Telugu Global
National

పోర్న్ కంటెంట్ చూసి పోలీస్ పరీక్షల్లో ఫెయిలయ్యా.. పరిహారం ఇప్పించాలని పిటిషన్.. యువకుడికి సుప్రీం చీవాట్లు

అసభ్యకరమైన వీడియోలు చూసింది కాక.. యూట్యూబ్ చూడటం వల్లే ఫెయిల్ అయ్యానని పిటిషనర్ పేర్కొనడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

పోర్న్ కంటెంట్ చూసి పోలీస్ పరీక్షల్లో ఫెయిలయ్యా.. పరిహారం ఇప్పించాలని పిటిషన్.. యువకుడికి సుప్రీం చీవాట్లు
X

పోర్న్ కంటెంట్‌కు బానిసై పోలీస్ నియామక పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని.. తనకు గూగుల్ ఇండియా నుంచి పరిహారం ఇప్పించాలని సుప్రీం కోర్టులో వింత పిటిషన్ వేసిన యువకుడికి న్యాయమూర్తులు చీవాట్లు పెట్టారు. పోర్న్ వీడియోలు చూడాలని నీకు ఎవరు చెప్పారు.. ఇటువంటి పిటిషన్లు వేసి కోర్టు సమయం వృథా చేస్తావా.. అంటూ లక్ష రూపాయల జరిమానా విధించారు.

మధ్యప్రదేశ్‌కు చెందిన కిషోర్ చౌదరికి పోలీస్ కావాలని కోరిక. అందుకోసం కొన్ని నెలలుగా పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. కాగా ఇటీవల పోలీసు ఉద్యోగం కోసం రాసిన పరీక్షకు సంబంధించి ఫలితం రాగా అందులో కిషోర్ ఫెయిల్ అయ్యాడు. ఇదిలా ఉండగా యూట్యూబ్‌లో అశ్లీల ప్రకటనలు చూడడం వల్లే తాను పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని.. దీనికి కారణమైన గూగుల్ ఇండియా నుంచి తనకు రూ.75 లక్షలు పరిహారం ఇప్పించాలని కిషోర్ సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు.

పోర్న్ కంటెంట్ ఉన్న యూట్యూబ్‌కు నోటీసులు జారీ చేయాలని, యూట్యూబ్‌లో అటువంటి కంటెంట్ లేకుండా చూడాలని కోరాడు. ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకాలతో కూడిన ధర్మాసనం తాజాగా విచారించింది. ఈ సందర్భంగా పిటిషన్ వేసిన యువకుడికి చీవాట్లు పెట్టింది. అసభ్యకరమైన వీడియోలు చూసింది కాక.. యూట్యూబ్ చూడటం వల్లే ఫెయిల్ అయ్యానని పిటిషనర్ పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

అసలు నిన్ను పోర్న్ వీడియోలు చూడమని ఎవరు చెప్పారు..ఎవరు ఫెయిల్ అవ్వ‌మ‌న్నారు.. బాధ్యతాయుత పోలీసు ఉద్యోగానికి సిద్ధమవుతూ ఇటువంటి పిటిషన్ వేస్తావా.. అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్ల వల్లే కోర్టు సమయం వృథా అవుతోందని పేర్కొన్న ధర్మాసనం పిటిషనర్‌కు లక్ష రూపాయల జరిమానా విధించింది. కోర్టు తీర్పుతో పిటిషనర్ లబోదిబోమన్నాడు. తాను పేద కుటుంబానికి చెందిన నిరుద్యోగినని ..అంత జరిమానా కట్టలేనని కోర్టును వేడుకున్నాడు.

'యూట్యూబ్‌లో వచ్చే అశ్లీల కంటెంట్‌కు బానిసగా మారి సరిగా చదువుకోలేకపోయాను. ఇటువంటి వీడియోల వల్ల నాలాగే ఎంతో మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. యూట్యూబ్‌లో అలాంటి అశ్లీల ప్రకటనలు ప్రదర్శిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలనే పిటిషన్ వేశాను. ఇటువంటి పిటిషన్ వేసినందుకు క్షమాపణ కోరుతున్నాను.' అని సదరు యువకుడు కోర్టును ప్రాధేయపడ్డాడు. దీంతో న్యాయమూర్తులు యువకుడికి విధించిన జరిమానా మొత్తాన్ని లక్ష రూపాయల నుంచి రూ.25 వేలకు తగ్గించారు. యూట్యూబ్‌లో అశ్లీల కంటెంట్ వల్లే తాను పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని యువకుడు ఏకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడం సంచలన సృష్టిస్తోంది.

First Published:  11 Dec 2022 8:03 AM GMT
Next Story