Telugu Global
National

దిగొచ్చిన కేంద్రం.. చర్చలకోసం రెజ్లర్లకు పిలుపు

రెజ్లర్లతో వారి సమస్యల గురించి చర్చించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని.. దాని కోసం తాను మరోసారి రెజ్లర్లను ఆహ్వానిస్తున్నానని ఠాకూర్ ట్వీట్ చేశారు.

దిగొచ్చిన కేంద్రం.. చర్చలకోసం రెజ్లర్లకు పిలుపు
X

రెజ్లర్ల సమస్యల విషయంలో కేంద్రం దిగొచ్చింది. రెజ్లర్ల ఆందోళనలు, అరెస్ట్ లతో ప్రభుత్వం పరువుపోతున్న క్రమంలో వారిని చర్చలకు ఆహ్వానించింది. అమిత్ షా తో జరిగిన అనధికారిక చర్చలతో ఫలితం లేకపోయే సరికి ఇప్పుడు అధికారికంగానే రెజ్లర్లను చర్చలకు ఆహ్వానించారు కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్. ఈమేరకు ఆయన ట్విట్టర్ ద్వారా సందేశమిచ్చారు.


దిద్దుబాటు చర్యలు..

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రోజుల తరబడి రెజ్లర్లు ఆందోళన చేపట్టినా కేంద్రం కనికరించలేదు. చివరకు పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజు వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని, జంతర్ మంతర్ ఖాళీ చేయించారు. కానీ రెజ్లర్లు తగ్గేది లేదంటున్నారు. తమ ఆందోళన కొనసాగిస్తామన్నారు. అమిత్ షా బెదిరింపులు కూడా పనిచేయలేదు. ఆ తర్వాత రెజ్లర్లు ఆందోళన విరమించారంటూ తప్పుడు వార్తలను ప్రసారం చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. తాము వెనక్కి తగ్గలేదని రెజ్లర్లు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు కేంద్రం వెనక్కు తగ్గాల్సి వచ్చింది. రెజ్లర్ల సమస్య పరిష్కారం కోసం వారితో చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.

రెజ్లర్లతో వారి సమస్యల గురించి చర్చించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని.. దాని కోసం తాను మరోసారి రెజ్లర్లను ఆహ్వానిస్తున్నానని ఠాకూర్ ట్వీట్ చేశారు. ఇటు బ్రిజ్ భూషణ్ పై కూడా విచారణ వేగవంతమైనట్టు వార్తలొస్తున్నాయి. మొత్తానికి రెజ్లర్ల సమస్యపై కేంద్రం నష్టనివారణ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. కాస్త ఆలస్యంగా అయినా కేంద్రంలోని పెద్దలు మేల్కొన్నారు. సమస్య పరిష్కారం కోసం చొరవ చూపాలనుకుంటున్నారు.

First Published:  7 Jun 2023 4:00 AM GMT
Next Story