Telugu Global
National

ఇక్కడే తింటాం, ఇక్కడే ఉంటాం.. తగ్గేది లేదంటున్న రెజ్లర్లు

ఇలాంటి ఆరోపణలు ఇంకెవరిపై అయినా వస్తే వెంటనే చర్యలు తీసుకోవడం, ఆ పోస్ట్ నుంచి తొలగించడం జరిగి ఉండేవి. కానీ బ్రిజ్ భూషణ్ విషయంలో కేంద్రం ఆ సాహసం చేయలేదు.

ఇక్కడే తింటాం, ఇక్కడే ఉంటాం.. తగ్గేది లేదంటున్న రెజ్లర్లు
X

భారత మహిళా మల్లయోధులు ఆందోళనబాట పట్టారు. లైంగిక వేధింపుల వ్యవహారంలో గతంలో క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇచ్చిన హామీతో వెనక్కి తగ్గిన రెజ్లర్లు.. ఈసారి తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలు తమకు అనుకూలంగా లేవన్నారు. తాజాగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్లో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ పై ఫిర్యాదు చేశారు. ఏడుగురు మహిళా రెజ్లర్లు, తమపై అఘాయిత్యం జరిగిందని ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, నిరసన తెలుపుతూ ఈరోజు జంతర్ మంతర్ వద్ద మరోసారి దీక్ష చేపట్టారు.

ఈసారి తాము తగ్గేది లేదంటున్నారు రెజ్లర్లు. ఇక్కడే తింటాం, ఇక్కడే నిద్రపోతాం, సమస్య పరిష్కారమయ్యే వరకు ఇక్కడే ఉంటామని చెబుతున్నారు. వినేశ్ ఫొగట్, సాక్షి మాలిక్ సహా పలువురు అంతర్జాతీయ మెడలిస్ట్ లు, దేశీయ మహిళా రెజ్లర్లు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. అంతర్జాతీయ మీడియా ఈ వ్యవహారాన్ని హైలెట్ చేస్తే అది దేశ ప్రతిష్టకే కలంకంగా మారుతుందనే అనుమానాలున్నాయి. అందుకే ఆమధ్య కేంద్రం మధ్యవర్తిత్వం చేసింది. కానీ సమస్య పరిష్కారం కాలేదు. మహిళా రెజ్లర్లు ఆరోపించిన విషయాలకు తగిన సాక్ష్యాధారాలు లేవనే కారణంతో ఆయా వ్యక్తులపై చర్యలు తీసుకోడానికి కేంద్రం వెనకడుగు వేసింది. కనీసం ప్రభుత్వ ప్యానెల్ నివేదిక కూడా బయట పెట్టలేదు. కానీ రెజ్లర్లు మాత్రం వెనకడుగు వేయలేదు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మరోసారి రోడ్డెక్కారు.

టార్గెట్ బ్రిజ్ భూషణ్..

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై మహిళా రెజ్లర్లు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఆయన బీజేపీ మనిషి. యూపీలోని కైసేర్ గంజ్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ముద్దాయిగా ఉండి ఆ తర్వాత నిర్దోషిగా బయటపడ్డారు. ఇలాంటి ఆరోపణలు ఇంకెవరిపై అయినా వస్తే వెంటనే చర్యలు తీసుకోవడం, ఆ పోస్ట్ నుంచి తొలగించడం జరిగి ఉండేవి. కానీ బ్రిజ్ భూషణ్ విషయంలో కేంద్రం ఆ సాహసం చేయలేదు. బాధితులంతా మహిళలు, దేశానికి పతకాలు సాధించి పెట్టిన క్రీడాకారులైనా కూడా కేంద్రం కనికరించకపోవడం ఆందోళన కలిగించే విషయం. అగ్రశ్రేణి క్రీడాకారులంతా రోడ్డెక్కి నిరసనలు తెలియజేస్తున్నా కేంద్రం పట్టీపట్టనట్టు ఉంది. దీంతో మరోసారి వారు జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టారు. న్యాయపోరాటానికి సిద్ధమంటున్నారు.

First Published:  23 April 2023 12:54 PM GMT
Next Story