Telugu Global
National

యమా డేంజర్ గా యమునా ప్రవాహం.. ఢిల్లీకి ముంపు భయం

ముందు జాగ్రత్తగా సీఎం కేజ్రీవాల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు, వరద పరిస్థితుల్ని సమీక్షించారు. యమునా నీటిమట్టం 206 మీటర్లు దాటితే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయిస్తామన్నారు.

యమా డేంజర్ గా యమునా ప్రవాహం.. ఢిల్లీకి ముంపు భయం
X

40 ఏళ్లలో ఢిల్లీలో ఎప్పుడూ రాని వర్షాలివి. 36 గంటల వ్యవధిలో రికార్డుస్థాయిలో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 2 రోజులపాటు దేశ రాజధానిలో పరిస్థితి ఇలాగే ఉంటుందని అంచనా. ఢిల్లీని అతలాకుతలం చేసిన వర్షాలు, మరింత నష్టం చేకూరుస్తాయనే అంచనాలున్నాయి. ఇప్పటికే యమునా నది చెలియలి కట్టలు దాటుతోంది. ప్రవాహం మరింత ఉధృతంగా మారితే ఢిల్లీకి ప్రమాదం ముంచుకొచ్చే అవకాశముంది.

204.63 మీటర్లకు చేరిన ప్రవాహం..

ఢిల్లీ పక్కనే ఉన్న యమునా నది ప్రవాహం ఉధృతమైతే లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరుతుంది. గురుగ్రామ్, నోయిడా ప్రాంతాల్లోని పలు అపార్ట్ మెంట్ ప్రాంగణాలకు ఈసారి నీరు చేరుకుంది. అయితే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశముందని అంచనా. యమునా ప్రవాహం 204.5 మీటర్లు దాటితే హెచ్చరిక స్థాయిగా పరిగణిస్తారు. 205.33 మీటర్లు దాటితే అది ప్రమాదకరస్థాయి. ప్రస్తుతం యమునా నది నీటి ప్రవాహం 204.63 మీటర్లకు చేరుకుంది. అంటే హెచ్చరిక స్థాయి దాటింది. మరో 12 గంటల్లో అది ప్రమాదకర స్థాయి దాటుతుందని అంచనా. ఇదే ఉధృతి కొనసాగి ప్రవాహం 206 మీటర్లకు చేరితే ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు భారీగా చేరుతుంది.

అత్యవసర సమావేశం..

ముందు జాగ్రత్తగా సీఎం కేజ్రీవాల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు, వరద పరిస్థితుల్ని సమీక్షించారు. యమునా నదిలో నీటిమట్టం పెరుగుతుండటంతో కేంద్ర జల కమిషన్‌ ను సంప్రదించామని చెప్పారు కేజ్రీవాల్. యమునా నీటిమట్టం 206 మీటర్లు దాటితే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయిస్తామన్నారు. ఇటీవల ఢిల్లీలో రోడ్లు కుంగిన ఘటనలపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ఇప్పటికే 16 కంట్రోల్‌ రూమ్‌ లను ఏర్పాటు చేశారు. క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌, బోట్లను అందుబాటులో ఉంచారు. ఇటీవల కాలంలో ఎప్పుడూ ఈ స్థాయిలో వరదలు రాకపోవడంతో అధికారులు మరింత హడావిడిపడుతున్నారు.

First Published:  10 July 2023 10:21 AM GMT
Next Story