Telugu Global
National

బ్రిజ్ భూష‌ణ్ స‌వాల్‌కు రెజ్ల‌ర్లు సై.. - తాము కూడా నార్కో ప‌రీక్ష చేయించుకుంటామ‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌

త‌న‌తో పాటు బ్రిజ్ భూష‌ణ్‌పై ఫిర్యాదు చేసిన యువ‌తులంద‌రూ నార్కో ప‌రీక్ష‌కు సిద్ధ‌మ‌ని వినేశ్ మీడియాకు వెల్ల‌డించారు. దానిని లైవ్‌లో నిర్వహించాల‌ని, అప్పుడే ఈ దేశ ఆడబిడ్డల పట్ల ఆయన క్రూర ప్రవర్తన యావత్ భారతావనికి తెలుస్తుందని స్ప‌ష్టం చేశారు.

బ్రిజ్ భూష‌ణ్ స‌వాల్‌కు రెజ్ల‌ర్లు సై.. - తాము కూడా నార్కో ప‌రీక్ష చేయించుకుంటామ‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌
X

నార్కో ప‌రీక్షకు తాము కూడా సిద్ధ‌మేన‌ని స్టార్ రెజ్ల‌ర్లు స్ప‌ష్టం చేశారు. త‌న‌కు నార్కో ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని హ‌ర్యానాలోని ఖాప్ పంచాయ‌తీ పెద్ద‌లు ఆదివారం తీర్మానించ‌డంతో జాతీయ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ దీనిపై స్పందిస్తూ త‌న‌తో పాటు వినేశ్ ఫొగాట్‌, బ‌జ‌రంగ్ పునియాకు సైతం నార్కో ప‌రీక్ష‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు.

'నార్కో, పాలిగ్రాఫ్, లై డిటెక్టర్ పరీక్షలకు తాను సిద్ధమ‌ని.. కానీ, త‌న‌దో షరత‌ని, త‌న‌తోపాటు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా కూడా ఈ పరీక్ష చేయించుకోవాలని డిమాండ్ చేశారు. వారు ఈ పరీక్షలకు అంగీకరిస్తే, మీడియా ముందు ప్రకటించాలని స్ప‌ష్టం చేశారు. వారు ఈ పరీక్షలకు సిద్ధమైతే.. తాను కూడా సిద్ధమేన‌ని త‌న ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలోనే దానిపై సోమవారం రెజ్లర్లు స్పందించారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ విసిరిన సవాలును తాము స్వీకరిస్తున్నామ‌ని, తాము కూడా నార్కో టెస్టుకు సిద్ధ‌మని తెలిపారు. ఆ పరీక్షను లైవ్ టెలికాస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

త‌న‌తో పాటు బ్రిజ్ భూష‌ణ్‌పై ఫిర్యాదు చేసిన యువ‌తులంద‌రూ నార్కో ప‌రీక్ష‌కు సిద్ధ‌మ‌ని వినేశ్ మీడియాకు వెల్ల‌డించారు. దానిని లైవ్‌లో నిర్వహించాల‌ని, అప్పుడే ఈ దేశ ఆడబిడ్డల పట్ల ఆయన క్రూర ప్రవర్తన యావత్ భారతావనికి తెలుస్తుందని స్ప‌ష్టం చేశారు. అలాగే దీనిపై బ‌జ‌రంగ్ పునియా స్పందిస్తూ.. తాము ఇదివరకే నార్కో పరీక్షకు సిద్ధమని చెప్పామని గుర్తుచేశారు.

First Published:  23 May 2023 1:49 AM GMT
Next Story