Telugu Global
National

80 శాతం మంది మహిళలు అన్-పెయిడ్ డొమెస్టిక్ వర్కర్లే !

దేశంలో మహిళలు ఎలాంటి జీతం లేకుండానే బండెడు చాకిరీ చేయాల్సి వస్తోంది. చిన్న నాటి నుండే వాళ్ళను ఇంటిపనుల్లో నిమగ్నం చేస్తున్నారు. దేశంలోని 80 శాతం మంది మహిళలు జీతంలేని ఇంటి పనివారుగా ఉన్నారని ఈస్ట్ ఆంగ్లియా, బర్మింగ్ హామ్, బ్రూనెల్ యూనివర్సిటీలు చేసిన పరిశోధనలు తేల్చాయి.

80 శాతం మంది మహిళలు అన్-పెయిడ్ డొమెస్టిక్ వర్కర్లే !
X

ఈ ప్రంపంచంలో మగాళ్లకో న్యాయం, ఆడాళ్ళకో న్యాయమా ? ఇంట్లో బండెడు చాకిరీ అంతా ఇల్లాలిదేనా ? మగాడు ఆఫీసుకెళ్తే స్త్రీ ఇంట్లో పొద్దున్నే లేచి వంట లేదా టిఫిన్ చేసి పిల్లలకు స్నానం చేయించి..తినిపించి వాళ్ళను స్కూలుకు పంపేవరకే తలప్రాణం తోకకొచ్చినంత పనవుతుంది. ఇక భర్తగారు నిద్ర లేచేసరికి ఆయనకు అన్నీ సమకూర్చి పెట్టాల్సిందే.. భార్య కూడా ఉద్యోగం చేస్తే ఆ ఇంట్లో నిత్య సమరమే ! ఇంట్లో పెద్దోళ్ళుంటే అది వేరు.. కాస్త వాళ్ళు సాయపడతారు. లేదా వాళ్ళకీ చాకిరీ చేయాల్సి వస్తే ఆమె.. లేదా అతని గొణుగుళ్ళకు హద్డుండదు. ఇండియాలో అయినా మరే ఇతర దేశంలోనైనా ఈ కుటుంబ వ్యవస్థ ఓ మహా నిత్య క్రతువులా సాగుతుంది. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే మగాళ్ల కన్నా ఆడవారే ఇంటి పనులతో ఎక్కువగా సతమతమైపోతుంటారని, ఇందుకు ఆఫీసులో పని చేస్తే వచ్చే జీతంలాంటిదేమీ ఇంటి పని చేస్తే ఉండదని ఓ స్టడీ చెబుతోంది. ఈస్ట్ ఆంగ్లియా, బర్మింగ్ హామ్, బ్రూనెల్ యూనివర్సిటీలు పరిశోధన చేసి ఈ విషయాన్ని తేల్చాయి. నిజంగా ఇది సర్వే చేయాల్సినంత పనేమీ కాదు. మనం రోజూ ప్రతి ఇంటా చూస్తున్న తంతే ! దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యవహారమే !

ఇండియాలో దేశవ్యాప్తంగా మహిళలకు ఇంటి పనులు పెరిగిపోయి నానా ఇక్కట్లు పడుతున్నారని ఈ యూనివర్సిటీల రీసెర్చర్లు చెబుతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి వర్గాల్లో ఈ ట్రెండ్ ఎక్కువగా ఉందట. ఇంట్లో పనిమనుషులను పెట్టుకున్నాఆ ఇంటి మహిళ చేసే పనులు మాత్రం తగ్గడం లేదు.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సుమారు 80 శాతం మంది మహిళలు అన్-పెయిడ్ డొమెస్టిక్ వర్కర్లే ! మగాళ్లు ఎంత సాయం చేసినా బండెడు చాకిరీ వాళ్లదే !

వయసొచ్చిన మహిళలే కాదు.. పేద పిల్లలు సైతం ఈ 'శాపానికి' గురవుతున్నారని వీళ్ళు తేల్చారు. ఇండియాతో బాటు ఇథియోపియా, పెరు, వియత్నాం వంటి అనేక దేశాల్లో 8 నుంచి 22 ఏళ్ళ మధ్య వయసున్న పిల్లలు, యువతులు ఇంటి పనులను నెత్తికోక తప్పడంలేదు. దాదాపు 12 వేలమందిని రీసెర్చర్లు స్టడీ చేస్తే .. తేలిన నిజమిది ! పిల్లలైతే తమ వయసుకు మించి వ్యవసాయంతో సహా అనేక పనుల్లో తమ తలిదండ్రులకో, తమ కుటుంబానికో ఆధారంగా ఉంటున్నారు. మరి వీళ్లకు ఎంప్లాయ్ మెంట్, వేజెస్ (వేతనాలు) వంటివి ఉంటాయా అంటే దాని గురించి మాట్లాడకపోవడమే మంచిది.. పెయిడ్ వర్క్ అన్న ఊసే లేదు.. ఈ తరహా పోకడలు ప్రస్తుత అసమానతలకు అద్దం పడుతున్నాయి. యూనిసెఫ్ నివేదిక ప్రకారం.. అబ్బాయిల కన్నా అమ్మాయిలు 40 శాతం ఎక్కువగా ఇంటిపనుల్లో సతమతమవుతుంటారట.. పేద కుటుంబాల్లో అయితే చిన్న వయసులోనే నాగళ్లు పట్టుకుని పొలం దున్నే అమ్మాయిలను చూస్తాం.. ఒక్కోసారి కాడినెత్తుకునే పశువుల 'బాధ్యత' కూడా వాళ్లే మోస్తున్నారు. ఇండియాలో చాలా చోట్ల కొన్ని సందర్భాల్లో ఇలాంటి దృశ్యాలను చూస్తాం.. యంగర్ ఏజ్ లోనే ఇంటిపనుల్లో నిమగ్నమయ్యే బాలికలను చూస్తే జెండర్ ట్రాజెక్టరీల్లో పెరుగుతున్న అసమానతలు కళ్ళకు కనబడతాయని డా. వసిలోకస్ అనే నిపుణుడు నిట్టూర్చాడు. ఈయన నార్విచ్ లోని బిజినెస్, ఎకనామిక్స్, పబ్లిక్ పాలసీ సంస్థలో పని చేస్తున్నాడు. ఇలా అసమానతల ప్రభావం కారణంగా స్కూలు విద్యకు పిల్లలు దూరమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వారి భవిష్యత్ ఉపాధి అవకాశాలను కూడా దెబ్బ తీస్తోందని వాపోయాడు. ఇలాగే ఆడపిల్లలు చాలాసేపు ఇంటిపనుల్లో సతమతమవుతున్న కారణంగా వారి స్టడీ లేదా ఉద్యోగావకాశాలు సన్నగిల్లుతున్నాయని బర్మింగ్ హామ్ బిజినెస్ స్కూలుకు చెందిన ప్రొఫెసర్ ఫ్లోనా కార్మికేల్ కూడా అభిప్రాయపడ్డారు. అంటే మహిళల ఇంటి చాకిరీ వారి బాల్యం నుంచే ప్రారంభమవుతుందని ఆయన తేల్చాడు. ఇక కరోనా పాండమిక్ సమయంలో అయితే చెప్పే పనే లేదట.. ఇంతటి పరిస్థితిని ఆడపిల్లలు లోగడ ఎన్నడూ ఎదుర్కోలేదని షిరీన్ కంజి, శ్రీనిధి మిశ్రా వంటి ప్రొఫెసర్లు బాధపడ్డారు. వీళ్లలో షిరీన్ కంజి లండన్ లోని బ్రునెల్ యూనివర్సిటీలో మానవ వనరుల విభాగంలో పని చేస్తుండగా.. శ్రీనిధి మిశ్రా.. ఢిల్లీకి చెందిన సోషియాలజిస్ట్ ! ఈ దృష్ట్యా ఆడ పిల్లలకు కూడా ప్రభుత్వాలు చైల్డ్ కేర్ అలవెన్సులు, క్యాష్ ట్రాన్స్ ఫర్లు వంటి ప్రయోజనాలను కల్పించాలన్నది వీరి అభిప్రాయం.. లేదా నగదు వోచర్లయినా ఇచ్చి వారిని ఆదుకోవాలన్నది వీరి మానవతా దృక్పథం !

అయినా నువ్వు ఉద్యోగం చేసి ఊళ్లేలా ? ఏమైనానా అన్న పెడదారి పోకడలున్నంత కాలం ఆడపిల్లలు ఉసూరుమనాల్సిందే ! ఏ గురజాడ వంటి సంఘ సంస్కర్తలో వస్తేనే ఈ సమాజం కాస్త బాగుపడుతుందనుకోవడం భ్రమగా కాకుండా నిజమే అయితే అంతకంటే కావలసింది ఏముంది ?





First Published:  23 July 2022 6:17 AM GMT
Next Story