Telugu Global
National

తగ్గేదే లేదు.. రెజ్లర్ సాక్షి ట్వీట్ వైరల్

రెజ్లర్లు భవిష్యత్ కార్యాచరణకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. తమ ఉద్యమం ఇంకా ముగిసిపోలేదని, న్యాయం కోసం చేసే పోరాటన్ని వదులుకునే రకం తాము కాదని ఓ వీడియో రిలీజ్ చేశారు రెజ్లర్ సాక్షి మలిక్.

తగ్గేదే లేదు.. రెజ్లర్ సాక్షి ట్వీట్ వైరల్
X

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల దీక్షా శిబిరాన్ని బలవంతంగా పోలీసులు ఖాళీ చేయించారు. తిరిగి అక్కడికి వచ్చేందుకు వారికి అనుమతి లేదన్నారు. ఆ ప్రాంతానికి ఎవర్నీ రానీయకుండా 144 సెక్షన్ విధించారు. ప్రస్తుతానికి రెజ్లర్లంతా ఇళ్లలోనే ఉన్నారు. బ్రిజ్ భూషణ్ పై వారు చేసిన ఆరోపణలు జనం మరచిపోతారని, ఇక ఈ విషయం ఇక్కడితో ముగిసిపోయిందనేది బీజేపీ నేతలనుకుంటున్నారు. కానీ రెజ్లర్లు మాత్రం తగ్గేది లేదంటున్నారు. ఉద్యమ కార్యాచరణ రెడీ అవుతోందని ట్విస్ట్ ఇచ్చారు.


బ్రిజ్ భూషణ్ పై చర్యలకోసం డిమాండ్ చేస్తున్న రెజ్లర్లు, తమకు న్యాయం జరిగే వరకు నిరసన పోరాటం చేస్తామంటూ జంతర్ మంతర్ వద్ద 38రోజులుగా దీక్షలు చేపట్టారు. వివిధ రాజకీయ పక్షాలు వారికి మద్దతు తెలిపాయి కానీ కేంద్రం మనసు కరగలేదు. బీజేపీ ఎంపీగా ఉన్న బ్రిజ్ భూషణ్ పై కనీసం చర్యలు చేపట్టలేదు. దీంతో పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజు రెజ్లర్లు ముందుకు కదిలారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, పనిలో పనిగా జంతర్ మంతర్ వద్ద దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయించారు. అక్కడితో ఆ వివాదానికి ముగింపు పలికామనుకున్నారు. కానీ రెజ్లర్లు మాత్రం భవిష్యత్ కార్యాచరణకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. తమ ఉద్యమం ఇంకా ముగిసిపోలేదని, న్యాయం కోసం చేసే పోరాటన్ని వదులుకునే రకం తాము కాదని ఓ వీడియో రిలీజ్ చేశారు రెజ్లర్ సాక్షి మలిక్. ఇప్పటి వరకు తమకు మద్దతుగా నిలిచిన దేశ ప్రజలందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

హర్యానాకు చెందిన రెజ్లర్ సాక్షి మలిక్ ఒలింపిక్ పతక విజేత కూడా. ఆమెను బేటీ బచావో కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అలాంటి సాక్షి మలిక్ ని కూడా పోలీసులు రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి, వివిధ రాజకీయ పార్టీలు, సామాన్య ప్రజలు కూడా రెజ్లర్లకు మద్దతు తెలిపారు. ఈ దశలో వారి ఉద్యమం కొత్తరూపు సంతరించుకోనుంది. ఇప్పటికే ఈ విషయంలో బీజేపీ ఇమేజ్ బాగానే డ్యామేజీ అయింది. ఇకనైనా కేంద్రం రెజ్లర్లను అనునయించే ప్రయత్నం చేస్తుందా, లేక తెగే వరకు లాగుతుందా.. వేచి చూడాలి.

First Published:  30 May 2023 8:03 AM GMT
Next Story