Telugu Global
National

ఏడాదిలో రూ.6లక్షలకు ఇడ్లీ ఆర్డర్.. హైదరాబాద్ కస్టమర్ రికార్డ్..

ఏడాది కాలంలో 6 లక్షల రూపాయల ఇడ్లీ ఆర్డర్ చేసి స్విగ్గీ ఇడ్లీ లవర్ ఆఫ్ ది ఇయర్ గా మారాడు ఓ కస్టమర్. మార్చి-30న అంతర్జాతీయ ఇడ్లీ దినోత్సవం సందర్భంగా ఈ వివరాలను వెల్లడించింది స్విగ్గీ.

ఏడాదిలో రూ.6లక్షలకు ఇడ్లీ ఆర్డర్.. హైదరాబాద్ కస్టమర్ రికార్డ్..
X

ఇడ్లీ అంటే ఎంత ప్రేమ ఉన్నా రోజూ అదే తినాలంటే కష్టం. ఓరోజు దోశ, మరో రోజు చపాతి.. ఇలా రకరకాల టేస్ట్ లు ట్రై చేస్తుంటారు చాలామంది. అయితే హైదరాబాద్ లోని ఓ వ్యక్తి మాత్రం ప్రతి రోజూ స్విగ్గీలో ఇడ్లీయే ఆర్డర్ చేస్తాడట. వారం రెండు వారాలు కాదు, ఏడాదిలో 365 రోజులూ అతడు ఇడ్లీ ఆర్డర్ చేశాడు. ఏడాది కాలంలో అతడు 8,428 ప్లేట్ల ఇడ్లీ ఆర్డర్ చేశాడు. ఇడ్లీ కోసం ఆ కస్టమర్ ఖర్చు పెట్టిన మొత్తం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఏడాది మొత్తంలో 6 లక్షల రూపాయల విలువైన ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాడు. రికార్డ్ బ్రేక్ చేశాడు.

టూర్ కి వెళ్లినా ఇడ్లీయే..

హైదరాబాద్ లో ఉన్నప్పుడే కాదు, ఆ కస్టమర్ బెంగళూరు, చెన్నైకి వెళ్లినప్పుడు కూడా స్విగ్గీలో ఇడ్లీయే ఆర్డర్ చేశాడట. ఇలా ఏడాది కాలంలో 6 లక్షల రూపాయల ఇడ్లీ ఆర్డర్ చేసి స్విగ్గీ ఇడ్లీ లవర్ ఆఫ్ ది ఇయర్ గా మారాడు. మార్చి-30న అంతర్జాతీయ ఇడ్లీ దినోత్సవం సందర్భంగా ఈ వివరాలను వెల్లడించింది స్విగ్గీ.

బిర్యానీకి పోటీగా..

ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలకు ఎక్కువగా బిర్యానీ ఆర్డర్లు వస్తుంటాయి. అల్పాహారంలో మాత్రం ఇడ్లీయే నెంబర్-1 అంటున్నారు. వరల్డ్ ఇడ్లీ డే సందర్భంగా ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ.. తన సర్వే వివరాలను వెల్లడించింది. స్విగ్గీ గత ఏడాది కాలంలో మొత్తం 3.3 కోట్ల ప్లేట్ల ఇడ్లీ ఆర్డర్లను డెలివరీ చేసింది. ఇడ్లీకి ప్రజల్లో ఉన్న ఆదరణకు ఈ గణాంకాలే నిదర్శనం అంటోంది స్విగ్గీ. ఇడ్లీని ఆర్డర్ చేస్తున్న నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తొలిమూడు స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాత ఢిల్లీ, కోల్ కత, కొచ్చి, ముంబై, కోయంబత్తూర్, పుణె, విశాఖపట్నం నగరాలు ఉన్నాయి. ఉదయం 8 నుంచి 10 గంటల మధ్యలో ఇడ్లీల ఆర్డర్లు ఎక్కువగా ఉంటాయని స్విగ్గీ తెలిపింది.

First Published:  30 March 2023 1:54 PM GMT
Next Story