Telugu Global
National

సుప్రీంకోర్టులో మహిళా ధర్మాసనం ఏర్పాటు.. చరిత్రలో ఇది మూడోసారి

ప్రస్తుతం సుప్రీంకోర్టులో 27 మంది న్యాయమూర్తులు ఉండగా.. అందులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ బీవీ నాగరత్న ఉన్నారు.

సుప్రీంకోర్టులో మహిళా ధర్మాసనం ఏర్పాటు.. చరిత్రలో ఇది మూడోసారి
X

దేశ అత్యున్నత న్యాయస్థానంలో మహిళా ధర్మాసనం ఏర్పాటయింది. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన మహిళా ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తాజాగా ఏర్పాటు చేశారు. మహిళా ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం సుప్రీంకోర్టు చరిత్రలో ఇది మూడో సారి మాత్రమే. ఈ ధర్మాసనాన్ని 11వ నెంబర్ కోర్టు హాల్లో ఏర్పాటు చేశారు. ఈ ధర్మాసనం గురువారం వైవాహిక జీవితానికి సంబంధించిన 10 బదిలీ పిటిషన్లు, 10 బెయిల్ పిటిషన్ కేసులు, 9 సివిల్, మూడు క్రిమినల్ కేసులు సహా మొత్తం 32 కేసులను విచారించింది.

కాగా, సుప్రీంకోర్టులో మొట్టమొదటిసారిగా 2013లో మహిళా ధర్మాసనం ఏర్పాటైంది. జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రా, జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ లతో ద్విసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రెండోసారి 2018లో జస్టిస్ ఆర్. భానుమతి, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు తాజాగా మూడోసారి మహిళా ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం సుప్రీంకోర్టులో 27 మంది న్యాయమూర్తులు ఉండగా.. అందులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ బీవీ నాగరత్న ఉన్నారు. వీరిలో జస్టిస్ బీవీ నాగరత్న భారత ప్రధాన న్యాయమూర్తి పదవి రేసులో ఉన్నారు. 2027లో ఆమె 36 రోజులపాటు సుప్రీం చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే సుప్రీంకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన మహిళగా రికార్డు సృష్టించనున్నారు.

కాగా, సుప్రీంకోర్టు అపెక్స్ కోర్టులో తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ ఫాతిమా బీవీ 1989 సంవత్సరంలో బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి ఇప్పటిదాకా సుజాతా మనోహర్, రూమా పాల్, జ్ఞాన్ సుధా మిశ్రా, ఆర్. భానుమతి, రంజన ప్రకాశ్ దేశాయ్, ఇందూ మల్హోత్రా, హిమా కోహ్లీ, ఇందిరా బెనర్జీ, బీవీ నాగరత్న, బేలా త్రివేది దేశ అత్యున్నత న్యాయస్థానంలో మహిళా న్యాయమూర్తులుగా నియమితులయ్యారు.

Next Story