Telugu Global
National

WFIకి షాక్‌.. ఇండియా ట్యాగ్‌లైన్ లేకుండానే బరిలోకి రెజ్లర్లు..!

భారత రెజ్లింగ్ ఫెడరేషన్ గవర్నింగ్ బాడీ ఎలక్షన్స్​ మే 2023లో నిర్వహించాల్సి ఉంది. మొదట మే 7న జరగాల్సిన ఎలక్షన్స్​ను క్రీడా మంత్రిత్వ శాఖ నిలిపి వేసింది.

WFIకి షాక్‌.. ఇండియా ట్యాగ్‌లైన్ లేకుండానే బరిలోకి రెజ్లర్లు..!
X

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI)కి షాకిచ్చింది యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW). WFI సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎలక్షన్స్‌ నిర్వహించడంలో WFI విఫలం కావడంతో చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది. ఇక రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎన్నికలపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. వాయిదా పడుతూ వస్తున్న ఈ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ఇప్పటికీ స్పష్టత రాలేదు. దీంతో ఇప్పుడు ప్రపంచ వేదికపై ఎదురుదెబ్బ తగిలింది. డబ్ల్యూఎఫ్‌ఐ సభ్యత్వాన్ని నిరవధికంగా సస్పండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌. దీంతో ఇకపై భారత రెజ్లర్లు.. సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభంకానున్న ఒలింపిక్​ క్వాలిఫైయింగ్​ వరల్డ్ ఛాంపియన్​షిప్స్​ పోటీల్లో న్యూట్రల్​ అథ్లెట్లుగా బరిలోకి దిగాల్సి ఉంటుంది. భారత్​ ట్యాగ్​లైన్​ లేకుండానే ఆడాల్సి ఉంటుంది.

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలతో WFI వివాదాల్లో చిక్కుకుంది. శరణ్‌ సింగ్‌ను పదవి నుంచి తప్పించాలని ఆందోళన చేయడంతో WFI ప్యానెల్‌ను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌ రద్దు చేసింది. ఆ తర్వాత నిర్వహణ బాధ్యతను అడ్‌హక్‌ కమిటీకి అప్పగించింది.

భారత రెజ్లింగ్ ఫెడరేషన్ గవర్నింగ్ బాడీ ఎలక్షన్స్​ మే 2023లో నిర్వహించాల్సి ఉంది. మొదట మే 7న జరగాల్సిన ఎలక్షన్స్​ను క్రీడా మంత్రిత్వ శాఖ నిలిపి వేసింది. జూన్‌ 30 ఎన్నికలు ఉంటాయని అప్పుడు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌ చెప్పారు. తర్వాత జూలై​ 4న ఎన్నికలు నిర్వహిస్తామని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌ ప్రకటించింది. కానీ జూలై 6న ఎలక్షన్స్​ నిర్వహించాలని రిటర్నింగ్‌ అధికారి నిర్ణయించారు. కానీ, తమకూ ఓటు హక్కుందని, గుర్తింపు కోల్పోయిన ఐదు సంఘాలు కోర్టుకెక్కడంతో జూలై 11కు ఎన్నికలను వాయిదా వేశారు. ఇప్పుడు ఆ తేదీ కూడా దాటిపోయింది. చివరగా ఆగస్టు 12వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించగా.. దానికి ఒక రోజు ముందు పంజాబ్‌-హర్యానా హైకోర్టు ఈ ఎన్నికలపై స్టే విధించింది. దీంతో ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే ప్రపంచ రెజ్లింగ్‌ సంఘం.. భారత సభ్యత్వంపై వేటు వేసింది. ఈ నిర్ణయంతో ఇండియన్ రెజ్లర్లు రాబోయే వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో దేశం తరఫున పాల్గొనే వీలుండదు. సెప్టెంబరు 16 నుంచి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టోర్నీ జరగనుంది.

*

First Published:  24 Aug 2023 12:17 PM GMT
Next Story