల 5జీ బ్యాండ్స్‌ను సపోర్ట్ చేస్తుంది అనేదాన్ని బట్టి 5జీ పనితీరు ఉంటుంది. మొబైల్ కనీసం 8 నుంచి 12 రకాల బ్యాండ్స్‌ను సపోర్ట్ చేస్తున్నట్లయితే అన్నిరకాల 5జీ సిమ్‌లు పని చేస్తాయి. అలా కాకుండా రెండు లేదా మూడు 5జీ బ్యాండ్స్‌ను మాత్రమే సపోర్ట్ చేస్తుంటే, అది అన్నిరకాల 5జీ నెట్‌వర్క్స్‌ సపోర్ట్ చేయకపోవచ్చు.

ఇక వీటితో పాటు 5జీ కొత్తగా లాంఛ్ అయింది కాబట్టి కొన్ని సాంకేతిక లోపాలు ఉంటాయి. సంస్థలు అప్ డేట్స్ ద్వారా వాటిని సాల్వ్ చేస్తుంటాయి. కాబట్టి కొనబోయే స్మార్ట్ ఫోన్‌లో ఎప్పటికప్పుడు ఓఎస్‌ అప్‌డేట్‌లు ఇస్తుందా.. లేదా అనేది చెక్ చేసుకోవాలి. అప్‌డేట్స్ సరిగ్గా ఇవ్వని మొబైల్‌ను ఎంచుకోకపోవడమే మంచిది.

చాలామంది 5జీ కోసం కొత్త సిమ్ కొనాలనుకుంటారు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం 4జీ సిమ్‌పైనే 5జీ సేవలు పొందొచ్చు. సిమ్ మార్చకుండానే 5జీ నెట్‌వర్క్ వస్తుంది. మార్చాల్సింది మొబైల్ మాత్రమే.

అన్నింటికంటే ముఖ్యంగా 5జీ అప్‌డేట్స్ పేరుతో ఇటీవల కొన్ని సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. '5జీ కోసం మొబైల్ సెట్టింగ్స్ అప్‌డేట్ చేసుకోండి' అంటూ కొన్ని లింక్స్, మెసేజ్‌లు వస్తున్నాయి. వాటి ద్వారా మొబైల్‌లోకి మాల్వేర్, వైరస్ ఎంటరయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి లింక్ ల జోలికి వెళ్లొద్దు. మొబైల్ 5జీ కి సపోర్ట్ చేసేది అయితే 5జీ ఆటోమేటిక్ గా వస్తుంది. మొబైల్ నెట్‌వర్క్ సెట్టింగ్స్ లో, 2జీ, 3జీ, 4జీ ఎల్‌టీఈతో పాటు కింద '5జీ' అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. అక్కడ సెట్టింగ్ మార్చుకుంటే చాలు.

First Published:  14 Oct 2022 10:52 AM GMT
Next Story