Telugu Global
National

మ‌హిళ‌ల వ‌స్త్ర‌ధార‌ణ పై కేరళ‌ కోర్టు సంచ‌ల‌న వ్యాఖ్యలు... ప్రజా సంఘాల ఆగ్రహం

మహిళలు లైంగికంగా రెచ్చ‌గొట్టే విధంగా ఉండే దుస్తులు ధ‌రించిన‌ప్పుడు ' లైంగిక వేధింపుల అభియోగం' ప్రాథమికంగా నిలబడదని కేరళలోని ఓ కోర్టు వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. దీనిపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

మ‌హిళ‌ల వ‌స్త్ర‌ధార‌ణ పై కేరళ‌ కోర్టు సంచ‌ల‌న వ్యాఖ్యలు... ప్రజా సంఘాల ఆగ్రహం
X

మ‌హిళ‌ల వ‌స్త్ర‌ధార‌ణ పై కేర‌ళ‌లోని కోజికోడ్ సెష‌న్స్ కోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. లైంగిక వేధింపుల కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వ్య‌క్తికి ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసే సంద‌ర్భంలో కోర్టు ఈ వ్యాఖ్య‌లు చేసింది. మ‌హిళ‌లు లైంగికంగా రెచ్చ‌గొట్టే విధంగా ఉండే దుస్తులు ధ‌రించిన‌ప్పుడు ' లైంగిక వేధింపుల అభియోగం' ప్రాథమికంగా నిలబడదని పేర్కొంది.

వివ‌రాలిలా ఉన్నాయి.. లైంగిక వేధింపుల కేసులో రచయిత, సామాజిక కార్యకర్త సివిక్ చంద్రన్‌కు కోజికోడ్‌లోని ఒక జిల్లా సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మ‌హిళ‌లు లైంగికంగా రెచ్చగొట్టే దుస్తులు' ధరించిన‌ప్పుడు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 354 (ఎ) (లైంగిక వేధింపు) కింద ఉన్న నేరం ప్రాథమికంగా వ‌ర్తించ‌ద‌ని పేర్కొంది.

చంద్ర‌న్ త‌న బెయిల్ పిటిషన్‌తో పాటు ఫిర్యాదుదారు ఫోటోలు కూడా కోర్టుకు స‌మ‌ర్పించారు. వీటిని ప‌రిశీలించిన కోర్టు చంద్రన్‌కు ఆగస్టు 12న ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు ఆగస్టు 2న తనపై దాఖలైన మ‌రో లైంగిక వేధింపుల కేసులో కూడా ముందస్తు బెయిల్ పొందాడు.

చంద్ర‌న్ స‌మ‌ర్పించిన మ‌హిళ ఫొటోల‌ను ప‌రిశీలించిన కోర్టు .. " ఈ కేసులో చంద్ర‌న్ పై ఫిర్యాదు చేసిన మ‌హిళ లైంగికంగా రెచ్చ‌గొట్టే విధంగా ఉన్న దుస్తుల‌ను ధ‌రించిన‌ట్టు వెల్ల‌డ‌వుతోంది. కాబ‌ట్టి 354 ఎ సెక్ష‌న్ నిందితులకు వ్యతిరేకంగా ప్రాథమిక సాక్ష్యంగా నిలబడదు." అని పేర్కొంది. నిందితుడికి మ‌హిళ‌ను లైంగికంగా వేధించే ఉద్దేశ్యం కానీ, ఆమె మ‌ర్యాద‌కు భంగం క‌లిగించే ఉద్దేశం లేన‌ప్ప‌డు ఈ సెక్ష‌న్ నిందితుల ప‌ట్ల వ‌ర్తించ‌ద‌ని స్ప‌ష్టంగా ఉంద‌ని" న్యాయ‌స్థానం వివ‌రించింది.

ఈ సెక్ష‌న్ వ‌ర్తించాలంటే .. "శారీరక సంబంధం, లైంగిక వాంఛ‌తో ముందుకు వెళ్ళ‌డం, స్పష్టమైన లైంగిక ప్రవృత్తి ఉండాలి. లైంగిక ప్రయోజనాల కోసం డిమాండ్ లేదా అభ్యర్థన చేసి ఉండాలి. లైంగికప‌ర‌మైన వ్యాఖ్యలు ఉండాలి" అని కోర్టు పేర్కొంది.

కాగా, ఆ మ‌హిళ త‌న‌పై తప్పుడు ఫిర్యాదు చేసిందని చంద్రన్‌ ఆరోపించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఆరోపణ సంఘటనను ప్రస్తావిస్తూ, ఆమె తన ప్రియుడితో వ‌చ్చింద‌ని అప్పుడు చాలా మంది ఉన్నార‌ని కానీ ఎవ‌రూ త‌న‌పై అలాంటి ఫిర్యాదులు చేయలేదని చెప్పారు.

ఇదిలా ఉండ‌గా న్యాయ‌స్థానం తీర్పుపై మ‌హిళా సంఘాలు మండిప‌డుతున్నాయి. మ‌హిళ‌ల‌కు స్వేచ్ఛ, గౌర‌వం అంటే ఇదేనా..ఎవ‌రికి ఇష్ట‌మైన దుస్తులు వారు ధ‌రించ‌డం కూడా నేర‌మా అని ప్ర‌శ్నిస్తున్నాయి.

First Published:  17 Aug 2022 1:43 PM GMT
Next Story